తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా (బైతుల్ మఖ్దిస్) వరకు రాత్రి వేళ తీసుకు పోయిన ఆయన (అల్లాహ్) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్ లను) చూపటానికి చేశాము.[1] నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.
[1] 'ఈ ప్రయాణాన్ని మేము మా దాసునికి కొన్ని అద్భుత నిదర్శనాలు, సంకేతాలను చూపటానికి చేయించాము.' ఇంత దూరప్రయాణం రాత్రిపూట స్వల్పకాలంలో పూర్తి చేయించడం కూడా ఒక అద్భుత సూచనయే. ఈ ప్రయాణం రెండు భాగాలలో ఉంది. (1) మొదటి భాగం : ఇస్రా' జిబ్రీల్ ('అ.స.) తెచ్చిన బుర్రాఖ్ పై ఎక్కి అతనితో బాటు, మక్కా ముకర్రమా నుండి బైతుల్-మఖ్దిస్ కు రాత్రిపూట పయనించడం, అక్కడ మహాప్రవక్త ('స'అస) సర్వదైవప్రవక్తలకు ('అలైహిమ్ స.) ఇమాముగా నిలిచి నమా'జ్ చేయించడం. (2) రెండో భాగం మే'రాజ్ : అంటే పైకి ఎక్కించబడటం, లేక పైకి తీసుకొని పోబడటం. బైతుల్-మఖ్దిస్ నుండి ఆకాశాలలోనికి, చివరకు సిద్రతుల్ ముంతహా వరకు పోయిన ప్రయామం. అది 'అర్ష్ క్రింది ఏడవ ఆకాశంపై ఉంది. అక్కడ అతనికి ('స'అస) అల్లాహుతా'ఆలా వ'హీ ద్వారా నమా'జ్ మరియు ఇతర ఆదేశాలు ఇచ్చాడు. ఆ విషయాలు 'స'హీ'హ్ 'హదీస్ లలో పేర్కొనబడ్డాయి. మే'రాజ్ గురించి కొంతవరకు సూరహ్ అన్-నజ్మ్ (53) లో కూడ ఉంది. మే'రాజ్ సమయంలో దైవప్రవక్త ('స'అస), ఆకాశాలలో ఇతర ప్రవక్తలతో కలుసుకున్నారు. ఈ ప్రయాణం దైవప్రవక్త పూర్తి చేసింది కలలో కాదు. అతను శారీరకంగా మేల్కొని ఉండి, పూర్తి స్పృహలో ఉన్న స్థితిలో (Bodily, Fully awake and with Full Consciousness and orientation of Mind) చేశారు. ఈ ప్రయాణం అల్లాహుతా'ఆలా ఆజ్ఞతో జరిగింది. అల్లాహ్ (సు.తా.) తాను కోరినది చేస్తాడు. ఇది జరిగిన కాలం మరియు తేదీలలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు రబీ'అ అల్ అవ్వల్ 17 లేక 27వ తేదీలలో అని, మరి కొందరు రజబ్ 27 అని, మరి కొందరు ఇతర నెలలని కూడా అంటారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము[1] మరియు దానిని ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి, దాని ద్వారా ఇలా ఆజ్ఞాపించాము: "నన్ను (అల్లాహ్ ను) తప్ప మరెవ్వరినీ సంరక్షకునిగా (కార్యసాధకునిగా) చేసుకోవద్దు.
[1] అల్లాహుతా'ఆలా మూసా ('అ.స.)తో సూటీగా మాట్లాడిన దానికి చూడండి, 4:164, 7:144.
మరియు మేము గ్రంథంలో ఇస్రాయీల్ సంతతి వారిని ఇలా హెచ్చరించాము: "మీరు భువిలో రెండు సార్లు సంక్షోభాన్ని రేకెత్తిస్తారు, మరియు గొప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తారు!"
ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధనిపుణులైన మా దాసులను పంపాము.[1] వారు మీ గృహాలలోకి దూసుకెళ్ళారు. మరియు ఈ విధంగా మా వాగ్దానం నెరవేర్చబడింది.
[1] మొదటి శిక్ష దాదాపు క్రీస్తు శ ఆరంభానికి 600 సంవత్సరాలకు ముందు వచ్చింది. ఇది బాబిలోనియన్ పాలకుడు బ'ఖ్త్ న'స్ర్ ఇస్రాయీ'ల్ సంతతి వారిపై జెరూసలంలో చేసిన దౌర్జన్యం. అతడు ఎంతో మంది యూదులను చంపి మిగిలిన వారిని ఖైదీలుగా, బానిసలుగా చేసుకున్నాడు. ఈ శిక్ష వారు దైవప్రవక్తలను చంపినందుకు మరియు తౌరాత్ ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు పడింది. కొందరి అభిప్రాయంలో ఈ రాజు జాలూత్. ఆ తరువాత 'తాలూత్ సైన్యాధిపత్యంలో ఉన్న దావూద్ ('అ.స.) జాలూత్ ను సంహరించి వారికి విముక్తి కలిగించారు.
ఆ తరువాత మేము మీకు వారిపై మరల ప్రాబల్యం వహించే అవకాశం కలిగించాము. మరియు సంపదతోనూ మరియు సంతానంతోనూ మీకు సహాయం చేశాము మరియు మీ సంఖ్యా బలాన్ని కూడా పెంచాము.
(మరియు మేము అన్నాము): "ఒకవేళ మీరు మేలు చేస్తే అది మీ స్వయం కొరకే మేలు చేసుకున్నట్లు. మరియు ఒకవేళ మీరు కీడు చేస్తే అది మీ కొరకే!" పిదప రెండవ వాగ్దానం రాగా మీ ముఖాలను (మిమ్మల్ని) అవమాన పరచటానికి, మొదటిసారి వారు మస్జిద్ అల్ అఖ్సాలో దూరినట్లు, మరల దూరటానికి మరియు వారికి అందిన ప్రతి దానిని నాశనం చేయటానికి (మీ శత్రువులను మీపైకి పంపాము).[1]
[1] రెండవసారి యూదులు అత్యాచారాలు చేశారు. జ'కరియ్యా ('అ.స.)ను చంపారు. ఏసు క్రీస్తును సిలువపై ఎక్కించగోరారు కాని అల్లాహుతా'ఆలా అతనిని సజీవునిగా ఆకాశాలలోకి ఎత్తుకున్నాడు. అప్పుడు అల్లాహుతా'ఆలా రోమన్ పాలకుడు టైటస్ ను వారి పైకి పంపాడు. అతడు జేరూసలంపై దండయాత్ర చేసి యూదులను నాశనం చేశాడు. వారిని ఖైదీలుగా, బానిసలుగా చేసుకున్నాడు. హైకిలె సులేమాన్ ను నాశనం చేశాడు. యూదులను బైతుల్ మ'ఖ్దిస్ నుండి వెళ్ళగొట్టాడు. ఇది దాదాపు క్రీ.శ. 70వ సంవత్సరంలో జరిగింది.
(మరియు తౌరాత్ లో ఇలా అన్నాము): "బహుశా మీ ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని కరుణించవచ్చు! కాని ఒకవేళ మీరు అలాగే ప్రవర్తిస్తే, మేము కూడా తిరిగి అలాగే చేస్తాము. మేము నరకాగ్నిని, సత్యతిరస్కారుల కొరకు చెరసాలగా చేసి ఉంచాము."
నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫలముందనే శుభవార్తనూ అందజేస్తుంది;
మరియు మేము రాత్రింబవళ్ళను రెండు సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనం చేశాము. మరియు పగటి సూచనను - మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు సంవత్సరాల లెక్క పెట్టటానికి మరియు (కాలాన్ని) గణించటానికి - ప్రకాశవంతమైనదిగా చేశాము. మరియు మేము ప్రతి విషయాన్ని వివరించి స్పష్టంగా తెలిపాము.
మరియు మేము ప్రతి మానవుని మెడలో అతని కర్మలను[1] కట్టి ఉంటాము. మరియు పునరుత్థాన దినమున అతని (కర్మ) గ్రంథాన్ని అతని ముందుపెడ్తాము, దానిని అతడు స్పష్టమైనదిగా గ్రహిస్తాడు.
[1] చూడండి, 'స. బు'ఖారీ, పు. 9, 'హ. నం. 625. ఇమామ్ షౌకాని 'తాయిరతున్ - అంటే మానవుని అదృష్టం లేక భవిష్యత్తు, అని అన్నారు. అల్లాహుతా'ఆలా కు జరుగబోయేది అంతా తెలుసు కాబట్టిఆయన ప్రతివాని అదృష్టం వ్రాసి అతని వెంట ఉంచుతాడు. అందుకొరకే దాని ప్రకారం అతని కర్మలు (మంచి-చెడులు) ఉంటాయి. పునరుత్థాన దినమున వాటికి తగినట్టి ప్రతిఫలమే దొరుకుతుంది.
ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో, అతడు నిశ్చయంగా, తన మేలుకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో, అతడు నిశ్చయంగా, తన నష్టానికే మార్గభ్రష్టుడవుతాడు. మరియు బరువు మోసే వాడెవ్వడూ మరొకని బరువును మోయడు.[1] మరియు మేము ఒక ప్రవక్తను పంప నంత వరకు (ప్రజలకు) శిక్ష విధించేవారము కాము.
[1] ఇలాంటి సందేశానికి చూడండి, 6:164, 35:18, 39:7 మరియు 53:38. దీని మరొక తాత్పర్యం: 'భారం మోసేవానిపై మరొకని భారం మోపబడదు.'
మరియు మేము ఒక నగరాన్ని నాశనం చేయదలచు కున్నప్పుడు (మొదట) అందులో ఉన్న స్థితిమంతులకు ఆజ్ఞ పంపుతాము; ఆ పిదప కూడా వారు భ్రష్టాచారానికి పాల్పడితే! అప్పుడు దానిపై (మా) ఆదేశం జారీ చేయబడుతుంది. అప్పుడు మేము దానిని నాశనం చేస్తాము.
ఎవడు (ఇహలోక) తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో - మేము కోరిన వానికి - దానిలో మాకు ఇష్టం వచ్చినంత, ఒసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము, దానిలో అతడు అవమానంతో బహిష్కరించ బడినవాడై దహింపబడతాడు.
మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు.[1] ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ ముసలివారైతే, వారితో విసుక్కుంటూ: "ఛీ! (ఉఫ్)" అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు.
[1] అల్లాహుతా'ఆలా ఈ ఆయత్ లో తన ఆరాధన తరువాత, రెండో స్థానంలో, తమ తల్లిదండ్రులతో మంచిగా వ్యవహించాలని ఆజ్ఞాపించాడు. దీనితో వారి ఆదరణ, ఆజ్ఞాపాలన మరియు వారికి వినయవిధేయతలు చూపటం ఎంత ముఖ్యమో తెలుస్తోంది.
మరియు వారి మీద కరుణ మరియు వినయవిధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదే విధంగా నీవు వారి యెడల కరుణను చూపు!"
మరియు బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు, వారి హక్కు ఇవ్వు.[1] మరియు (నీ ధనాన్ని) వృథా ఖర్చులలో వ్యర్థం చేయకు.
[1] ఇక్కడ విశదమయ్యేది ఏమిటంటే మన సంపత్తిలో దగ్గరి బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది. కావున వారికి ఇవ్వటం, వారిని కనికరించటమని భావించరాదు. వారికి, వారి హక్కు ఇవ్వని వారు అల్లాహుతా'ఆలా దృష్టిలో నిందార్హులు. ఈ ఆయత్ లో పేర్కొన్నట్లు ధన సహాయానికి మొట్టమొదటి హక్కుదార్లు, దగ్గరి బంధువులు, ఎవరి పోషణైతే విధి కాదో వారు, తరువాత పేదవారు ఆ తరువాత బాటసార్లు అని తెలుస్తోంది.
మరియు నీవు (పిసినారితనంతో) నీ చేతిని నీ మెడకు కట్టుకోకు[1] మరియు దానిని పూర్తిగా స్వేచ్ఛగా కూడా వదలి పెట్టకు. అలా చేస్తే నిందలకు గురి అవుతావు, దిక్కులేని వాడవై కూర్చుంటావు (విచారిస్తావు).
నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి తగ్గిస్తాడు. నిశ్చయంగా, ఆయనే తన దాసుల (స్థితుల)ను బాగా ఎరిగేవాడూ, చూసేవాడూను!
మరియు పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని చంపకండి. మేమే వారికి మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చేవారము. నిశ్చయంగా, వారిని చంపటం గొప్ప నేరం.[1]
[1] చూడండి, 6:137, 6:151, 81:8-9లలో మరియు 'స'హీహ్ బు'ఖారీలో: 'షిర్క్ తరువాత ఘోరపాపం, పేదరికానికి భయపడి తన సంతానాన్ని హత్య చేయటం.' అని ఉంది. అంటే, పేమిలీ ప్లానింగ్ చేయటం, అబార్షన్ చేయించుకోవటం.
న్యాయానికి తప్ప, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా చంపకండి.[1] ఎవడు అన్యాయంగా చంపబడతాడో, మేము అతని వారసునికి (ప్రతీకార) హక్కు ఇచ్చి ఉన్నాము.[2] కాని అతడు హత్య (ప్రతీకార) విషయంలో హద్దులను మీరకూడదు. నిశ్చయంగా, అతనికి (ధర్మప్రకారం) సహాయ మొసంగబడుతుంది.
[1] చూడండి, 2:190. అంటే, ధర్మయుద్ధంలో గానీ లేక న్యాయ ప్రతీకారానికి గానీ, లేక ఆత్మరక్షణకు గానీ కాకుండా, అన్యాయంగా ఏ ప్రాణిని కూడా చంపరాదు. [2] అల్-ఖి'సా'సు: న్యాయ ప్రతీకారం. చూడండి, 2:178. ఇక్కడ వలీ అంటే రక్తసంబంధీకుడైన దగ్గర బంధువు అని అర్థం.
మరియు అతడు యుక్తవయస్సుకు చేరనంత వరకు - సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని ఆస్తిని సమీపించకండి. మరియు చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయండి, నిశ్చయంగా వాగ్దానం గురించి ప్రశ్నించడం జరుగుతుంది.[1]
[1] మానవుడు అల్లాహ్ (సు.తా.)తో చేసుకున్న వాగ్దానమైనా, లేక తన తోటి మానవునితో చేసిన వాగ్దానమైనా దానిని తప్పక పూర్తి చేయాలి, లేకుంటే పునరుత్థాన దినమున దానిని గురించి ప్రశ్నించడం జరుగుతుంది.
మరియు మీరు కొలిచి ఇచ్చేటప్పుడు కొలత పాత్ర నిండుగా కొలిచి ఇవ్వండి. మరియు (తూచి ఇచ్చేటప్పుడు) త్రాసుతో సమానంగా తూకం చేయండి. ఇదే మంచి పద్ధతి మరియు (ఇదే) చివరకు మంచి ఫలితం ఇస్తుంది.
మరియు (ఓ మానవుడా!) నీకు తెలియని విషయం వెంటబడకు.[1] నిశ్చయంగా చూపులూ, వినికిడీ మరియు హృదయం వీటన్నింటినీ గురించీ, (తీర్పు దినమున) ప్రశ్నించడం జరుగుతుంది.
[1] అంటే నీకు తెలియని దానిని గురించి ఇతరులపై అనుమానపడకు. మరియు నీకు తెలియని దానిని అనుసరించకు.
ఇవి వివేకంతో నిండి వున్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలియజేశాడు. మరియు అల్లాహ్ తో పాటు మరొకరిని ఆరాధ్య దైవంగా చేసుకోకు. అలా చేస్తే అవమానానికి గురి అయి, బహిష్కరించబడి నరకంలో త్రోయబడతావు.
మరియు వారు వాస్తవానికి హితబోధ పొందుతారని, మేము ఈ ఖుర్ఆన్ లో అనేక విధాలుగా బోధించాము.[1] కాని అది వారి వ్యతిరేకతను మాత్రమే అధికం చేస్తున్నది.
[1] ప్రతివిధంగా బోధించాము: అంటే పూర్వకాలపు ప్రజల కథలు చెప్పి, ఉదాహరణలు, ఉపమానాలు ఇచ్చి, హితబోధలు చేసి, పర్యవసానాలు చూపి, అనేక విధాలుగా అల్లాహ్ (సు.తా.) ఖుర్ఆన్ లో బోధించాడు, భయపెట్టాడు. బహుశా మానవులు గుణపాఠం నేర్చుకొని, అతి స్వల్పకాలపు ఈ జీవితంలో విశ్వసించి, సత్కార్యాలు చేసి, రాబోయే శాశ్వత జీవితంలో ఎడతెగని సుఖసంతోషాలు పొందాలని. కాని చాలా మంది దానిని అర్థం చేసుకోలేక పోతున్నారు. తమ భ్రష్టాచారాలను మరింత అధికం చేసుకుంటున్నారు.
వారితో అను: "ఒకవేళ వారు వారన్నట్లు అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, వారు కూడా (అల్లాహ్) సింహాసనానికి (అర్ష్ కు) చేరే మార్గాన్ని వెతికే వారు కదా!"[1]
[1] ఈ ఆయత్ ను వ్యాఖ్యాతలు రెండు విధాలుగా బోధించారు: (1) ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది రాజులు ఉంటే, వారిలో ప్రతి ఒక్కడు భూమిలో ప్రతి చోటా తన అధికారాన్నే నెలకొల్పటానికి పాటు పడతాడు. అదే విధంగా ఈ ఇతర దేవతలు కూడా ప్రయత్నించేవారు, ఒకవేళ వారు ఉండి ఉంటే! అది ఇంత వరకు జరుగలేదు. అంటే అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక విశ్వసామ్రాజ్యాధిపతి లేడు. (2) ఏ విధంగానైతే ముష్రికులు భావిస్తున్నారో: వారు ఆరాధించేవారు ఇంత వరకు అల్లాహ్ (సు.తా.) సాన్నిహిత్యాన్ని పొంది ఉన్నారు మరియు తమను ఆరాధించే వారిని కూడా అల్లాహ్ (సు.తా.) దగ్గరకు తీసుకుపోవటానికి ప్రయత్నిస్తారు. ఇది సత్యం కాదు. ఈ విషయం అల్లాహుతా'ఆలా తన గ్రంథం (ఖుర్ఆన్)లో ఎన్నో సార్లు విశదం చేశాడు. చూడండి, 17:57.
సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తమూ ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన పవిత్రతను కొనియాడనిది, ఆయన స్తోత్రం చేయనటువంటిది ఏదీ లేదు, కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. నిశ్చయంగా, ఆయన ఎంతో సహనశీలుడు, క్షమాశీలుడు.
మరియు వారు గ్రహించకుండా, వారి హృదయాల మీద తెరలు మరియు వారి చెవులలో చెవుడు వేసి ఉన్నాము.[1] ఒకవేళ నీవు ఖుర్ఆన్ (పారాయణం) తో నీ ప్రభువు యొక్క ఏకత్వాన్ని ప్రస్తావిస్తే వారు అసహ్యంతో వెనుదిరిగి మరలిపోతారు.
వారు నీ మాటలను వింటున్నప్పుడు, వారు ఏమి వింటున్నారో మాకు బాగా తెలుసు. ఈ దుర్మార్గులు ఏకాంతంలో ఉన్నప్పుడు పరస్పరం గుసగుసలాడుతూ ఇలా చెప్పుకుంటారు: "మీరు అనుసరిస్తున్న ఈ మనిషి కేవలం మంత్రజాలానికి గురి అయిన వాడు మాత్రమే."
(ఓ ముహమ్మద్!) చూడు! వారు నిన్ను ఎలాంటి ఉదాహరణలతో పోల్చుతున్నారో, ఎందుకంటే వారు మార్గం తప్పారు, కావున వారు (సరైన) మార్గం పొందలేరు.[1]
[1] వారు దైవప్రవక్త ('స'అస) ను మాంత్రికుడు, మంత్రజాలానికి గురి అయినవాడు, పిచ్చివాడు, జ్యోతిష్యుడు అని నోటికి వచ్చినట్లు ఆరోపించారు. ఎందుకంటే వారు మార్గభ్రష్టులైన వారు కాబట్టి వారెన్నడూ మార్గదర్శకత్వం పొందలేరు.
"లేదా! తిరిగి సృష్టింపబడటానికి అసాధ్యమైనదని మీ హృదయాలు భావించే దానిగా ఉన్నా సరే! (తిరిగి లేపబడతారు)". వారు మళ్ళీ ఇలా అడుగుతారు: "మమ్మల్ని తిరిగి బ్రతికించి లేపగల వాడు ఎవడు?" వారితో అను: "ఆయనే, మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన వాడు!" వారు ఎగతాళిగా తలలు ఊపుతూ అంటారు: "అయితే! అది ఎప్పుడు సంభవిస్తుంది?" వారితో అను: "బహుశా ఆ సమయం సమీపంలోనే ఉండవచ్చు!"
ఆ దినమున, ఆయన మిమ్మల్ని పిలిచినపుడు! మీరు ఆయన పిలుపుకు సమాధానంగా ఆయనను స్తుతిస్తూ వస్తారు. మరియు మీరు కేవలం కొంత కాలం మాత్రమే (భూమిలో) ఉండి వున్నట్లు భావిస్తారు.[1]
[1] పరలోక జీవితంతో పోల్చితే ఇహలోక జీవితకాలం ఎంతో చిన్నది. పరలోక జీవితం అంతం లేనిది. మానవుని కాలగణనం ఈ భూలోకానికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే దాని గణన భూగోళపు తన చుట్టూ చేసే పర్యటనకు బద్ధమై ఉంది. చూడండి, 79:46, 20:102, 104, 30:55, 23:112, 114.
మరియు నా దాసులతో, వారు మాట్లాడేటప్పుడు మంచి మాటలనే పలకమని చెప్పు. (ఎందుకంటే) షైతాన్ నిశ్చయంగా, వారి మధ్య విరోధాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తుంటాడు. నిశ్చయంగా, షైతాన్ మానవుడికి బహిరంగ శత్రువు.[1]
[1] ఇది ప్రతి ఒక్కడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జ్ఞాపకముంచుకోవలసిన ఆయత్. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'మీలో ఎవ్వరు కూడా తన సోదరుని (ముస్లిం) వైపునకు ఆయుధాన్ని చూపకండి. ఎందుకంటే మీకు తెలియకుండానే షై'తాన్ ఆ ఆయుధాన్ని నడిపించి అతన్ని చంపించవచ్చు మరియు మీరు నరకాగ్నిలో పడి పోవచ్చు.' ('స. బు'ఖారీ, ముస్లిం). ఇంకా చూడండి, 16:125 మరియు 29:46.
మీ ప్రభువుకు మిమ్మల్ని గురించి బాగా తెలుసు. ఆయన కోరితే మిమ్మల్ని కరుణించ వచ్చు, లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షించవచ్చు! మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను వారి కార్యకర్తగా (రక్షకునిగా) నియమించి పంపలేదు.
మరియు భూమ్యాకాశాలలో ఉన్న వారందరినీ గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు వాస్తవానికి మేము కొందరు ప్రవక్తలకు మరికొందరిపై ఘనత నొసంగాము. మరియు మేము దావూద్ కు జబూర్[1] ఇచ్చాము.
[1] దావూద్ ('అ.స.) పై అవతరింపజేయబడిన దివ్యగ్రంథం 'జబూర్ (కీర్తనలు / Psalms).
వారితో ఇట్లను: "ఆయన (అల్లాహ్) ను కాదని మీరెవరినైతే (ఆరాధ్యదైవాలుగా) భావించారో, వారిని అర్థించి చూడండి; మీ ఆపదను తొలగించటానికి గానీ, దానిని మార్చటానికి గానీ వారికి ఎలాంటి శక్తి లేదు."
వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు.[1] నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే!
[1] వారు ఆ దైవాలు: అంటే, యూదులూ మరియు క్రైస్తవులు, దేవుళ్ళని భావించే 'ఉ'జైర్ ('అ.స.) లేక 'ఈసా ('అ.స.) గానీ ; లేక ముష్రికులు ఆరాధించే జిన్నాతులు గానీ, దైవదూతలు గానీ, కల్పిత దైవాలు గానీ, విగ్రహాలు గానీ లేక పుణ్యవంతులైన ముస్లింలు గానీ, లేక ఇతర వలీలు గానీ కావచ్చు. వీరంతా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందే మార్గాన్ని వెతుకుతున్నారు. అలాంటప్పుడు వారు ఇతరులకు ఏ విధంగా సహాయపడగలరు. వీరిని ఆరాధించటం మరియు వీరి సహాయం కోరటం షిర్క్. అల్లాహ్ (సు.తా.) షిర్క్ ను ఎన్నడూ క్షమించడు.
మరియు నిదర్శనాలను (ఆయాత్ లను) పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. కాని పూర్వకాలపు ప్రజలు వాటిని తిరస్కరించడమే తప్ప![1] మరియు మేము సమూద్ జాతి వారికి ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడ ఒంటెను పంపాము, కాని వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు.[2] మరియు మేము నిదర్శనాలను (ఆయాత్ లను) పంపుతున్నది, కేవలం ప్రజలు వాటిని చూసి భయపడటానికే!
[1] పూర్వకాలపు ప్రజలు తమ ప్రవక్తల నుండి నిదర్శనాలు (ఆయాత్) కోరారు. ఆ నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు విశ్వాసులు కాలేదు. దాని ఫలితంగా వారిపై అల్లాహ్ (సు.తా.) శిక్ష పడి వారు నాశనం చేయబడ్డారు. ఇదే విధంగా మక్కా ముష్రిక్ లు కూడా దైవప్రవక్త ('స'అస) నుండి నిదర్శనాలు కోరారు. మక్కా పర్వతాలను బంగారంగా మార్చమన్నారు. పూర్వ జాతి వారి వలే వీరూ నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా విశ్వసించరని మరియు వారంతా నాశనం చేయబడతారని అతను ('స'అస) నిదర్శనాలను కోరలేదు. (వివరాలకు చూడండి, ముస్నద్ అ'హ్మద్, పుస్తకం-1, పేజీ 258) [2] ఆ ఆడ ఒంటె నిదర్శనం కొరకు చూడండి, 7:73 మరియు 54:27.
"నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజలను పరివేష్టించి ఉన్నాడు." అని మేము నీతో చెప్పిన విషయం (జ్ఞాపకం చేసుకో)! మేము నీకు (ఇస్రా రాత్రిలో) చూపిన దృశ్యం[1] - మరియు ఖుర్ఆన్ లో శపించబడిన (నరక) వృక్షం[2] - మేము వారికి ఒక పరీక్షగా చేశాము. కాని మా భయ పెట్టడం, వారి తలబిరుసుతనాన్ని మాత్రమే మరింత అధికం చేస్తున్నది.
[1] దైవప్రవక్త ('స'అస) యొక్క రాత్రివేళ మస్జిద్ అల్-'హరాం నుండి మస్జిద్ అల్ అ'ఖ్సా మరియు అక్కడ నుండి సప్తాకాశాలలోనికి పోవటం మరియు తమ ప్రయాణాలలో సాక్షాత్తుగా చూసిన దృశ్యాల వివరణ విశ్వాసులకు వారి విశ్వాసాన్ని అధికం చేసింది మరియు సత్యతిరస్కారులకు వారి తలబిరుసుతనాన్ని. [2] ఆ నరకవృక్షఫలాలు, నరకవాసులకు ఆహారంగా ఇవ్వబడతాయి. దాని పేరు 'జఖ్ఖూమ్ (జెముడు వృక్షం). దాని వివరాలకు చూడండి, 37:62-66 44:43-44.
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము దేవదూతలతో: "ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని చెప్పినపుడు; ఒక్క ఇబ్లీస్ తప్ప, అందరూ సాష్టాంగపడ్డారు.[1] అతడు అన్నాడు: "ఏమీ? నీవు మట్టితో సృష్టించిన వానికి నేను సాష్టాంగం (సజ్దా) చేయాలా?"
[1] ఆదమ్ ('అ.స.) వివరాలక కొరకు చూడండి, 2:30-34, 7:11-18, 15:26-41 మరియు సూరహ్ లు 18, 20, 38 కూడా.
ఇంకా ఇలా అన్నాడు: "ఏమీ? నేను చూడటం లేదా? నీవు ఇతనికి వాపై ఆధిక్యత నిచ్చావు. కానీ ఒకవేళ నీవు నాకు పునరుత్థాన దినం వరకు వ్యవధినిస్తే, నేను ఇతని సంతతి వారిలో కొందరిని తప్ప అందరినీ వశపరచుకొని తప్పు దారి పట్టిస్తాను."[1]
మరియు నీవు నీ ధ్వనితో (మాటలతో) వారిలో ఎవరెవరిని ఆశ చూపి (ఆకర్షించగలవో) ఆకర్షించు.[1] మరియు నీ అశ్విక దళాలతో మరియు నీ పదాతి దళాలతో వారి మీద పడు.[2] మరియు వారికి సంపదలో, సంతానంలో భాగస్వామివికా[3] మరియు వారితో వాగ్దానాలు చెయ్యి.[4] మరియు షైతాన్ చేసే వాగ్దానాలు మోసపుచ్చటం తప్ప ఇంకేముంటాయి.[5]
[1] 'సౌతిక: నీ ధ్వని అంటే పాటలు, వాద్యాలు మరియు ఇతర మోసపుచ్చే మాటలు, అని అర్థం. వీటితో ష'తాన్ మానవులను మోసపుచ్చుతాడు. [2] దళాలు అంటే - షైతాను అడుగు జాడలను అనుసరించే మానవులు, జిన్నాతులు. [3] అమ్వాల్ వ అవ్ లాద్: అంటే సంపదలు మరియు సంతానం. అంటే నిషిద్ధ ( 'హరామ్) మార్గాలతో సంపాదించి, 'హరామ్ చేష్టలలో ఖర్చు చేసే ధనసంపత్తులు మరియు వ్యభారం వల్ల వచ్చే సంతానం. [4] 'షైతాన్ వాగ్దానాలు అంటే స్వర్గనరకాలు అనేవి ఏమీ లేవు, మరణించిన తరువాత పునరుత్థానం అనేది లేదు. మన జీవితం ఈ భూలోక జీవితం మాత్రమే. కావున వీలైనంత వరకు దీని సుఖసంతోషాలను మీకు తోచినట్లు అనుభవించండి, అని ప్రజలను మోసపుచ్చటం. [5] చూడండి, 4:120
నిశ్చయంగా, నా దాసులు! వారిపై నీకు ఏ విధమైన అధికారం లేదు.[1] మరియు వారికి కార్యకర్తగా (రక్షకునిగా) నీ ప్రభువే చాలు!"
[1] నా దాసులు: అంటే అల్లాహ్ (సు.తా.) ను నమ్ముకుని ఆయనపై ఆధారపడి, ఆయన చూపిన మార్గం మీదనే నడిచే సద్పురుషులు. అల్లాహ్ (సు.తా.) అలాంటి వారి, రక్షకుడు మరియు కార్యకర్త. షై'తాన్ కు అలాంటి వారిపై ఎలాంటి అధికారం ఉండదు. చూడండి, 14:22 మరియు 15:42
మరియు ఒకవేళ సముద్రంలో మీకు ఆపద వస్తే ఆయన (అల్లాహ్) తప్ప, మీరు పిలిచేవారందరూ మిమ్మల్ని త్యజిస్తారు. కాని, ఆయన మిమ్మల్ని రక్షించి, ఒడ్డుకు చేర్చినపుడు, మీరు ఆయన నుండి ముఖం త్రిప్పుకుంటారు. వాస్తవానికి మానవుడు ఎంతో కృతఘ్నుడు.
ఏమీ? ఆయన! నేల చీలిపోయి మిమ్మల్ని మ్రింగకుండా; లేదా తుఫాను మీపై రాకుండా; మిమ్మల్ని సురక్షితంగా ఉండనివ్వగలడని మీరు భావిస్తున్నారా?"[1] అప్పుడు మీరు ఏ రక్షకుడినీ పొందలేరు.
[1] ఏ విధంగానైతే అల్లాహ్ (సు.తా.) కు అవిధేయులైన, పూర్వ తరాల వారు శిక్షింపబడ్డారో, అలా మీరు కూడా శిక్షింపబడరని భావిస్తురా?
లేదా! మరొకసారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి - మీ కృతఘ్నతకు ఫలితంగా - మీ మీద తీవ్రమైన తుఫాను గాలిని పంపి, మిమ్మల్ని ముంచి వేయకుండా సురక్షితంగా ఉండనివ్వగలడని భావిస్తున్నారా? అప్పుడు మాకు విరుద్ధంగా[1] సహాయపడే వారినెవ్వరినీ మీరు పొందలేరు.
[1] తబీ'ఉన్: పగతీర్చుకునేవాడు, కక్ష తీర్చుకునేవాడు. అంటే ఒకసారి మిమ్మల్ని సముద్రంలో తుఫాన్ నుండి క్షేమంగా బయట పెట్టిన తర్వాత ఆయన (అల్లాహుతా'ఆలాయే) మీ అవిధేయతకు కారణంగా మీరు మరల సముద్రంలోకి పోయినపుడు మిమ్మల్ని ముంచి వేయ వచ్చని మీరు భయపడరా? అప్పుడు ఆయన (సు.తా.)కు విరుద్ధంగా మీకు, మీ కల్పిత దైవాలు ఎవ్వరూ సహాయపడలేరు.
మరియు వాస్తవానికి మేము ఆదమ్ సంతతికి గౌరవము నొసంగాము.[1] మరియు వారికి నేల మీదనూ, సముద్రం లోనూ, ప్రయాణం కొరకు వాహనాలను ప్రసాదించాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాము. మరియు మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చాము.
[1] చూడండి 2:31, వారికి మంచి చెడును అర్థం చేసుకునే విచక్షణా శక్తినీ, బుద్ధినీ ప్రసాదించాము.
(జ్ఞాపకముంచుకోండి!) ఒకరోజు మేము మానవులందరినీ వారి వారి నాయకులతో (ఇమామ్ లతో) సహా పిలుస్తాము.[1] అప్పుడు వారి కర్మపత్రాలు కుడిచేతిలో ఇవ్వబడిన వారు,[2] తమ కర్మ పత్రాలను చదువుకుంటారు మరియు వారికి రవ్వంత (ఖర్జూర బీజపు చీలికలోని పొరంత) అన్యాయం కూడా జరగదు.
[1] ఇమామ్: అంటే నాయకుడు ఇక్కడ వ్యాఖ్యాతలు దీనికి మూడు అర్థాలిచ్చారు. 1) దైవప్రవక్తలు, 2) దివ్యగ్రంథాలు, 3) కర్మపత్రాలు. ప్రతి ఒక్కరు తమ కాలపు దైవప్రవక్త లేక దివ్యగ్రంథం లేక కర్మపత్రంతో పిలువబడతారు. ఇబ్నె-కసీ'ర్ మరియు షౌకాని ఈ మూడవది అంటే కర్మపత్రమని భావిస్తున్నారు. చూడండి, 53:39. [2] చూడండి, 69:19 మరియు 84:7.
మరియు (ఓ ప్రవక్తా!) మేము నీపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) నుండి నిన్ను మరలించి, నీవు అదికాక మా పేరుతో మరొక దానిని (సందేశాన్ని) కల్పించాలని నిన్ను పురికొల్పటానికి వారు ప్రయత్నిస్తున్నారు.[1] నీవు అలా చేసి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ ఆప్తమిత్రులుగా చేసుకునేవారు.
[1] ఇది ముష్రిక్ ఖురైషులు దైవప్రవక్త ('స'అస) ముందు పెట్టిన మరొక ప్రస్తావన. అంటే అతను వారి కల్పిత దైవాలను నిజమైన దైవాలని గుర్తిస్తే వారు కూడా అతనిని దైవప్రవక్తగా గుర్తిస్తామని పెట్టిన షరతు. దానిని అతను ('స'అస) నిరాకరించారు.
అలాగైతే, మేము నీకు ఈ జీవితంలో రెట్టింపు శిక్షను మరియు చనిపోయిన తరువాత కూడా రెట్టింపు శిక్షను రుచి చూపి ఉండేవారం. అప్పుడు మాకు వ్యతిరేకంగా నీకు సహాయపడే వాడిని ఎవ్వడినీ నీవు పొంది వుండేవాడవు కాదు.
మరియు వారు (అవిశ్వాసులు) నిన్ను కలవరపెట్టి, నిన్ను ఈ భూమి నుండి వెడలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు నీవు వెళ్ళిపోయిన తరువాత, వారు కూడా కొద్ది కాలం మాత్రమే ఉండగలిగేవారు.[1]
[1] కావున కొద్దికాలం తరువాత 2 హి.శ.లో బద్ర్ లో మక్కా ఖురైషుల పలువురు నాయకులు చంపబడ్డారు. మరియు 8వ హిజ్రీలో ముస్లింలు మక్కాను జయించారు.
మధ్యాహ్నం సూర్యుడు వాలినప్పటి నుండి, రాత్రి అయి చీకటి పడే వరకూ నమాజ్ లను సలుపు. మరియు ప్రాతఃకాలంలో (నమాజ్ లో) ఖుర్ఆన్ పఠించు.[1] నిశ్చయంగా ప్రాతఃకాల ఖుర్ఆన్ పఠనం (దేవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది.[2]
[1] ఈ ఆయత్ లో ఐదు విధి (ఫ'ర్ద్) గా సలుప వలసిన నమా'జ్ ల ప్రస్తావన వచ్చింది. సూర్యుడు వాలిన తరువాత జుహ్ర్, సూర్యాస్తమయానికి కొంత కాలం ముందు 'అ'స్ర్, సూర్యాస్తమయం కాగానే మ'గ్ రిబ్, కొంత చీకటి పడ్డ తరువాత 'ఇషా మరియు ప్రాతఃకాలమున సూర్యోదయానికి ముందు ఫజ్ర్ చేయాలని. ఫజ్ర్ నమాజ్ లో ఖుర్ఆన్ పఠనం ఎక్కువగా చేయాలి. ఈ నమా'జ్ లను గురించి వివరాలు 'స'హీ'హ్ 'హదీస్'లలో ఉన్నాయి. [2] ప్రాతఃకాలపు ఫజ్ర్ నమా'జ్ సమయంలో పగటి మరియు రాత్రి దైవదూతలు కలుస్తారు. వారంతా ప్రజల నమా'జ్ లను చూస్తారు. మరియు దానిని గురించి అల్లాహుతా'ఆలాకు తెలుపుతారు. అది అల్లాహ్ (సు.తా.)కు అగోచరమైనది కాదు, కానీ ఆయన (సు.తా.) వారి నుండి తన ప్రజల ప్రశంసలు వినగోరుతాడు. ('స. బు'ఖారీ మరియు ముస్లిం).
మరియు రాత్రివేళలో జాగరణ (తహజ్జుద్) నమాజ్ చెయ్యి.[1] ఇది నీ కొరకు అదనపు (నఫిల్) నమాజ్. దీనితో నీ ప్రభువు నిన్ను (పునరుత్థాన దినమున) ప్రశంసనీయమైన స్థానము (మఖామ్మ్ మహ్మూద్) నొసంగవచ్చు!
[1] తహజ్జుద్: అంటే నిద్రాభంగం. ఇది నఫీల్ నమా'జ్, అంటే అదనంగా చేసే నమా'జ్. దైవప్రవక్త ('స'అస) రాత్రి మొదటి భాగంలో నిద్ర తీసుకొని, చివరి భాగంలో నిద్ర నుండి లేచి నమా'జ్ చేసేవారు, అదే తహజ్జుద్ నమా'జ్. 'స'హీ'హ్ 'హదీస్'లలో దీని వివరాలున్నాయి. ఇంకా చూడండి, 76:26.
మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నీవు నా ప్రతి ప్రవేశాన్ని, సత్యప్రవేశంగా చేయి మరియు నా బహిర్గమనాన్ని కూడా సత్య బహిర్గమనంగా చేయి మరియు నీ వైపు నుండి నాకు అధికార శక్తిని, సహాయాన్ని ప్రసాదించు."[1]
[1] కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ ప్రస్థానం (హిజ్రత్) సమయంలో అవతరింపజేయ బడిందని అంటారు. అంటే యస్'రిబ్ (మదీనా మునవ్వరా) ప్రవేశాన్ని మరియు మక్కా ముకర్రమా బహిర్గమనాన్ని సత్యమైనవి చేయమని దైవప్రవక్త ('స'అస) ప్రార్థిస్తున్నారు. మరికొందరు అంటారు: నన్ను సత్యం మీద మరణింపజేయి మరియు సత్యంతో పునరుత్థరింపజేయి. ఇమామ్ షౌకాని అంటారు: ఈ అన్నీ అర్థాలు కూడా సమంజసమైనవే, ఎందుకంటే ఇది ఒక దు'ఆ.
మరియు ఇలా అను: "సత్యం వచ్చింది మరియు అసత్యం అంతరించింది. నిశ్చయంగా అసత్యం అంతరించక తప్పదు.[1]
[1] మక్కా ముకర్రమా విజయం తరువాత, దైవప్రవక్త ('స'అస) కాబాలో ప్రవేశిస్తారు. అక్కడ 360 విగ్రహాలు ఉంటాయి. వాటిని ఒక చిన్న కట్టెతో కొట్టుతూ ఈ ఆయత్ చదువుతారు. ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం).
మరియు మేము ఈ ఖుర్ఆన్ ద్వారా విశ్వాసులకు స్వస్థతను మరియు కారుణ్యాన్ని క్రమక్రమంగా అవతరింపజేస్తాము. కాని దుర్మార్గులకు ఇది నష్టం తప్ప మరేమీ అధికం చేయదు.[1]
మరియు ఒకవేళ మేము మానవుణ్ణి అనుగ్రహిస్తే, అతడు ముఖం త్రిప్పుకొని (మా నుండి మరలిపోతాడు. కాని అతనికి కీడు కలిగితే నిరాశ చెందుతాడు.[1]
[1] మానవుడు సుఖసంతోషాలలో ఉన్నప్పుడు అల్లాహ్ (సు.తా.)ను మరచిపోతాడు మరియు కష్టకాలంలో నిరాశ చెందుతాడు. కాని ఒక విశ్వాసి రెండు పరిస్థితులలోనూ తన ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయన స్తోత్రం చేస్తూ ఉంటాడు. చూడండి, 11:9-11.
మరియు వారు నిన్ను ఆత్మ (రూహ్) ను గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో ఇలా అను: "ఆత్మ! నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. మరియు (దానిని గురించి) మీకు ఇవ్వబడిన జ్ఞానం అతి స్వల్పమైనది."[1]
[1] అర్-రూ'హు: ఆత్మను గురించి కేవలం అల్లాహ్ (సు.తా.) కు మాత్రమే తెలుసు. దాని జ్ఞానం కేవలం నా ప్రభువు (సు.తా.) కు మాత్రమే ఉంది. దాని జ్ఞానం (సు.తా.) ప్రవక్తల (అ.స.)కు కూడా ఇవ్వలేదు. అది ఆయన (సు.తా.) ఆజ్ఞతో వస్తుంది: 'కున్ ఫ యకూన్.'
మరియు ఒకవేళ మేము కోరినట్లయితే నీపై అవతరింపజేయబడిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) లాగుకోగలము. (స్వాధీన పరచుకోగలము). అప్పుడు దానిని గురించి, మాకు వ్యతిరేకంగా, నీవు ఏ సహాయకుడినీ పొందలేవు -
ఇలా అను: "ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకు రావటానికి ప్రయత్నించినా - వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ - ఇటువంటి దానిని కల్పించి తేలేరు."[1]
మరియు వారు ఇలా అంటారు: "(ఓ ముహమ్మద్!) నీవు భూమి నుండి మా కొరకు ఒక చెలమను ఝల్లున ప్రవహింప జేయనంత వరకు మేము నిన్ను విశ్వసించము;[1]
[1] ఇది ముష్రిక్ ఖురైషులు ఇస్లాం స్వీకరించటానికి - మూసా ('అ.స.) బండ నుండి పన్నెండు ఊటలను ప్రవహింపజేసినట్లు, మీరు కూడా ప్రవహింపజేయండని - పెట్టిన షర్తు. చూ, 2:60.
లేదా నీ కొరకు స్వర్ణగృహం ఏర్పడనంత వరకు; లేదా నీవు ఆకాశంలోకి ఎక్కి పోయినా నీవు, మేము చదువగలిగే ఒక గ్రంథాన్ని అవతరింప జేయనంత వరకు; నీవు ఆకాశంలోకి ఎక్కటాన్ని మేము నమ్మము." వారితో అను: "నా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, నేను కేవలం సందేశహరునిగా పంపబడిన మానవుడను మాత్రమే?"[1]
[1] అద్భుత సూచనలు కేవలం అల్లాహ్ (సు.తా.) చేతిలోనే ఉన్నాయి. ఆయన (సు.తా.) కోరితేనే వాటిని చూపుతాడు. చూడండి, 6:109.
మరియు ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా వారిని ఆపిందేమిటి? వారు (మూఢ విశ్వాసంలో మునిగి): "ఏమీ? అల్లాహ్ మానవుణ్ణి తన సందేశహరునిగా పంపాడా?" అని పలకడం తప్ప!
మరియు ఎవడికి అల్లాహ్ మార్గదర్శకత్వం చేస్తాడో అతడే సన్మార్గం పొందుతాడు. మరియు ఎవడిని ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో వాడికి, ఆయన తప్ప, ఇతరుల నెవ్వరినీ నీవు సంరక్షకులుగా పొందలేవు. మరియు వారిని మేము పునరుత్థాన దినమున గ్రుడ్డివారిగా, మూగవారిగా మరియు చెవిటివారిగా చేసి, వారి ముఖాల మీద బోర్లా పడవేసి లాగుతూ ప్రోగుచేస్తాము. వారి ఆశ్రయం నరకమే! అది చల్లారినప్పుడల్లా మేము వారికై అగ్నిజ్వాలను తీవ్రం చేస్తాము.
అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు: "ఏమీ? మేము ఎముకలుగా, పొడిగా మారిపోయిన తరువాత కూడా, సరిక్రొత్త సృష్టిగా మళ్ళీ లేపబడతామా?" [1]
ఏమీ? వారు చూడటం లేదా (ఎరుగరా)? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడనీ[1] మరియు వారి వంటి వారినీ సృష్టించగల సమర్ధుడనీ మరియు ఆయనే వారి కొరకు ఒక నిర్ణీత సమయాన్ని నియమించాడనీ,[2] దానిని (ఆ సమయాన్ని) గురించి ఎలాంటి సందేహం లేదనీ; అయినా ఈ దుర్మార్గులు మొండిగా సత్యాన్ని తిరస్కరించటానికే పూనుకున్నారు.
[1] చూడండి, 40:57, 46:33 మరియు 36:81-82. [2] నిర్ణీత సమయం అంటే పునరుత్థాన దినం.
వారితో అను: "ఒకవేళ మీరు నా ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులను పొంది వున్నా, అవి ఖర్చయి పోతాయేమోననే భయంతో, వాటిని మీరు పట్టుకొని (ఖర్చు చేయకుండా) ఉండేవారు.[1] మరియు వాస్తవానికి మానవుడు ఎంతో లోభి!"
మరియు మేము వాస్తవానికి, మూసాకు స్పష్టమైన తొమ్మిది అద్భుత సూచనలను ప్రసాదించాము.[1] ఇస్రాయీల్ సంతతి వారిని అడుగు, అతను (మూసా) వారి వద్దకు వచ్చినపుడు ఫిరఔన్ అతనితో అన్నాడు: "ఓ మూసా! నిశ్చయంగా, నీవు మంత్రజాలానికి గురి అయ్యావని నేను భావిస్తున్నాను."
[1] మూసా ('అ.స.) కు ఇవ్వబడిన (ఫిర్'ఔన్ జాతి వారికి చూపిన) తొమ్మిది అద్భుత సూచనలు: 1) ప్రకాశించే చేయి, 2) సర్పంగా మారే చేతి కర్ర, 3) దుష్టులకు కలిగిన కరువు మరియు ఫల నష్టము, 4) 'తుఫాను, 5) మిడుతల దండు, 6) పేనులు, 7) కప్పలు, 8) రక్తం మరియు 9) సముద్రంలో ఏర్పడిన బాట. ఇవి సూరహ్ అల్-అ'అరాఫ్ (7) లో కూడా వివరించబడ్డాయి. ఇబ్నె'అబ్బాస్, ముజాహిద్, ఇక్రిమా, షాబీ, ఖతద ర'ది. 'అన్హుమ్ ల వ్యాఖ్యానం, (ఇబ్నె-క'సీర్). ఇవేగాక బండ నుండి తీసిన 12 ఊటలూ, మన్న మరియు సల్వాలు కూడా అద్భుత సూచనలే, కానీ వీటిని ఫిర'ఔన్ జాతి వారు చూడలేదు.
(మూసా) అన్నాడు: "నీకు బాగా తెలుసు, జ్ఞానవృద్ధి కలుగజేసే వాటిని (సూచనలను) భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వరూ అవతరింపజేయలేరని! ఓ ఫిర్ఔన్, నీవు నిశ్చయంగా నశింపనున్నావని నేను భావిస్తున్నాను!"[1]
[1] మూసా ('అ.స.) యొక్క వివరాలకు చూడండి, 7:103-137 మరియు 20:49-79.
అప్పుడు అతడు (ఫిర్ఔన్) వారిని భూమి (ఈజిప్టు) నుండి వెడలగొట్టాలని సంకల్పించుకున్నాడు. కావున మేము అతనిని (ఫిర్ఔన్ ను) మరియు అతనితో పాటు ఉన్న వారందరినీ ముంచి వేశాము.
మరియు ఆ తరువాత, ఇస్రాయీల్ సంతతివారితో మేము ఇలా అన్నాము: "మీరు ఈ భూమిలో స్వేచ్ఛగా నివసించండి. కానీ అంతిమ వాగ్దానం ఆసన్నమైనప్పుడు, మేము మీరందరినీ ఒకేచోట చేర్చుతాము."
మరియు మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) సత్యంతో అవతరింపజేశాము. మరియు ఇది సత్యంతోనే అవతరించింది. (ఓ ప్రవక్తా!) మేము నిన్ను కేవలం శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము!
వారితో అను: "మీరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మినా నమ్మకపోయినా; నిశ్చయంగా, ఇది వరకు జ్ఞానమొసంగపడిన వారికి దీనిని వినిపించినప్పుడు, వారు తమ ముఖాల మీద పడి సాష్టాంగం (సజ్దా) చేస్తారు."
వారితో అను: "మీరు ఆయనను, అల్లాహ్! అని పిలవండీ, లేదా అనంత కరుణా మయుడు (అర్రహ్మాన్) ! అని పిలువండీ, మీరు ఆయనను ఏ పేరుతోనైనా పిలవండీ, ఆయనకున్న పేర్లన్నీ అత్యుత్తమమైనవే! నీ నమాజ్ లో నీవు చాలా గట్టిగా గానీ, చాలా మెల్లగా గానీ పఠించక, వాటి మధ్య మార్గాన్ని అవలంబించు."
ఇంకా ఇలా అను: "సంతానం లేనటువంటి మరియు తన రాజరికంలో భాగస్వాములు లేనటువంటి మరియు తనలో ఎలాంటి లోపం లేనటువంటి మరియు సహాయకుడి అవసరం లేనటు వంటి అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు మీరు ఆయన మహనీయతను గొప్పగా కొనియాడండి!"
Contents of the translations can be downloaded and re-published, with the following terms and conditions:
1. No modification, addition, or deletion of the content.
2. Clearly referring to the publisher and the source (QuranEnc.com).
3. Mentioning the version number when re-publishing the translation.
4. Keeping the transcript information inside the document.
5. Notifying the source (QuranEnc.com) of any note on the translation.
6. Updating the translation according to the latest version issued from the source (QuranEnc.com).
7. Inappropriate advertisements must not be included when displaying translations of the meanings of the Noble Quran.
የፍለጋ ዉጤቶች:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".