తన దాసునిపై (ముహమ్మద్ పై) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేసిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు ఆయన ఇందులో ఏ విధమైన వక్తత్వాన్ని ఉంచలేదు. [1]
[1] చూడండి, 4:82, ఈ గ్రంథం అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి కాక ఇతరుల దగ్గర నుండి వచ్చి ఉంటే అందులో ఎన్నో లోపాలు ఉండేవి.
ఇది సక్రమంగా స్థిరంగా ఉండి, ఆయన నుండి వచ్చే కఠిన శిక్షను గురించి హెచ్చరిస్తుంది మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మంచి ప్రతిఫలం (స్వర్గం) తప్పక ఉంటుందనే శుభవార్తనూ ఇస్తుంది.
ఈ విషయాన్ని గురించి వారికి గానీ, వారి తండ్రి తాతలకు గానీ ఎలాంటి జ్ఞానం లేదు, వారి నోటి నుండి వచ్చే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు పలికేదంతా కేవలం అసత్యమే.
ఏమీ? నిశ్చయంగా, ఆ గుహవాసులు మరియు ఆ శిలాఫలకం వారు, మా (ఇతర) సూచనలన్నింటిలో అద్భుతమైనవి నీవు భావించావా?[1]
[1] అంటే ఇదొక్కటే అద్భుత సూచన కాదు. దీని కంటే అద్భుత సూచనలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సూర్య-చంద్రుల, నక్షత్రాల మరియు రేయింబవళ్ళ సృష్టి మొదలైనవి. అర్-రఖీమ్ : కొందరు వ్యాఖ్యాతలు దీనిని ఆ గుహవాసుల నగరపు పేరని మరి కొందరు గుహ ఉన్న ఆ కొండ పేరని ఇంకా కొందరు ఆ సీసపు పలక దేనిపైనైతే వారి పేర్లు వ్రాయబడి ఉండెనో అది, అని అంటారు.
(జ్ఞాపకం చేసుకోండి) ఎప్పుడైతే ఆ యువకులు ఆ గుహలో ఆశ్రయం పొందారో, ఇలా ప్రార్థించారు: "ఓ మా ప్రభూ! మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. మరియు మా వ్యవహారంలో మేము నీతిపరులమై ఉండేటట్లు మమ్మల్ని సరిదిద్దు!"
మేము వారి యథార్థ గాథ నీకు వినిపిస్తున్నాము. నిశ్చయంగా, వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు యువకులు;[1] మేము వారి మార్గదర్శకత్వాన్ని అధికం చేశాము.
[1] ఫిత్ యతున్: అంటే 9 లేక దాని కంటే తక్కువ అని అర్థం. ఆ యువకులు 'ఈసా ('అ.స.) కంటే ముందు వారు కావచ్చని ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మ) అభిప్రాయం. మరికొందరు వారు క్రైస్తవులని అంటారు. వారు ఎవరైనా సరే, ఏక దైవ సిద్ధాంతంపై ఉన్నవారూ మరియు కేవలం అల్లాహ్ (సు.తా.) ను మాత్రమే ఆరాధించేవై ఉండిరి. వారి కాలపు నాయకులు మరియు ఇతర ప్రజల వలే అల్లాహ్ (సు.తా.) ను విడిచి ఇతరులను ఆరాధించేవారు కారు. కాబట్టి ఆ సత్యతిరస్కారుల శిక్షకు భయపడి ఏకాంతపు కొండగుహలో శరణం తీసుకొని ఉండిరి.
మరియు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని ప్రసాదించాము. వారు లేచి నిలబడినప్పుడు ఇలా అన్నారు: "భూమ్యాకాశాల ప్రభువే మా ప్రభువు! ఆయనను వదలి మేము వేరే దైవాన్ని ఎలాంటి స్థితిలోనూ ప్రార్థించము. వాస్తవానికి అలా చేస్తే దారుణం చేసిన వారమవుతాము!
"ఈ, మా జాతివారు ఆయనను విడిచి ఇతర దైవాలను నియమించుకున్నారు. అయితే, వారిని (ఆ దైవాలను) గురించి వారు స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురారు? ఇక అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవాని కంటే మించిన దుర్మార్గుడు ఎవడు?"
(వారు పరస్పరం ఇలా అనుకున్నారు): "ఇపుడు మీరు వారిని మరియు అల్లాహ్ ను కాదని వారు ఆరాధించే దైవాలను విడిచి, గుహలో శరణు తీసుకోండి. మీ ప్రభువు తన కారుణ్యాన్ని మీపై విస్తరింపజేస్తాడు. మరియు మీ కార్యాలను సరిదిద్ది వాటిని మీకు సులభమైనట్లుగా చేస్తాడు."
మరియు వారు (ఆ గుహలోని) ఒక విశాలమైన భాగంలో (నిద్రిస్తూ) ఉన్నప్పుడు; సూర్యుడు ఉదయించే టప్పుడు, (ఎండ) వారి గుహ నుండి కుడి ప్రక్కకు వాలి పోవటాన్ని మరియు అస్తమించేటప్పుడు (ఎండ) ఎడమ ప్రక్కకు తొలగి పోవటాన్ని నీవు చూసి ఉంటావు. ఇది అల్లాహ్ సూచనలలో ఒకటి. అల్లాహ్ మార్గదర్శకత్వం చేసినవాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి సరైన మార్గం చూపే సంరక్షకుడిని నీవు పొందలేవు.
మరియు వారు నిద్రపోతున్నప్పటికీ, నీవు వారిని మేల్కొని ఉన్నారనే భావించి ఉంటావు! మరియు మేము వారిని కుడి ప్రక్కకు మరియు ఎడమ ప్రక్కకు మరలించే వారము. మరియు వారి కుక్క గుహద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాచి పడి ఉండెను. ఒకవేళ నీవు వారిని తొంగిచూసి ఉంటే, నీవు తప్పక వెనుదిరిగి పారిపోయే వాడవు మరియు వారిని గురించి భయకంపితుడవై పోయేవాడవు.
మరియు ఈ విధంగా (ఉన్న తరువాత), వారు ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని (నిద్ర నుండి) లేపాము. వారిలో నుండి ఒకడు మాట్లాడుతూ ఇలా అన్నాడు: "మీరు ఈ స్థితిలో ఎంత కాలమున్నారు?" వారన్నారు: "మేము ఒక దినమో లేదా అంతకంటే తక్కువనో ఈ స్థితిలో ఉన్నాము."[1] (మరికొందరు) ఇలా అన్నారు: "మీరెంత కాలమున్నారో మీ ప్రభువుకే తెలుసు! మీలో ఒకనికి నాణ్యం (డబ్బు) ఇచ్చి పట్టణానికి పంపండి. అతడు అక్కడ శ్రేష్ఠమైన ఆహారాన్ని వెతికి, దానినే మీ కొరకు తినటానికి తెస్తాడు. అతడు జాగ్రత్తగా వ్యవహరించాలి మరియు మీ గురించి ఎవ్వడికీ తెలియనివ్వ గూడదు.
[1] చూడండి, 2:259 అక్కడ ఒకడు, మరణించి నూరు సంవత్సరాలు పడి ఉన్న తరువాత, అల్లాహ్ (సు.తా.) అతడిని మరల సజీవునిగా చేసినప్పుడు ఇలాగే భావిస్తాడు. అల్లాహుతా'ఆలా నిర్జీవుల నుండి సజీవులను మరియు సజీవుల నుండి నిర్జీవులను తేగలడు, అనే సత్యానికి ఇది ఉదాహరణం. ఇంకా చూడండి, 3:27, 6:95, 10:31, 30:19.
"ఒకవేళ వారు మిమ్మల్ని గుర్తు పడితే, వారు తప్పక మిమ్మల్ని రాళ్ళు రువ్వి చంపుతారు లేదా (బలవంతంగా) మిమ్మల్ని వారి మతంలోకి త్రిప్పుకుంటారు, అలాంటప్పుడు మీరు ఎలాంటి సాఫల్యం పొందలేరు."
మరియు ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమని చివరి ఘడియ నిశ్చయమని, అది రావటంలో ఎలాంటి సందేహం లేదని తెలుసుకోవటానికి, ఆ యువకుల విషయం ప్రజలకు తెలియజేశాము. అప్పుడు వారు (ప్రజలు) వారి (గుహవాసుల) విషయాన్ని తీసుకొని పరస్పరం వాదులాడుకున్న విషయం (జ్ఞాపకం చేసుకోండి!) వారిలో కొందరన్నారు: "వారి కొరకు ఒక స్మారక భవనం నిర్మించాలి." వారి విషయం వారి ప్రభువుకే తెలుసు. ఆ వ్యవహారంలో పైచేయి (ప్రాబల్యం) ఉన్నవారు: "వారి స్మారకంగా ఒక మస్జిద్ ను నిర్మించాలి." అని అన్నారు.
(వారి సంఖ్యను గురించి) కొందరంటారు: "వారు ముగ్గురు, నాలుగవది వారి కుక్క." మరికొందరంటారు: "వారు అయిదుగురు ఆరవది వారి కుక్క." ఇవి వారి ఊహాగానాలే. ఇంకా కొందరంటారు: "వారు ఏడుగురు, ఎనిమిదవది వారి కుక్క." వారితో అను: "వారి సంఖ్య కేవలం నా ప్రభువుకే తెలుసు. వారిని గురించి కొందరికి మాత్రమే తెలుసు." కావున నిదర్శనం లేనిదే వారిని గురించి వాదించకు. మరియు (గుహ) వారిని గురించి వీరిలో ఎవ్వరితోనూ విచారణ చేయకు.
"అల్లాహ్ కోరితే తప్ప (ఇన్షా అల్లాహ్)!" అని అననిదే![1] మరియు నీ ప్రభువును స్మరించు, ఒకవేళ నీవు మరచిపోతే! ఇలా ప్రార్థించు: "బహుశా నా ప్రభువు నాకు సన్మార్గం వైపునకు దీని కంటే దగ్గరి త్రోవ చూపుతాడేమో!"
[1] యూదులు దైవప్రవక్త ('స'అస) తో మూడు ప్రశ్నలు అడిగారు: 1) రూ'హ్ ఆత్మ అంటే ఏమిటి? 2) గుహవారి విషయం ఏమిటి? 3) జు'ల్-ఖర్ నైన్ ఎవడు? దైవప్రవక్త ('స'అస) అన్నారు: 'నేను రేపు మీకు జవాబిస్తాను.' కాని అతను ('స'అస): "అల్లాహ్ కోరితే," (ఇన్షా 'అల్లాహ్! అని అనలేదు. కావున 15 రోజుల వరకు ఏ వ'హీ రాలేదు. ఆ తరువాత వ'హీ వచ్చినప్పుడు: "ఇన్షా 'అల్లాహ్," అని తప్పక అనాలని ఆజ్ఞ వచ్చింది.
వారితో అను: "వారెంతకాలం (గుహలో) ఉన్నారో అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్త అగోచర విషయాలు కేవలం ఆయనకే తెలుసు. ఆయన అంతా చూడగలడు మరియు వినగలడు. వారికి ఆయన తప్ప మరొక సంరక్షకుడు లేడు మరియు ఆయన తన ఆధిపత్యంలో ఎవ్వడినీ భాగస్వామిగా చేర్చుకోడు."
మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) చదివి వినిపించు.[1] ఆయన ప్రవచనాలను ఎవ్వడూ మార్చలేడు. మరియు ఆయన వద్ద తప్ప నీవు మరెక్కడా శరణు పొందలేవు. [2]
[1] గుహవారి కథ వినిపిస్తూ అల్లాహుతా'ఆలా అలా అంటున్నాడు:'ఇప్పుడు నిన్ను ప్రశించేవారికి ఇది వినిపించు.' వాస్తవానికి ('స'అస) ఎల్లప్పుడు తనపై అవతరింపజేయబడిన దివ్య జ్ఞానాన్నంతా ప్రజలకు వినిపించారు. మరియు వారిని సన్మార్గం వైపునకు పిలిచారు. అది అతని ('స'అస) విద్యుక్త ధర్మం. అల్లాహ్ (సు.తా.) దాని కొరకే ప్రవక్తలను ఎన్నుకుంటాడు. [2] అల్లాహ్ (సు.తా.) ప్రవచనాలను ఉన్నవి ఉన్నట్లుగా ఎట్టి మార్పులు చేయకుండా వినిపించాలని ఆజ్ఞ ఇవ్వబడుతోంది. లేనిచో అల్లాహ్ (సు.తా.) శిక్ష నుండి తప్పించేవాడు ఎవ్వడూ లేడు. ఈ ప్రవచనం దైవప్రవక్త ('స'అస) తో చెప్పబడినా అది సర్వసమాజం కొరకు వర్తిస్తుంది.
మరియు (ఓ ప్రవక్తా!) ఎవరు ఆయన ముఖ దర్శనం (ప్రసన్నతను) కోరుతూ, ఉదయం మరియు సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తున్నారో, వారి సహచర్యంలోనే సహనం వహించి ఉండు. ఇహలోక ఆడంబరాలను అపేక్షించి నీ దృష్టిని వారి నుండి దాటనివ్వకు (వారిని ఉపేక్షించకు).[1] మరియు అలాంటి వానిని అనుసరించకు (మాట వినకు), ఎవడి హృదయాన్ని మా ధ్యానం నుండి తొలగించామో మరియు ఎవడు తన మనోవాంఛలను అనుసరిస్తున్నాడో మరియు ఎవడి వ్యవహారాలు (కర్మలు) వ్యర్థమయ్యాయో!
[1] ఈ వాక్యం 6:52లో కూడా ఉంది. స'ఆద్ బిన్ అబీ- వఖ్ఖా'స్ కథనం: ఒకసారి దైవప్రవక్త '(స'అస) స'ఆద్ బిన్ అబీ-వఖ్ఖా'స్, బిలాల్, ఇబ్నె-మసూ'ద్, ఒక 'హజ'లీ మరియు ఇద్దరు 'స'హాబీ (ర'ది. 'అన్హుమ్)లతో కలిసి కూర్చొని ఉంటారు. అప్పుడు కొందరు ఖురైష్ నాయకులు వచ్చి, దైవప్రవక్త ('స'అస)తో: 'వీరిని మీ దగ్గర నుండి పంపండి. మేము మీతో మాట్లాడదలచాము.' అని అంటారు. అప్పుడు దైవప్రవక్త ('స'అ)కు తట్టుతుంది: 'బహుశా వీరు నా మాట వింటారేమో.' అని, కాని అల్లాహుతా'ఆలా అతనిని ('స'అ) నివారించాడు.' ('స.ముస్లిం)
మరియు వారితో అను: "ఇది మీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున ఇష్టపడిన వారు దీనిని విశ్వసించ వచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు!" నిశ్చయంగా, మేము దుర్మార్గుల కొరకు నరకాగ్నిని సిద్ధపరచి ఉంటాము, దాని జ్వాలలు వారిని చుట్టుకుంటాయి. అక్కడ వారు నీటి కొరకు మొర పెట్టుకున్నప్పుడు, వారికి ముఖాలను మాడ్చే (మరిగే) నూనె వంటి నీరు (అల్ ముహ్లు) ఇవ్వబడుతుంది. అది ఎంత చెడ్డ పానీయం మరియు ఎంత చెడ్డ (దుర్భరమైన) విరామ స్థలం!
అలాంటి వారు! వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే శాశ్వత స్వర్గవనాలు ఉంటాయి. అందు వారు బంగారు కంకణాలను మరియు ఆకు పచ్చని బంగారు జలతారుగల పట్టు వస్త్రాలను ధరించి, ఎత్తైన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.[1] ఎంత మంచి ప్రతిఫలం మరియు ఎంత శ్రేష్ఠమైన విరామ స్థలం!
[1] రాజులు బంగారు కంకణాలు, ఆభరణాలు మరియు పట్టు వస్త్రాలు ధరిస్తారు. స్వర్గవాసులకు రాజులకు ఉంటేటటువంటి సుఖసంతోషాలు ఉంటాయిని చెప్పడానికి ఈ వివరాలు ఇవ్వబడ్డాయి. మరియు పురుషులకు ఇహలోకంలో హరాం చేయబడిన, బంగారు ఆభరణాలు మరియు పట్టు వస్త్రాలను వారు త్యజించుకుంటే వారికి స్వర్గంలో అవన్నీ లభిస్తాయి. అంతేగాక వారు కోరేవన్నీ దొరుకుతాయి. చూడండి, 22:23, 35:33, 76:21.
మరియు వారికి ఆ ఇద్దరు మనుష్యుల ఉదాహరణ తెలుపు: వారిద్దరిలో ఒకడికి మేము రెండు ద్రాక్షతోటలను ప్రసాదించి, వాటి చుట్టూ ఖర్జూరపు చెట్లను మరియు వాటి మధ్య పంటపొలాన్ని ఏర్పరిచాము.
మరియు అతడికి పుష్కలమైన ఫలాలు పండేవి (లాభాలు వచ్చేవి). మరియు అతడు తన పొరుగువాడితో మాట్లాడుతూ అన్నాడు: "నేను నీ కంటే ఎక్కువ ధనవంతుణ్ణి మరియు నా వద్ద బలవంతులైన మనుషులు కూడా ఉన్నారు."
అతడి పొరుగువాడు అతడితో మాట్లాడుతూ అన్నాడు: "నిన్ను మట్టితో, [1] తరువాత ఇంద్రియ బిందువుతో సృష్టించి, ఆ తరువాత నిన్ను (సంపూర్ణ) మానవుడిగా తీర్చిదిద్దిన ఆయన (అల్లాహ్)ను నీవు తిరస్కరిస్తున్నావా?
[1] ఆదమ్ ('అ.స.) మట్టితో సృష్టించిన వివరాలకు చూడండి, 3:59, 23:12, 11:61, 22:5 మరియు 30:20.
"మరియు ఒకవేళ నీవు, నన్ను సంపదలో మరియు సంతానంలో నీ కంటే తక్కువగా తలచినప్పటికీ, నీవు నీ తోటలో ప్రవేశించినపుడు: "అల్లాహ్ కోరిందే అవుతుంది (మాషా అల్లాహ్), సర్వశక్తికి ఆధారభూతుడు కేవలం అల్లాహ్ యే (లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్)! అని అని వుంటే ఎంత బాగుండేది.
"వాస్తవానికి నా ప్రభువు, నీ తోట కంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించి, దాని (నీ తోట) పైకి ఆకాశం నుండి ఒక పెద్ద ఆపదను పంపి, దానిని చదునైన మైదానంగా చేయవచ్చు!
మరియు అతడి పంటను (వినాశం) చుట్టుముట్టింది, అతడు తాను ఖర్చు చేసినదంతా నాశనమైనదని చేతులు నలుపుకుంటూ ఉండిపోయాడు. మరియు అది దాని పందిరితో సహా నాశనమైపోయింది. మరియు అతడు ఇలా వాపోయాడు: "అయ్యో! నా దౌర్భాగ్యం! నేను నా ప్రభువుకు భాగస్వాములను (షరీక్ లను) కల్పించకుండా ఉంటే ఎంత బాగుండేది!"
మరియు వారికి ఇహలోక జీవితాన్ని[1] ఈ ఉపమానం ద్వారా బోధించు: మేము ఆకాశం నుండి నీటిని కురిపించినపుడు, దానిని భూమిలోని చెట్టూ చేమలు పీల్చుకొని (పచ్చగా పెరుగుతాయి). ఆ తరువాత అవి ఎండి పొట్టుగా మారిపోయినపుడు, గాలి వాటిని చెల్లాచెదురు చేస్తుంది. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతిదీ చేయగల సమర్ధుడు.
[1] ఇహలోక జీవితం ఈ విధంగా బోధించబడుతోంది: అల్లాహుతా'ఆలా! ఆ ఏకైక ఆరాధ్యుడు, సర్వశక్తిమంతుడు, కోరితే మన జీవితాలను, వర్షం కురిసినపుడు కళకళలాడే పంటపొలాల మాదిరిగా చేయగలడు. లేదా ఎండిన పొట్టుగా గాలికి ఎగురవేయగలడు. కేవలం అల్లాహ్ (సు.తా.) యే ప్రతిదీ చేయగల సమర్థుడు. ఇటువంటి వాక్యాలకు చూడండి 10:24, 39:21, 57:20
ఈ సంపదా మరియు ఈ సంతానం, కేవలం ఐహిక జీవితపు అలంకారాలు మాత్రమే. కాని శాశ్వతంగా నిలిచేవి సత్కార్యాలే! అవే నీ ప్రభువు దృష్టిలో ప్రతిఫలానికి ఉత్తమమైనవి మరియు దానిని ఆశించటానికి కూడా ఉత్తమమైనవి.[1]
[1] సత్కార్యాలంటే మంచి పనులు; అల్లాహ్ (సు.తా.) నియమించిన విధులు (ఫ'ర్ద్ లు) వాజిబాత్ లు, దైవప్రవక్త సంప్రదాయాలు (సునన్), అదనంగా చేసే మంచి పనులు (నవాఫిల్). ఇంతే గాకుండా నిషేధింపబడిన వాటి నుండి దూరంగా ఉండటం కూడా సత్కార్యాలలోనే లెక్కించ బడుతుంది. ఇంకా ఇటువంటివాక్యానికి చూడండి, 19:76.
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజున మేము పర్వతాలను చలింపజేస్తాము.[1] మరియు నీవు భూమిని చదువైన మైదానంగా చూస్తావు. మరియు మేము ఒక్కడిని కూడా విడువకుండా అందరినీ సమావేశపరుస్తాము.
[1] పర్వతాలు ఏకిన దూదివలే మారి ఎగిరిపోతూ ఉంటాయి. చూడండి, 101:5, 52:9-10, 27:88, 20:105-107 మరియు భూమిపై ఉన్న భవనాలూ, చెట్టుచేమలూ అన్నీ నాశనమై పోయి భూమి ఒక చదునైన మైదానంగా మారి పోతుంది.
మరియు వారందరు నీ ప్రభువు సన్నిధిలో వరుసలలో ప్రవేశపెట్టబడతారు, (నీ ప్రభువు వారితో): "వాస్తవానికి మేము మొదటిసారి మిమ్మల్ని పుట్టించిన స్థితిలోనే[1] మీరు మా వద్దకు వచ్చారు! కాని మా ముందు హాజరయ్యే ఘడియను మేము నియమించలేదని మీరు భావించేవారు కదా!" అని పలుకుతాడు.
మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినపుడు, ఆ అపరాధులు, అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్న గానీ, ఏ పెద్ద విషయాన్ని గానీ ఇది లెక్కపెట్టకుండా విడువ లేదే!" తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు.
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము దేవదూతలతో: "ఆదమ్ కు సాష్టాంగ పడండి." అని చెప్పినపుడు, ఒక్క ఇబ్లీస్ తప్ప మిగతా వారందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతులలోని వాడు.[1] అప్పుడు అతడు తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించాడు. ఏమీ? మీరు నన్ను కాదని అతనిని మరియు అతని సంతానాన్ని స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకుంటారా? మరియు వారు మీ శత్రువులు కదా! దుర్మార్గులకు ఎంత చెడ్డ ఫలితముంది.
[1] ఇబ్లీస్ దైవదూత కాడు జిన్నాతుడు అని ఇక్కడ విశదమౌతుంది. ఇంకా చూడండి, 2:31-34.
నేను ఆకాశాలను మరియు భూమిని సృష్టించినప్పుడు గానీ, లేదా స్వయంగా వారిని (షైతానులను) సృష్టించినప్పుడు గానీ వారిని సాక్షులుగా పెట్టలేదు.[1] మార్గం తప్పించే వారిని నేను (అల్లాహ్) సహాయకులుగా చేసుకునే వాడను కాను.
[1] అంటే భూమ్యాకాశాలను మరియు (వారిని) షైతానులను సృష్టించినప్పుడు, వారు (షై'తానులు) ఉనికిలో లేరు. అల్లాహ్ (సు.తా.) యే వారిని సృష్టించాడు.
మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ దినమున ఆయన (అల్లాహ్) వారితో: "మీరు నా భాగస్వాములని భావించిన వారిని పిలవండి!" అని అన్నప్పుడు, వారు (భాగస్వాములుగా భావించిన) వారిని పిలుస్తారు, కాని వారు వారికి జవాబివ్వరు. మరియు మేము వారి మధ్య ఒక పెద్ద లోతైన వినాశగుండాన్ని నియమించి ఉంటాము.
మరియు వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు, దానిని విశ్వసించకుండా మరియు తమ ప్రభువు సన్నిధిలో క్షమాభిక్ష కోరకుండా ఉండటానికి వారిని ఆటంక పరిచిందేమిటి! వారి పూర్వీకుల మీద పడిన (ఆపద) వారి మీద కూడా పడాలనో, లేదా ఆ శిక్ష ప్రత్యక్షంగా వారిపైకి రావాలనో వేచి ఉండటం తప్ప?
మరియు మేము సందేశహరులను కేవలం శుభవార్తలు అందజేసేవారిగా మరియు హెచ్చరికలు చేసేవారిగా మాత్రమే పంపుతాము. మరియు సత్యతిరస్కారులు, సత్యాన్ని ఖండించటానికి నిరర్థకమైన మాటలతో వాదులాడుతారు. మరియు నా సూచనలను మరియు హెచ్చరికలను హాస్యంగా తీసుకుంటారు.
మరియు తన ప్రభువు సూచనలతో హితబోధ చేయబడినపుడు, వాటికి విముఖుడై తన చేతులారా చేసుకొని పంపిన దాన్ని (దుష్పరిణామాన్ని) మరచి పోయే వ్యక్తి కంటే, పరమ దుర్మార్గుడెవడు? వారు దానిని (ఖుర్ఆన్ ను) అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాల మీద తెరలు వేసి ఉన్నాము మరియు వారి చెవులకు చెవుడు కలిగించాము. కావున, నీవు వారిని సన్మార్గం వైపునకు పిలిచినా వారెన్నటికీ సన్మార్గం వైపునకు రాలేరు.
మరియు నీ ప్రభువు క్షమాశీలుడు, కారుణ్యమూర్తి. ఆయన వారి దుష్కర్మల ఫలితంగా వారిని పట్టుకోదలిస్తే, వారిపై తొందరగానే శిక్ష పంపి ఉండేవాడు. కాని వారికొక నిర్ణీత సమయం నిర్ణయించబడి ఉంది, దాని నుండి వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.[1]
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన సేవకునితో [1] ఇలా అన్నది: "రెండు సముద్రాల సంగమ స్థలానికి చేరనంత వరకు నేను నా ప్రయాణాన్ని ఆపను.[2] నేను సంవత్సరాల తరబడి సంచరిస్తూ ఉండవలసినా సరే!"[3]
[1] ఈ యువకుడే యూషాఅ'బిన్. మూసా ('అ.స.) తరువాత, అతను తన జాతి వారికి నాయకత్వాన్ని వహించారు. [2] ఈ సంగమ స్థానం అఖ్బా అఖాతం మరియు సూయజ్ అఖాతం రెండు వచ్చి ఎర్ర సముద్రంలో (రెడ్ సీ) లో కలిసే సంగమం కావచ్చని వ్యాఖ్యాతల అభిప్రాయం. [3] మూసా ('అ.స.) ఒకనితో ఒకసారి: 'నాకు మించిన జ్ఞానవంతుడు ఇప్పుడు ఎవ్వడూ లేడు!' అని అంటారు. అది అల్లాహ్ (సు.తా.)కు నచ్చదు. అప్పుడు అల్లాహుతా'ఆలా అతనితో రెండు సముద్రాల సంగమంలో నీవు: 'నిన్ను మించిన జ్ఞానిని పొందగలవు.' అని దివ్యజ్ఞానం ద్వారా తెలుపుతాడు. అప్పుడతను ('అ.స.) ఆ జ్ఞాని అన్వేషణలో బయలుదేరుతారు.
ఆ పిదప వారిద్దరు ఆ (రెండు సముద్రాల) సంగమ స్థలానికి చేరినప్పుడు, వారి చేపను గురించి మరిచిపోయారు. అది వారి నుండి తప్పించుకొని వేగంగా సముద్రంలోకి - సొరంగం గుండా పోయినట్లు [1] - దూసుకు పోయింది.
[1] "తన త్రోవను సొరంగంగా చేసుకుంటూ." (ఇది ము'హమ్మద్ జునాగఢీ గారి తాత్పర్యం). పైన ఉన్నది నోబుల్ ఖుర్ఆన్ తాత్పర్యము.
(సేవకుడు) ఇలా అన్నాడు: "చూశారా! మనం ఆ బండ మీద విశ్రాంతి తీసుకోవటానికి ఆగినపుడు వాస్తవానికి నేను చేపను గురించి పూర్తిగా మరచి పోయాను. షైతాను తప్ప మరెవ్వడూ నన్ను దానిని గురించి మరపింపజేయలేదు. అది విచిత్రంగా సముద్రంలోకి దూసుకొని పోయింది!"
అప్పుడు వారు మా దాసులలో ఒక దాసుణ్ణి (అచ్చట) చూశారు. మేము అతనికి మా అనుగ్రహాన్ని ప్రసాదించి,[1] అతనికి మా తరఫు నుండి విశిష్ట జ్ఞానం నేర్పి ఉన్నాము.[2]
[1] ర'హ్మాతున్: అంటే ఇక్కడ ప్రత్యేక అనుగ్రహాలు అని కొందరు వ్యాఖ్యాతలు అన్నారు. మరియు చాలా మంది వ్యాఖ్యాతలు దీనిని ప్రవక్త పదవిగా వ్యాఖ్యానించారు. [2] అల్లాహుతా'ఆలా 'ఖి'ద్ర్ ('అ.స.)కు ప్రవక్త పదవినే గాక, తన వైపు నుండి విశిష్ట జ్ఞానం కూడా ప్రసాదించాడు.
అతను అన్నాడు: "ఒకవేళ నీవు నన్ను అనుసరించటానికే నిశ్చయించుకుంటే, స్వయంగా నేనే నీతో ప్రస్తావించనంత వరకు నీవు నన్ను, ఏ విషయాన్ని గురించి కూడా ప్రశ్నించకూడదు."
ఆ పిదప వారిద్దరూ బయలుదేరారు. చివరికి వారిద్దరు పడవలో ఎక్కినపుడు అతను పడవకు రంధ్రం చేశాడు. (మూసా) అతనితో అన్నాడు: "ఏమీ? పడవలో ఉన్న వారిని ముంచి వేయటానికా, నీవు దానిలో రంధ్రం చేశావు? వాస్తవానికి, నీవు ఒక దారుణమైన పని చేశావు!"
ఆ పిదప వారు తమ ప్రయాణం సాగించగా వారికి ఒక బాలుడు కలిశాడు. అతను వానిని (బాలుణ్ణి) చంపాడు. (అది చూసి) మూసా అన్నాడు: "ఏమీ? ఒక అమాయకుడిని చంపావా? అతడు ఎవ్వడినీ (చంపలేదే)! వాస్తవానికి నీవు ఒక ఘోరమైన పని చేశావు!"
(మూసా) అన్నాడు: "ఇక ముందు దేన్ని గురించి అయినా నిన్ను అడిగితే నన్ను నీతో పాటు ఉండనివ్వకు. వాస్తవానికి నీవు, నా తరఫు నుండి ఇంత వరకు చాలినన్ని సాకులు స్వీకరించావు."
ఆ పిదప వారిద్దరూ ముందుకు సాగిపోయి ఒక నగరం చేరుకొని ఆ నగరవాసులను భోజనమడిగారు. కాని వారు (ఆ నగరవాసులు) వారిద్దరికి ఆతిథ్యమివ్వటానికి నిరాకరించారు.[1] అప్పుడు వారక్కడ కూలిపోనున్న ఒక గోడను చూశారు. అతను (ఖిద్ర్) దానిని మళ్ళీ నిలబెట్టాడు. (మూసా) అన్నాడు: "నీవు కోరితే దానికి (ఆ శ్రమకు) ప్రతిఫలం (వేతనం) తీసుకొని ఉండవచ్చు కదా!"
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'అల్లాహుతా'ఆలాను మరియు పరలోకాన్ని విశ్వసించేవాడు, తన అతిథిని ఆదరించాలి, ఆతిథ్యమివ్వాలి.' ('ఫైద్ అల్ - ఖదీర్, ష'ర్హ్ అల్ జామె' అ'స్స'గీర్ 5-209)
ఇక ఆ నావ విషయం: అది సముద్రంలో పని చేసుకునే కొందరు పేదవారిది. కావున దానిలో లోపం కలిగించగోరాను; ఎందుకంటే వారి వెనుక ఒక క్రూరుడైన రాజు ఉన్నాడు. అతడు (లోపం లేని) ప్రతి నావను బలవంతంగా తీసుకుంటాడు.
ఇక ఆ గోడ విషయం: అది ఈ పట్టణంలోని ఇద్దరు ఆనాథ బాలురకు చెందినది. దాని క్రింద వారి ఒక నిధి (పాతబడి) ఉంది. మరియు వారి తండ్రి పుణ్యపురుషుడు. ఆ ఇద్దరు బాలురు యుక్తవయస్తులైన పిదప - నీ ప్రభువు కారుణ్యంగా - తమ నిధిని, వారు త్రవ్వి తీసుకోవాలని, నీ ప్రభువు సంకల్పం. ఇదంతా నా అంతట నేను చేయలేదు. నీవు సహనం వహించలేని విషయాల వాస్తవం (తత్త్వం) ఇదే!"
చివరకు సూర్యుడు అస్తమించు (నట్లు కనబడే) స్థలానికి చేరాడు. దానిని (సూర్యుణ్ణి) నల్ల బురద వంటి నీటి చెలిమలో మునుగుతున్నట్లు చూశాడు.[1] మరియు అక్కడొక జాతి వారిని చూశాడు. మేము అతనితో అన్నాము:[2] "ఓ జుల్ ఖర్ నైన్! నీవు వారిని శిక్షించవచ్చు, లేదా వారి యెడల ఉదార వైఖరిని అవలంబించవచ్చు!"
[1] 'ఐనున్: సముద్రం లేక చెలిమ. 'హమిఅతిన్: బురద. వజద: పొందాడు, చూశాడు, కనుగొన్నాడు. అతడు పూర్తి పశ్చిమ దిశకు పోయిన తరువాత అక్కడ ఒక సముద్రం లేక చెలిమను చూశాడు. దాని నీరు నల్లని బురదగా కనిపించింది. దాని తరువాత అతనికి ఏమీ కనిపించక అస్తమయ్యే సూర్యుడు మాత్రమే కనిపించాడు. సముద్రపు ఒడ్డున నిలబడి అస్తమించే సూర్యుణ్ణి చూస్తే, సూర్యుడు ఆ సముద్రమలో మునిగిపోతున్నట్లు కనబడటం మనం చూస్తున్న విషయమే! భూమి గుండ్రంగా ఉన్నదనటానికి ఇదొక నిదర్శనం. [2] ఖుల్నా: మేమన్నాము, అంటే అల్లాహుతా'ఆలా అనతికి వ'హీ ద్వారా తెలిపాడు. అంటే, అతడు ప్రవక్త కావచ్చని కొందరు భావిస్తారు. అతనిని ప్రవక్తగా పరిగణించని వారు; ఆ కాలపు ప్రవక్త ద్వారా అతనికి సందేశం ఇవ్వబడిందని అంటారు.
అతను అన్నాడు: "ఎవడైతే దుర్మార్గం చేస్తాడో మేము అతనిని శిక్షిస్తాము. ఆ పిదప అతడు తన ప్రభువు వైపునకు మరలింపబడతాడు. అప్పుడు ఆయన అతనికి ఘోరమైన శిక్ష విధిస్తాడు.
చివరకు సూర్యుడు ఉదయించు (నట్లు కనబడే) స్థలానికి చేరాడు. అక్కడ అతను దానిని (సూర్యుణ్ణి) ఒక జాతిపై ఉదయించడం చూశాడు. వారికి మేము దాని (సూర్యుని) నుండి కాపాడుకోవటానికి ఎలాంటి చాటు (రక్షణ) నివ్వలేదు.[1]
[1] ఆ జాతివారు ఇండ్లలో నివసించేవారు కాదు. మైదానాలలో నివసించేవారు. మరియు వారు బట్టలు కూడా ధరించకుండా నివసించే ఆదివాసులు.
వారన్నారు: "ఓ జుల్ ఖర్ నైన్! వాస్తవానికి యాజూజ్ మరియు మాజూజ్ లు,[1] ఈ భూభాగంలో కల్లోలం రేకెత్తిస్తున్నారు. అయితే నీవు మాకూ మరియు వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మించటానికి, మేము నీకేమైనా శుల్కం చెల్లించాలా?"
[1] వీరి గాథ బైబిల్ లో కూడా పేర్కొనబడింది. చూడండి, యెహంజ్కేలు - (Exekiel), 38:2 మరియు 39:6. ఇంకా ఇతర చోట్లలో కూడా వీరి విషయం పేర్కొనబడింది. చూడండి, యోహాను ప్రకటన - (Revelation of St. John), 20:8. చాలా మంది వ్యాఖ్యాతలు వీరిని మంగోలులు లేక టాటార్ లు (Mongols or Tatars) కావచ్చని అంటారు. వీరు అసత్యవాదులు మరియు అంతిమ గడియకు ముందు భూమిలో కల్లోలం రేకెత్తించి మానవ నాగరికతను నాశనం చేస్తారు. ఇంకా చూడండి, 21:96-97. వాస్తవం అల్లాహ్ (సు.తా.)కే తెలుసు. 'స'హీ'హ్ బు'ఖారీ మరియు ముస్లింలలో ఇలా ఉంది: 'యా'జూజ్ మా'జూజ్ లు,' రెండు మానవ జాతులు. వారి సంఖ్య ఇతర మానవుల కంటే అధికముగా ఉంటుంది. మరియు వారితోనే నరకం అత్యధికంగా నిండుతుంది.
అతను అన్నాడు: "నా ప్రభువు ఇచ్చిందే నాకు ఉత్తమమైనది. ఇక మీరు మీ శ్రమ ద్వారా మాత్రమే నాకు సహాయపడితే, నేను మీకూ మరియు వారికీ మధ్య అడ్డుగోడను నిర్మిస్తాను.
"మీరు నాకు ఇనుప ముద్దలు తెచ్చి ఇవ్వండి." అతను ఆ రెండు కొండల మధ్య ఉన్న సందును మూసిన తరువాత వారితో అన్నాడు: "అగ్ని రగిలించండి." దానిని ఎర్రని నిప్పుగా మార్చిన తరువాత, అన్నాడు: "ఇక కరిగిన రాగిని తీసుకు రండి, దీని మీద పోయటానికి."
అతను (జుల్ ఖర్ నైన్) అన్నాడు: "ఇది నా ప్రభువు యొక్క కారుణ్యం. కాని నా ప్రభువు వాగ్దానపు ఘడియ వచ్చినపుడు ఆయన దీనిని బూడిదగా మార్చివేస్తాడు. మరియు నా ప్రభువు వాగ్దానం నిజమై తీరుతుంది."
మరియు ఆ (యాజూజ్ మరియు మాజూజ్ లు బయటికి వచ్చిన) రోజు, మేము వారిని అలల వలే ఒకరి మీద ఒకరు పడటానికి వదిలివేస్తాము. మరియు బాకా (సూర్) ఊదబడి నప్పుడు, వారందరినీ ఒకచేట సమావేశ పరుస్తాము.
ఏమీ? ఈ సత్యతిరస్కారులు నన్ను వదలి, నా దాసులను తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకొనగలరని భావించారా? నిశ్చయంగా, మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంటాము.
వీరే తమ ప్రభువు సూచనలను మరియు ఆయనను కలుసుకోవలసి వున్నదనే విషయాన్ని తిరస్కరించిన వారు. కావున వారి కర్మలన్నీ వ్యర్థమయ్యాయి. కాబట్టి మేము పునరుత్థాన దినమున వారి కర్మలకు ఎలాంటి విలువ (తూకము) నివ్వము.
వారితో అను: "నా ప్రభువు మాటలను వ్రాయటానికి, సముద్రమంతా సిరాగా మారి పోయినా - నా ప్రభువు మాటలు పూర్తికాక ముందే - దానికి తోడుగా దాని వంటి మరొక సముద్రాన్ని తెచ్చినా, అది కూడా తరిగి పోతుంది."[1]
(ఓ ప్రవక్తా!) ఇంకా ఇలా అను: "నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడనే! నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేయబడింది. నిశ్చయంగా, మీ ఆరాధ్య దేవుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే! కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా (షరీక్ లుగా) కల్పించుకోరాదు."
4. إبقاء معلومات نسخة الترجمة الموجودة داخل المستند.
5. إفادة المصدر (QuranEnc.com) بأي ملاحظة على الترجمة.
6. تطوير الترجمات وفق النسخ الجديدة الصادرة من المصدر (QuranEnc.com).
7. عدم تضمين إعلانات لا تليق بترجمات معاني القرآن الكريم عند العرض.
نتائج البحث:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".