(ఓ ముహమ్మద్!) సర్వశక్తిమంతుడూ, మహావివేకవంతుడూ అయిన అల్లాహ్, ఇదే విధంగా నీకూ మరియు నీ కంటే ముందు వచ్చిన వారికి కూడా దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేశాడు.[1]
[1] ఏ విధంగానైతే దైవప్రవక్త ('స'అస)పై దివ్యజ్ఞానం అవతరింపజేయబడిందో, అదే విధంగా అతనికి ముందు వచ్చిన ప్రవక్తలపై కూడా అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) పై వ'హీ అవతరణను గురించి, ఒక 'స'హాబీ (ర'ది.'అ), దైవప్రవక్త ('స'అస) ను ప్రశ్నించగా ఇలా అన్నారు : "కొన్ని సార్లు అది (వ'హీ) నా దగ్గరకు ఘంటల శబ్దం వలే వస్తుంది. ఇది చాలా కఠినతరమైనది. అది ఆగిన తరువాత నాకు అంతా కంఠస్తమైపోతుంది. కొన్నిసార్లు దైవదూత ('అ.స.) మానవరూపంలో వచ్చి నాకు చెబుతాడు. అతను చెప్పినదంతా నాకు జ్ఞాపకమైపోతుంది." 'ఆయిషహ్ (ర.'అన్హా) అన్నారు : "నేను విపరీతమైన చలికాలంలో కూడా, వ'హీ అవతరణ ముగిసిన తరువాత, దైవప్రవక్త ('స'అస) ను చెమటలో మునిగి పోవటాన్ని చూశాను. మరియు అతని నుదుటి నుండి చెమట బిందువులు కారటం కూడా చూశాను." ('స'హీ'హ్ బు'ఖారీ).
ఆకాశాలు, పై నుండి దాదాపు ప్రేలి పోనున్నాయి. మరియు దేవదూతలు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు మరియు భూమిలో ఉన్నవారి కొరకు క్షమాపణ కోరుతున్నారు. చూడండి, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
మరియు ఈ విధంగా మేము నీపై ఈ ఖుర్ఆన్ ను, అరబ్బీ భాషలో, దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము. [1] దానితో నీవు ఉమ్ముల్ ఖురా (మక్కా) [2] మరియు దాని చుట్టుప్రక్కల వారిని హెచ్చరించటానికి మరియు - దానిని గురించి ఎలాంటి సందేహం లేని - ఆ సమావేశ దినాన్ని గురించి హెచ్చరించేందుకు కూడా. [3] (ఆ రోజు) ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు మండే నరకాగ్నిలోకి పోతారు.
[1] చూడండి, 14:4, 13:37, 19:97 ప్రతి ప్రవక్త ('అ.స.) తన కాలపు ప్రజల భాషనే మాట్లాడేవాడు. [2] ఉమ్ముల్-ఖురా: అంటే అన్ని నగరాల తల్లి. మక్కా యొక్క మరొక పేరు. ఇది అతి ప్రాచీన నగరం. చూడండి 6:92 [3] పునరుత్థానదినం: సమావేశదినం ఎందుకు అనబడిందంటే, ఆ రోజు అన్ని తరాలకు చెందిన మానవులు, మంచివారు, చెడ్డవారు, విశ్వాసులు, అవిశ్వాసులు అందరూ సమావేశపరచ బడతారు.
మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు! [1] కాని ఆయన తాను కోరిన వారిని తన కరుణకు పాత్రులుగా చేసుకుంటాడు.[2] మరియు దుర్మార్గుల కొరకు, రక్షించేవాడు గానీ సహాయపడేవాడు గానీ ఎవ్వడూ ఉండడు.
లేక వారు ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారా? కానీ అల్లాహ్! కేవలం ఆయనే సంరక్షకుడు మరియు ఆయనే మృతులను బ్రతికించేవాడు మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు.
మరియు మీరు ఏ విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు కలిగి వున్నారో, దాని తీర్పు అల్లాహ్ వద్దనే ఉంది. [1] ఆయనే అల్లాహ్! నా ప్రభువు, నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను పశ్చాత్తాపంతో ఆయన వైపునకే మరలుతాను.
ఆయనే ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయన మీలో నుండే మీ కొరకు జంటల్ని మరియు పశువులలో కూడా జంటల్ని చేశాడు. [1] ఈ విధంగా, ఆయన మిమ్మల్ని వ్యాపింప జేస్తున్నాడు. ఆయనకు పోలింది ఏదీ లేదు. [2] మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.
[1] చూడండి, 16:72. [2] చూఆయన (సు.తా.) తో పోల్చదగినది విశ్వంలో ఏదీ లేదు. చూడండి, 6:100, 112:4.
ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క తాళపు చెవులు ఆయన వద్దనే వున్నాయి. ఆయన తాను కోరిన వానికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన వానికి) దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, ఆయనకు ప్రతిదానిని గురించి బాగా తెలుసు.
ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని [1] మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు. [2]
[1] అద్దీను: ధర్మం అంటే అల్లాహ్ (సు.తా.) ను విశ్వసించి ఆయన అద్వితీయాన్ని నమ్మి, ఆయన ప్రవక్తలను అనుసరించి, ఆయన షరీయత్ పై నడవటం. ప్రవక్తలందరి ధర్మం ఇదే! చూడండి, 2:213. కాని వారి షరీయత్ లలో కొన్ని భేదాలుండవచ్చు. (చూడండి, 5:48) అందుకే దైవప్రవక్త ('స'అస) అన్నారు : 'మేము (ప్రవక్తలం) అంతా సోదరులం. మా అందరి ధర్మం ఒక్కటే ఇస్లాం!' ('స'హీ'హ్ బు'ఖారీ) [2] అల్లాహ్ (సు.తా.) అతనికే మార్గదర్శకత్వం చేస్తాడు, ఎవడైతే స్వయంగా, అల్లాహ్ (సు.తా.) వైపునకు మరలుతాడో ! ఇక ఎవడైతే మార్గభ్రష్టత్వాన్ని ఎన్నుకుంటాడో, ఆయన, అతనిని దానిలో వదలుతాడు. అల్లాహ్ (సు.తా.) దృష్టిలో, ఆయనకు విధేయత (ఇస్లాం) మాత్రమే నిజమైన ధర్మం. చూడండి, 3:19, 3:85, 21:92 చూడండి, 23:52.
మరియు వారి వద్దకు (సత్య) జ్ఞానం వచ్చిన తరువాతనే - వారి పరస్పర ద్వేషం వల్ల - వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. మరియు ఒక నిర్ణీత కాలపు వాగ్దానం నీ ప్రభువు తరపు నుండి చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. [1] మరియు నిశ్చయంగా, వారి తర్వాత గ్రంథాన్ని వారసత్వంలో పొందిన వారు దానిని (ఇస్లాంను) గురించి గొప్ప సంశయంలో పడి ఉన్నారు.
కావున నీవు (ఓ ముహమ్మద్!) దీని (ఈ సత్యధర్మం) వైపునకే వారిని పిలువు. మరియు నీకు ఆజ్ఞాపించబడిన విధంగా దానిపై స్థిరంగా ఉండు. మరియు వారి కోరికలను అనుసరించకు. మరియు వారితో ఇలా అను: "అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నే నేను విశ్వసించాను. మరియు మీ మధ్య న్యాయం చేయమని నేను ఆజ్ఞాపించబడ్డాను. అల్లాహ్ యే మా ప్రభువు! మరియు మీ ప్రభువు కూడాను, మా కర్మలు మాకూ మరియు మీ కర్మలు మీకూ, మా మధ్య మరియు మీ మధ్య ఎలాంటి వివాదం ఉండనవసరం లేదు. అల్లాహ్ మనందరినీ సమావేశపరుస్తాడు. మరియు ఆయన వైపే (మనందరి) గమ్యస్థానముంది."
మరియు అల్లాహ్ సందేశం స్వీకరించిన తర్వాత, (స్వీకరించిన వారితో) ఆయనను గురించి ఎవరు వాదిస్తారో, వారి వాదం వారి ప్రభువు సన్నిధిలో నిరర్థకమైనది; మరియు వారిపై ఆయన (అల్లాహ్) ఆగ్రహం విరుచుకు పడుతుంది మరియు వారికి కఠిన శిక్ష పడుతుంది.
అల్లాహ్ యే సత్యంతో గ్రంథాన్ని [1] మరియు (న్యాయానికి) త్రాసును [2] అవతరింపజేశాడు. మరి నీవు ఏ విధంగా గ్రహించగలవు. బహుశా తీర్పు ఘడియ సమీపంలోనే ఉండవచ్చు!
[1] గ్రంథం అంటే ఇక్కడ అన్నీ దివ్యగ్రంథాలు. [2] త్రాసు ఎందుకు పేర్కొనబడిందంటే, న్యాయంగా తూచటానికి త్రాసు మాత్రమే ఉపయోగపడుతుంది. దీనికై చూడండి,57:25 మరియు 55:7-9.
దానిని నమ్మని వారే దాని కొరకు తొందర పెడతారు. మరియు విశ్వసించిన వారు, దానిని గురించి భయపడతారు మరియు అది రావటం నిశ్చయంగా, సత్యమేనని తెలుసుకుంటారు. వినండి! నిశ్చయంగా ఎవరైతే తీర్పు ఘడియను గురించి వాదులాడుతారో, వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయిన వారే!
ఎవడు పరలోక ఫలాన్ని కోరుకుంటాడో మేము అతనికి అతని ఫలంలో వృద్ధి కలిగిస్తాము. [1] మరియు ఎవడైతే ఇహలోక ఫలాన్ని కోరుకుంటాడో, మేము అతనికి దాని నొసంగుతాము మరియు అతనికి పరలోక (ప్రతిఫలంలో) ఎలాంటి భాగముండదు. [2]
[1] పుణ్యఫలితంలో ఈ అధికం, అల్లాహ్ (సు.తా.) కోరితే పదిరెట్లు లేక ఏడు వందల రెట్లు లేక ఇంకా ఎక్కువ రెంట్లు కావచ్చు. [2] ఇటువంటి ఆయత్ కు చూడండి, 17:18.
ఏమీ? అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా? ఒకవేళ తీర్పుదినపు వాగ్దానం ముందే చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి వుండేదే. మరియు నిశ్చయంగా, ఈ దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష పడుతుంది.
ఈ దుర్మార్గులు (పునరుత్థాన దినాన) తాము చేసిన కర్మల ఫలితాన్ని చూసి భయపడటాన్ని, నీవు చూస్తావు మరియు అది వారిపై తప్పక పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారు స్వర్గపు పచ్చిక మైదానాలలో ఉంటారు. వారికి తాము కోరేదంతా తమ ప్రభువు తరఫు నుండి లభిస్తుంది అదే ఆ గొప్ప అనుగ్రహం.
ఆ (స్వర్గపు) శుభవార్తనే, అల్లాహ్ విశ్వసించి సత్కార్యాలు చేసే తన దాసులకు తెలియజేస్తున్నాడు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నేను దీనికి బదులుగా మీ నుండి బంధుత్వ ప్రేమ తప్ప వేరే ప్రతిఫలాన్ని కోరడం లేదు!" [1] మరియు ఎవడు మంచిని సంపాదించుకుంటాడో, అతనికి దానిలో మేము మరింత మంచిని పెంచుతాము. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు.
[1] మక్కా ముష్రిక్ ఖురైషులు చాలామంది దైవప్రవక్త ('స'అస) దగ్గరి సంబంధీకులే. ఇక్కడ వారితో: 'స్నేహ, ప్రేమభావాలు చూపకున్నా - తాను, అల్లాహ్ (సు.తా.) ధర్మం ఇస్లాం ను ప్రచారం చేస్తున్నందుకు - కనీసం శత్రుత్వమైనా వహించకండి.' అని చెప్పమని అల్లాహ్ (సు.తా.) దైవప్రవక్త ('స'అస) ను ఆదేశిస్తున్నాడు.
మరొక ముఖ్య విషయం ఇక్కడ షియా తెగవారు భిన్నంగా అర్థం చేసుకొని దానిని ప్రచారం చేస్తున్నది: 'ఇక్కడ బంధుత్వ ప్రేమను వారు, 'అలీ, ఫాతిమా, 'హసన్ మరియు 'హుసైన్ ర'ది.'అన్హుమ్ లతో మాత్రమే, ప్రేమతో వ్యవహరించడం, అని అర్థం తీశారు. ఈ సూరహ్ మక్కాలో అవతరింపజేయబడింది. అప్పుడు 'అలీ మరియు ఫాతిమా (ర'ది. 'అన్హుమ్)ల వివాహం కూడా కాలేదు. మరొక విషయమేమిటంటే దైవప్రవక్త ('స'అస) కు నలుగురు కుమార్తెలు, 'జైనబ్, రుఖయ్య, ఉమ్మె కుల్సూ'మ్, ఫాతిమ మరియు ముగ్గురు కుమారులు, ఖాసిమ్, 'అబ్దుల్లాహ్ మరియు ఇబ్రాహీమ్ (రజి.అన్హుమ్)లు. కుమారులందరూ చిన్న వయస్సులలోనే చనిపోయారు. కాని ఇతర ముగ్గురు కుమార్తెలు (ర'ది.'అన్హుమ్) భర్తా, పిల్లలు గలవారు. వారు కూడా దైవప్రవక్త ('స'అస) యొక్క దగ్గరి సంబంధీకు (ఖురబా)లలోని వారే కదా! వారిలో ఇద్దరు మూడవ 'ఖలీఫా 'ఉస్మాన్ (ర'ది.'అ.) భార్యలు కూడాను. కాని ఈ షియా తెగవారు, వారిని దైవప్రవక్త ('స'అస) దగ్గరి సంబంధీకులలో పరిగణించకపోవడం అతిశయం కాదా!
ఏమీ? వారు: "అతను (ముహమ్మద్!) అల్లాహ్ పేరుతో అసత్యాలు కల్పిస్తున్నాడు" అని అంటున్నారా? కాని ఒకవేళ అల్లాహ్ తలచుకుంటే, నీ హృదయం మీద ముద్రవేసే వాడు. మరియు అల్లాహ్ అసత్యాన్ని రూపుమాపి, తన ఆజ్ఞతో సత్యాన్ని స్థాపిస్తాడు. [1] నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్నదంతా బాగా తెలుసు.
మరియు ఆయన విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి ప్రార్థనలను అంగీకరిస్తాడు మరియు వారిపై తన అనుగ్రహాన్ని మరింత అధికం చేస్తాడు. ఇక సత్యతిరస్కారులు! వారికి కఠిన శిక్ష పడుతుంది.
మరియు ఒకవేళ అల్లాహ్ తన దాసులందరికీ పుష్కలంగా జీవనోపాధిని ప్రసాదించి ఉంటే, వారు భూమిలో తిరుగుబాటుకు పాల్పడేవారు. కావున ఆయన తన ఇష్టప్రకారం, మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, ఆయన తన దాసులను గురించి బాగా ఎరుగును, ఆయన అంతా చూస్తున్నాడు!
మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో), ఆకాశాలను మరియు భూమిని మరియు వాటిలో వ్యాపింపజేసిన జీవరాసులను సృష్టించటం కూడా ఉంది. మరియు ఆయన తాను కోరినప్పుడు వాటినన్నింటినీ సమీకరించగల సమర్ధుడు.
మీపై ఏ ఆపద వచ్చినా, అది మీ చేతులారా మీరు సంపాదించుకున్నదే! మరియు ఆయన (మీ తప్పులను) ఎన్నింటినో క్షమిస్తాడు.[1]
[1] చూడండి, 51:52-53. వ్యాఖ్యాతలు దీనిని రెండు విధాలుగా అర్థం చేసుకున్నారు.
ఒకటి : పూర్వప్రజలు తమ ప్రవక్త ('అలైహిమ్.స.)లతో ఇతను పిచ్చివాడు, మాంత్రికుడు, అసత్యవాదుడు, వగైరా అన్న మాటలనే ఈ మక్కా ముష్రికులు కూడా నీతో అంటున్నారు. ఈ విధంగా దైవప్రవక్త ('స'అస) ఓదార్చబడుతున్నారు.
రెండో అర్థం : దైవప్రవక్త ('స'అస) తో ఏకాగ్రచిత్తం, ఏక దైవారాథన, (ఇస్లాం) గురించి చెప్పబడిన మాటలు, ఇంతకు ముందు ప్రవక్తలందరితో చెప్పబడిన మాటలే! (ఫ'త్హ్ అల్-ఖదీర్).
కావున మీకు ఇవ్వబడిందంతా ప్రాపంచిక జీవితపు సుఖసంతోషమే. కనుక అల్లాహ్ వద్దనున్నదే - విశ్వసించి తమ ప్రభువునే నమ్ముకున్న వారి కొరకు - ఉత్తమమైనదీ మరియు శాశ్వతమైనదీను.[1]
[1] కావున ఇహలోక జీవిత సుఖసంతోషాలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వకుండా, విశ్వసించి సత్కార్యాలు చేయటంలో పోటీ పడండి.
మరియు అలాంటి వారు పెద్ద పాపాలు మరియు అశ్లీలమైన పనులకు దూరంగా ఉంటారు మరియు కోపం వచ్చినా క్షమిస్తారు, [1]
[1] దైవప్రవక్త ('స'అస) తన స్వంతానికి జరిగిన కష్ట నష్టాలకూ, హానికీ ఎన్నడూ ప్రతీకారం తీసుకోలేదు. కాని అల్లాహ్ (సు.తా.) యొక్క హద్దులను అతిక్రమించటం అతనికి సహించరాని విషయం, (బు'ఖారీ, ముస్లిం).
మరియు అలాంటి వారు తమ ప్రభువు ఆజ్ఞాపాలన చేస్తారు మరియు నమాజ్ ను స్థాపిస్తారు [1] మరియు తమ వ్యవహారాలను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించు కుంటారు [2] మరియు మేము వారికి ప్రసాదించిన జీనవోపాధి నుండి ఇతరుల మీద ఖర్చు చేస్తారు;
[1] నమా'జ్ ను సరిగ్గా, దాని సమయంలో చేయటం విశ్వాసానికి ఆనవాలు. [2] 'స'హాబా (ర'ది.'అన్హుమ్)లు తమ విషయాలలో పరస్పరం సంప్రదింపులు, సలహాలు చేసుకునేవారు. దైవప్రవక్త ('స'అస) కూడా ముఖ్యమైన విషయాలలో, యుద్ధ సన్నాహాలలో తమ అనుచరు(ర'ది.'అన్హుమ్)లతో సంప్రదింపులు చేసేవారు. ఒక పాలకుడు కూడ తనకు సలహాలివ్వటానికి నిపుణులను నియమించుకోవడం ఎంతో ముఖ్యం. చూడండి, 3:159.
మరియు అలాంటి వారు తమపై దౌర్జన్యం జరిగినపుడు దానికి న్యాయప్రతీకారం మాత్రమే చేస్తారు. [1]
[1] దైవప్రవక్త ('స'అస) ఎన్నడూ, తనకు హాని చేసిన వారితో కూడా ప్రతీకారం తీర్చుకోలేదు. ఉదాహరణకు అతనికి ఆహారంలో విషమిచ్చిన యూద స్త్రీతో మరియు అతనిపై మంత్రజాలం (చేతబడి) చేసిన లుబైద్ బిన్ 'ఆసిమ్ తో లేక అతనిని చంపగోరిన వారితో గాని ప్రతీకారం తీర్చుకోలేదు.
మరియు కీడుకు ప్రతీకారం దానంతటి కీడు మాత్రమే. కాని ఎవడైనా క్షమించి సంధి చేసుకుంటే అతని ప్రతిఫలం అల్లాహ్ దగ్గర ఉంది. నిశ్చయంగా, ఆయన దుర్మార్గులంటే ఇష్టపడడు.[1]
కాని, వాస్తవానికి ఎవరైతే ప్రజలపై దౌర్జన్యాలు చేస్తారో మరియు భూమిలో అన్యాయంగా ఉపద్రవాలు రేకెత్తిస్తారో అలాంటి వారు నిందార్హులు. అలాంటి వారు, వారికే! బాధాకరమైన శిక్ష గలదు.
మరియు, ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో! దాని తరువాత వాడికి సంరక్షకుడు, ఎవ్వడూ ఉండడు. [1] మరియు ఈ దుర్మార్గులు శిక్షను చూసినపుడు: "మేము తిరిగి (భూలోకంలోకి) పోయే మార్గమేదైనా ఉందా?" అని అడగటం నీవు చూస్తావు. [2]
[1] చూడండి, 14:4 చివరి వాక్యం. [2] చూడండి, 6:27-28.
మరియు వారిని, దాని (నరకం) ముందుకు తీసుకొని వచ్చినప్పుడు, వారు అవమానంతో కృంగిపోతూ, దొంగచూపులతో దానిని చూడటం నీవు గమనిస్తావు. మరియు విశ్వసించిన వారు ఇలా అంటారు: "నిశ్చయంగా, తమను తాము మరియు తమ సంబంధీకులను (అనుచరులను) నష్టానికి గురి చేసుకున్నవారే, ఈ పునరుత్థాన దినమున నష్టపోయే వారు. జాగ్రత్త! నిశ్చయంగా, దుర్మార్గులే శాశ్వతమైన శిక్షకు గురి అవుతారు."
మరియు అల్లాహ్ తప్ప, ఇతరులెవ్వరూ వారికి రక్షకులుగా గానీ, సహాయకులుగా గానీ ఉండరు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలిన వారికి (దాని నుండి బయటపడే) మార్గమేదీ వుండదు.
(కావున ఓ మానవులారా మరియు జిన్నాతులారా!) మీరు, తొలగింపబడే అవకాశం లేనటువంటి ఆ దినం అల్లాహ్ తరఫు నుండి రాకముందే, మీ ప్రభువు ఆజ్ఞను శిరసావహించండి. ఆ రోజున మీకు ఎక్కడా ఆశ్రయం లభించదు. మరియు మీకు (మీ పాపాలను) నిరాకరించటానికి కూడా వీలుండదు. [1]
(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు విముఖులైతే మేము నిన్ను వారిపై రక్షకునిగా చేసి పంపలేదు. నీ పని కేవలం (సందేశాన్ని) అందజేయటం మాత్రమే. [1] మరియు మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపిస్తే, దానికి అతడు సంతోషంతో పొంగిపోతాడు. కాని ఒకవేళ వారికి తమ చేతులారా చేసుకున్న దానికి ఫలితంగా, కీడు కలిగినట్లయితే! నిశ్చయంగా, అప్పుడు మానవుడు కృతఘ్ను డవుతాడు!
భూమ్యాకాశాల సామ్రాజ్యాధికారం అల్లాహ్ దే! ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. ఆయన తాను కోరిన వారికి కుమార్తెలను ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి కుమారులను ప్రసాదిస్తుడు.
లేదా! వారికి కుమారులను మరియు కుమార్తెలను కలిపి ప్రసాదిస్తాడు. మరియు తాను కోరిన వారికి అసలు సంతానమే ఇవ్వడు. నిశ్చయంగా, ఆయన సర్వజ్ఞుడు, అంతా చేయగల సమర్ధుడు.
మరియు అల్లాహ్ తో మాట్లాడగలిగే శక్తి ఏ మానవునికీ లేదు; కేవలం దివ్యజ్ఞానం (వహీ) ద్వారా లేదా తెర వెనుక నుండి, లేదా ఆయన పంపిన సందేశహరుని ద్వారా, ఆయన అనుమతితో, ఆయన కోరిన (వహీ) అవతరింప జేయబడటం తప్ప! [1] నిశ్చయంగా, ఆయన మహోన్నతుడు, మహా వివేకవంతుడు.
[1] ఈ ఆయత్ లో దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడే మూడు విధానాలు పేర్కొనబడ్డాయి: 1) హృదయంలో ఒక విషయం వేయబడటం, లేక స్వప్నంలో వినిపింపజేయబడటం - ఇది అల్లాహ్ (సు.తా.) తరఫు నుండియే ఉందనే దృఢనమ్మకంతో! 2) తెర వెనక నుండి వినిపింపజేయబడటం - ఏ విధంగానైతే మూసా ('అ.స.)కు 'తూర్ పర్వతం మీద వినిపించబడిందో! 3) దైవదూత ('అలైహిమ్ స.) ల ద్వారా అల్లాహ్ (సు.తా.) తన వ'హీని పంపటం. ఏ విధంగానైతే దైవప్రవక్త ('స'అస) దగ్గరకు జిబ్రీల్ ('అ.స.) వ'హీని తీసుకొని వచ్చేవారో! చూడండి, 53:10.
మరియు ఇదే విధంగా (ఓ ముహమ్మద్!) మేము మా ఆజ్ఞతో నీ వద్దకు దివ్యజ్ఞానం (రూహ్) అవతరింపజేశాము. [1] (దీనికి ముందు) నీకు గ్రంథమేమిటో మరియు విశ్వాసమేమిటో తెలియదు. కాని మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) జ్యోతిగా జేసి, దీని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి, మార్గదర్శకత్వం చేస్తాము. [2] మరియు నిశ్చయంగా, నీవు (ప్రజలకు) ఋజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు.
[1] రూ'హున్: ఇక్కడ దివ్యజ్ఞానం (ఖుర్ఆన్) అనే అర్థమిస్తోంది. ఎందుకంటే ఖుర్ఆన్ వల్ల హృదయాలకు 'జీవం' లభిస్తుంది. ఏ విధంగానైతే రూ'హ్ తో మానవునికి జీవం లభిస్తుందో! చూడండి, 16:2, 40:15. [2] చూడండి, 41:44.
Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik - Sadržaj prijevodā
Prijevod značenja Plemenitog Kur'ana na telugu jezik - Abdurrahim ibn Muhammed. Štampao i distribuirao Kompeks kralja Fehda za štampanje Plemenitog Kur'ana u Medini, 1434. godine po Hidžri.
Contents of the translations can be downloaded and re-published, with the following terms and conditions:
1. No modification, addition, or deletion of the content.
2. Clearly referring to the publisher and the source (QuranEnc.com).
3. Mentioning the version number when re-publishing the translation.
4. Keeping the transcript information inside the document.
5. Notifying the source (QuranEnc.com) of any note on the translation.
6. Updating the translation according to the latest version issued from the source (QuranEnc.com).
7. Inappropriate advertisements must not be included when displaying translations of the meanings of the Noble Quran.
Rezultati pretraživanja:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".