మరియు నీవు బిగ్గరగా మాట్లాడితే (ఆయన విననే వింటాడు); వాస్తవానికి, ఆయనకు రహస్యంగా (చెప్పుకునే మాటలే గాక) అతి గోప్యమైన మాటలు కూడా, తెలుస్తాయి.[1]
[1] అల్లాహ్ (సు.తా.) ను పెద్ద స్వరంతో అర్థించే అవసరం లేదు. ఎందుకంటే ఆయన అతి రహస్య విషయాలను కూడా తెలుసుకుంటాడు. ఆయనకు మానవుల భవిష్యత్తు కూడా తెలుసు. అది ఆయన దగ్గర వ్రాయబడి ఉంది! ఆయనకు జరిగిపోయిందే గాక, జరుగుతున్నది మరియు ముందు జరగబోయేది అన్నీ తెలుసు. అంటే పునరుత్థాన దినం వరకు మరియు ఆ తరువాత కూడా ఎల్లప్పుడూ జరుగబోయే అన్ని విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ (సు.తా.) కే ఉంది మరియు ఇతరులకు ఎవ్వరికీ లేదు. అంటే దైవప్రవక్తలు, దైవదూత ('అలైహిమ్.స.)లకు మరియు జిన్నాతులకు కూడా లేదు.
అతను ఒక మంటను చూసినపుడు తన ఇంటి వారితో ఇలా అన్నాడు:[1] "ఆగండి! నిశ్చయంగా, నాకొక మంట కనబడుతోంది; బహుశా నేను దాని నుండి మీ కొరకు ఒక కొరివిని తీసుకొని వస్తాను లేదా ఆ మంట దగ్గర, నాకేదైనా మార్గదర్శకత్వం లభించవచ్చు!"
[1] మూసా ('అ.స.) కొన్ని సంవత్సరాలు ఆయ్ కహ్ లో గడిపిన తరువాత - తన భార్యా పిల్లలతో సహా - తన తల్లి, సోదరుడు హారూన్ ('అ.స.) మరియు తన జాతి వారి వద్దకు వెళ్ళటానికి బయలుదేరుతారు. సినాయి ద్వీపకల్పం దక్షిణ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విషయం సంభవిస్తుంది. ఇంకా చూడండి, 27:78 మరియు 28:29.
(మూసా) అన్నాడు: "ఇది నా చేతికర్ర, దీనిని ఆనుకొని నిలబడతాను మరియు దీనితో నా మేకల కొరకు ఆకులు రాల్చుతాను. మరియు దీని నుండి నాకు ఇంకా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి."
ఇతనిని (ఈ బాలుణ్ణి) ఒక పెట్టెలో పెట్టి దానిని (ఆ పెట్టెను) నదిలో విడువు. నది దానిని ఒక ఒడ్డుకు చేర్చుతుంది; దానిని నాకు మరియు ఇతనికి శత్రువు అయిన వాడు తీసుకుంటాడు.; మరియు నేను నా తరఫు నుండి నీ మీద ప్రేమను కురిపించాను మరియు నిన్ను నా కంటి మందు పోషింపబడేటట్లు చేశాను.[1]
అప్పుడు నీ సోదరి (నిన్ను) అనుసరిస్తూ పోయి, వారితో ఇలా అన్నది: 'ఇతనిని పెంచి పోషించగల ఒకామెను నేను మీకు చూపనా?'[1] ఈ విధంగా మేము నిన్ను మళ్ళీ నీ తల్లి దగ్గరకు చేర్చాము, ఆమె కళ్ళకు చల్లదనమివ్వటానికి, ఆమెను దుఃఖపడకుండా ఉంచటానికి.[2] మరియు నీవొక వ్యక్తిని చంపావు,[3] మేము ఆ ఆపద నుండి నీకు విముక్తి కలిగించాము. మేము నిన్ను అనేక విధాలుగా పరీక్షించాము.[4] ఆ తరువాత నీవు ఎన్నో సంవత్సరాలు మద్ యన్ వారితో ఉంటివి.[5] ఓ మూసా! ఇప్పుడు నీవు (మా) నిర్ణయానుసారంగా (ఇక్కడికి) వచ్చావు.
కాని అతనితో మృదువుగా మాట్లాడండి. బహుశా అతడు హితబోధ స్వీకరిస్తాడేమో, లేదా భయపడతాడేమో!"[1]
[1] అల్లాహ్ (సు.తా.)కు తెలుసు అతడు హితబోధ స్వీకరించడని, కాని మూసా (అ.స.)కు ఏమీ తెలియదు. ఎందుకంటే ప్రవక్తలు కూడా మానవులే. వారికి అల్లాహ్ (సు.తా.) తెలిపేది తప్ప ఇతర అగోచర విషయాల జ్ఞానం ఉండదు. ఇదే అల్లాహ్ (సు.తా.) ఇచ్ఛ. దీని వల్ల ప్రవక్త ప్రతి వానిని: 'అల్లాహ్ (సు.తా.) మార్గం వైపునకు, సత్యమార్గం వైపునకు, మోక్షం పొందటానికి రండి.' అని ఆహ్వానిస్తుంటాడు. అదే ప్రవక్త బాధ్యత. ఇందులో దా'ఈలు మృదువుగా వ్యవహరించాలనే సూచన కూడా ఉంది.
(మూసా మరియు హారూన్) ఇద్దరూ ఇలా అన్నారు: "ఓ మా ప్రభూ! వాస్తవానికి, అతడు మమ్మల్ని శిక్షిస్తాడేమోనని, లేదా తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడేమోనని మేము భయపడుతున్నాను!"
కావున మీరిద్దరూ అతని వద్దకు పోయి ఇలా అనండి: "నిశ్చయంగా, మేమిద్దరం నీ ప్రభువు యొక్క సందేశహరులము. కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు.[1] మరియు వారిని బాధ పెట్టకు. వాస్తవానికి మేము నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుండి సూచనలు తీసుకొని వచ్చాము. మరియు సన్మార్గాన్ని అనుసరించే వానిపై (అల్లాహ్ తరపు నుండి) శాంతి వర్ధిల్లుతుంది![2]
[1] వివరాలకు చూడండి, 2:49, 7:141, 14:6. [2] వస్సలాము 'అలా మనిత్తబ'ల్ హుదా! దైవప్రవక్త ('స'అస) రోమన్ చక్రవర్తికి వ్రాసిన ఉత్తరాన్ని ఈ పై వాక్యంతో ప్రారంభించారు, (ఇబ్నె-కసీ'ర్). దీనితో స్పష్టమయ్యేది ఏమిటంటే ముస్లిమేతరుల సభలో లేక ఉత్తరం ద్వారా సంభాషణ ప్రారంభించునప్పుడు ఈ శభ్దాలను వాడాలి.
" 'నిశ్చయంగా, ఎవడైతే సత్యాన్ని తిరస్కరించి వెనుదిరిగి పోతాడో, అతనికి కఠినశిక్ష తప్పక ఉంటుంది' అని వాస్తవానికి మాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలుపబడింది."
ఆయనే మీ కొరకు భూమిని చదునుగా (పరువుగా) జేసి, అందులో మీకు (నడవటానికి) త్రోవలను ఏర్పరిచాడు. మరియు ఆకాశం నుండి నీటిని కురిపించాడు. మేము దాని ద్వారా రకరకాల వృక్షకోటిని పుట్టించాము.[1]
[1] అ'జ్వాజున్: ఇక్కడ దీని అర్థం వివిధ రకాలు. ఇదే అర్థం 13:3లో కూడా ఉంది.
దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొకసారి లేవుతాము.[1]
[1] మానవుణ్ణి మట్టి నుండి సృష్టించాము. వివరాలకు చూడండి, 3:59లో తురాబ్ మరియు 15:26లో 'స'ల్సాలిన్ 'హమఇన్ మన్నూన్. ఇబ్నె మాజా ఉల్లేఖనం: ఒక మృతుణ్ణి సమాధిలో పెట్టిన తరువాత రెండు చేతులతో మూడు సార్లు మట్టి పోయడం అభిలషణీయం (ముస్త'హబ్).
సరే! మేము కూడా దాని వంటి మంత్రజాలాన్ని నీకు పోటీగా తెస్తాము; కావున మా మధ్య నీ మధ్య (సమావేశానికి) ఒక సమయం మరియు స్థలాన్ని నిర్ణయించు. దాని నుండి మేము కానీ నీవు కానీ వెనుకాడ కూడదు. మరియు అదొక యుక్తమైన స్థలమై ఉండాలి."
మూసా వారితో అన్నాడు: "మీరు నాశనమవుగాక! అల్లాహ్ పై అబద్ధాలు కల్పించకండి! అలా చేస్తే ఆయన కఠినశిక్షతో మిమ్మల్ని నిర్మూలించవచ్చు! (అల్లాహ్ పై) అబద్ధాలు కల్పించేవాడు తప్పక విఫలుడవుతాడు."
(వారు పరస్పరం ఈ విధంగా) మాట్లాడుకున్నారు: "వాస్తవానికి వీరిద్దరూ మాంత్రికులే! వీరిద్దరు తమ మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి వెడల గొట్టి, మీ ఆదరణీయమైన విధానాన్ని అంతమొందించ గోరుతున్నారు.[1]
[1] ఏ విధంగానైతే ఈ రోజు కూడా అసత్య మార్గం మీద, షిర్కులో మునిగి ఉన్నవారు కూడా తామే సరైన మార్గం మీద ఉన్నామని గర్విస్తారో అదే విధంగా వారూ గర్వించారు. చూడండి, 30:32.
(మూసా) అన్నాడు: "లేదు! మీరే (ముందు) విసరండి!" అప్పుడు ఆకస్మాత్తుగా వారి త్రాళ్ళు మరియు వారి కర్రలూ - వారి మంత్రజాలం వల్ల - అతనికి (మూసాకు) చలిస్తూ ఉన్నట్లు కనిపించాయి.[1]
[1] ఇక్కడ: 'వారి త్రాళ్ళు మంత్రజాలం వల్ల చలిస్తున్నట్లు,' అని ఉంది. అంటే అవి పాములుగా కనిపించాయే, గానీ వాస్తవానికి పాములుగా మారలేదు. దీనితో విశదమయ్యేది ఏమిటంటే మంత్రజాలం (మిస్మరిస్మ్), మంత్ర ప్రభావం వల్ల తాత్కాలికంగా ప్రజలకు అలా కనిపిస్తుందే కానీ నిజానికి ఏ మార్పూ రాదు.
మేము (అల్లాహ్) అన్నాము: "భయపడకు! నిశ్చయంగా నీవే ప్రాబల్యం పొందుతావు.[1]
[1] మూసా ('అ.స.) భయపడటానికి కారణం అతను కూడా ఒక మానవుడే. ప్రవక్త ('అలైహిమ్. స.) లు అందరూ మానవులే కాని వారిపై దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడుతుంది. అల్లాహ్ (సు.తా.) తెలిపినది తప్ప, వేరే అగోచర జ్ఞానం గానీ, భవిష్యత్తులో జరుగబోయే వాటి జ్ఞానం గానీ వారికి ఉండదు. అల్లాహ్ (సు.తా.): 'భయపడకు నీవే ఆధిక్యత వహిస్తావు.' అని అన్నప్పుడు అతనికి ధైర్యం వచ్చింది. అంటే అద్భుత సూచనలు చూపటం కూడా అల్లాహ్ (సు.తా.) చేతిలోనే ఉంది. ప్రవక్తలు ఏదైనా అద్భుత విషయం జరిగే వరకు, అది జరుగనున్నదని ఎరగరు. అంటే వారికెలాంటి అగోచర జ్ఞానం ఉండదు.
నీ కుడిచేతిలో ఉన్నదానిని విసురు! అది వారు కల్పించిన వాటిని మ్రింగి వేస్తుంది. వారు కల్పించినది నిశ్చయంగా, మాంత్రికుని తంత్రమే! మరియు మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే!"
(ఫిర్ఔన్) అన్నాడు: "నేను అనుమతించక ముందే, మీరు ఇతనిని విశ్వసించారా?[1] నిశ్చయంగా, ఇతనే మీకు మంత్రజాలం నేర్పిన గురువు! కావున ఇప్పుడు నేను మీ అందరి చేతులను మరియు కాళ్ళను వ్యతిరేక పక్షల నుండి నరికిస్తాను[2] మరియు మిమ్మల్ని అందరినీ, ఖర్జూరపు దూలాల మీద సిలువ (శూలారోహణ) చేయిస్తాను. అప్పుడు మా ఇద్దరిలో ఎవరి శిక్ష ఎక్కువ కఠినమైనదో మరియు దీర్ఘకాలికమైనదో మీకు తప్పక తెలియగలదు."
వారు (మాంత్రికులు) అన్నారు: "మా వద్దకు వచ్చిన స్పష్టమైన సూచనలను మరియు మమ్మల్ని సృజించిన ప్రభువు (అల్లాహ్)ను వదలి, మేము నీకు ప్రాధాన్యతనివ్వము. నీవు చేయ దలచు కున్నది చేసుకో! నీవు కేవలం ఐహిక జీవితాన్ని మాత్రమే అంతమొందించ గలవు. [1]
[1] ఇక్కడ మాంత్రికులు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఫిర్'ఔన్ ను సంతోషపరచటంలో నిమగ్నులై ఉండిరి. ప్రాపంచిక వ్యామోహంలో పడి ఉండిరి, కాబట్టి: 'మేము గెలిస్తే మాకు బహుమానం దొరుకుతుంది కదా?' అని అడిగారు. కాని వారికి మార్గదర్శకత్వం దొరికి మూసా ('అ.స.) ఆరాధించే ప్రభువే నిజమైన ప్రభువు అని తెలిసినప్పుడు, వారు అల్లాహ్ (సు.తా.) సాన్నిధ్యాన్ని పొందటానికి ఇహలోక భోగభాగ్యాలనే కాదు, తమ జీవితాలను కూడా కోల్పోవటానికి సిద్ధపడ్డారు. ఎంత గొప్ప దైవభితిని (తఖ్వా) కనబరచారో చూడండి.
నిశ్చయంగా, మేము మా ప్రభువునందే విశ్వాసముంచాము, ఆయన (అల్లాహ్) యే మా తప్పులను మరియు నీవు బలవంతంగా మా చేత చేయించిన మంత్రతంత్రాలను క్షమించేవాడు. (ప్రతి ఫలమివ్వటంలో) అల్లాహ్ యే సర్వశ్రేష్ఠుడు మరియు శాశ్వతంగా ఉండేవాడు (నిత్యుడు)."[1]
[1] అబ్'ఖా, అల్-బా'ఖి: The Ever-Lasting. He whose existence will have no end. నిత్యుడు, శాశ్వితుడు, చిరస్థాయిగా ఉండేవాడు. చూడండి, 55:26-27, (సేకరించబడిన పదం). ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
మరియు వాస్తవానికి, మేము మూసాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలిపాము:[1] "నా దాసులను రాత్రివేళ తీసుకొని బయలుదేరు మరియు వారి కొరకు సముద్రం నుండి తడిలేని మార్గాన్ని ఏర్పరచు; వెంబడించి పట్టుబడతావేమోనని భయపడకు, (సముద్రంలో మునిగి పోతావేమోనని కూడా) భీతి చెందకు."[2]
ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! వాస్తవానికి మేము, మిమ్మల్ని మీ శత్రువు నుండి విముక్తి కలిగించి, తూర్ పర్వతపు కుడివైపున మీతో వాగ్దానం చేసి, మీపై మన్న మరియు సల్వాలను అవతరింపజేశాము.[1]
(ఇంకా ఇలా అన్నాము): "మేము మీకు ప్రసాదించిన మంచి ఆహారపదార్థాలను తినండి,[1] అందు తలబిరుసుతనం చేయకండి, అలా చేస్తే నా ఆగ్రహానికి గురి కాగలరు. నా ఆగ్రహానికి గురి అయినవాడు తప్పక నాశనమవుతాడు.
[1] మన్న మరియు సల్వాలను గురించి చూడండి, 2:57, 7:160. మన్న ఒక తియ్యని ఆహారపదార్థం. సల్వా ఒక రకమైన పక్షి (బుర్రపిట్ట, పూరెడు పిట్ట, కోలంకి పిట్ట లాంటిది).
అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో ఉంటాడో, అలాంటి వాని పట్ల నేను క్షమాశీలుడను."[1]
[1] అల్-గఫ్ఫారు': Oft-Forgiving, Most Forgiving. క్షమించేవాడు, పాపాలను క్షమించేవాటడు, ఎక్కువగా క్షమించేవాడు. ఇంకా చూడండి, అల్-గాఫిర్: క్షమాగుణ పరిపూర్ణుడు, 40:3. అల్-'గఫూరు: క్షమాశీలుడు, 2:173, అల్-'గఫ్ఫారు మరియు అల్-'గఫూరు అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
(మూసా) జవాబిచ్చాడు: "అదిగో! వారు నా వెనుక నా అడుగు జాడలలో వస్తూనే ఉన్నారు; నీవు నా పట్ల ప్రసన్నుడవు కావాలని, ఓ నా ప్రభూ! నేను త్వరత్వరగా నీ సాన్నిధ్యానికి వచ్చాను."[1]
[1] ఇక్కడ స్పష్టమయ్యేది ఏమిటంటే ఒక జాతి చాలా కాలం వరకు దాస్యంలో ఉండి అకస్మాత్తుగా దానికి స్వాతంత్ర్యం దొరికితే, అది తన భూత కాలపు క్రమశిక్షణలేని స్వభావాన్ని మార్చుకోలేదు. కాబట్టి ముందు తెలుపబడినట్లు, మూసా ('అ.స.) వెళ్ళిపోగానే అతన జాతివారు, ఆవుదూడను ఆరాధ్యదైవంగా చేసుకున్నారు. ఎందుకంటే, అంతకు ముందు వారు ఈజిప్టులో విగ్రహారాధనకు అలవాటు పడి ఉండిరి.
ఆ తరువాత మూసా కోపంతోనూ, విచారంతోనూ, తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీ ప్రభువు మీకు మంచి వాగ్దానం చేయలేదా? ఏమీ? ఒడంబడిక పూర్తి కావటంలో ఏమైనా ఆలస్య మయ్యిందా? లేదా! మీ ప్రభువు యొక్క ఆగ్రహం మీపై విరుచుకు పడాలని కోరుతున్నారా? అందుకేనా మీరు నాకు చేసిన వాగ్దానాన్ని భంగ పరచారు?"
వారు అన్నారు: "మేము నీకు చేసిన వాగ్దానాన్ని మాకు మేమై భంగపరచలేదు. కాని మాపై ప్రజల ఆభరణాల భారం మోపబడి ఉండెను, దానిని (అగ్నిలోకి) విసిరాము, ఇదే విధంగా సామిరి కూడా వేశాడు."
తరువాత అతడు (సామిరి) వారికొక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేశాడు. దాని నుండి ఆవుదూడ అరుపు వంటి శబ్దం వచ్చేది.[1] పిదప వారన్నారు: "ఇదే మీ ఆరాధ్య దైవం మరియు మూసా యొక్క ఆరాధ్య దైవం కూడాను, కాని అతను దానిని మరచిపోయాడు."
ఏమీ? అది వారికెలాంటి సమాధానమివ్వజాలదనీ మరియు వారికెలాంటి కీడు గానీ, మేలు గానీ చేయజాలదనీ వారు చూడటం లేదా?"[1]
[1] అల్లాహ్ (సు.తా.) వారి బుద్ధిహీనతను స్పష్టం చేస్తున్నాడు. ఆ ఆవుదూడ వారి ప్రశ్నకు సమాధాన మివ్వజాలదూ మరియు వారికెలాంటి లాభం గానీ నష్టం గానీ చేయజాలదూ, అని తెలిసి కూడా వారు దానిని ఆరాధించడం, బుద్ధిహీనత కాక మరేమిటి? ఆరాధ్య దేవుడు అల్లాహ్ (సు.తా.) మాత్రమే, ఆయనే తన దాసుల మొర వింటాడు మరియు వారికి లాభాం గానీ, నష్టం గానీ చేయగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు.
మరియు వాస్తవానికి హారూన్ ఇంతకు ముందు వారితో చెప్పి ఉన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! దీని (విగ్రహం)తో మీరు పరీక్షింప బడుతున్నారు. మరియు నిశ్చయంగా, ఆ అనంత కరుణామయుడే మీ ప్రభువు! కావున మీరు నన్నే అనుసరించండి మరియు నా ఆజ్ఞనే పాలించండి."
(హారూన్) అన్నాడు: "నా తల్లి కుమారుడా (సోదరుడా)! నా గడ్డాన్ని గానీ, నా తలవెంట్రుకలను గానీ పట్టి లాగకు: 'వాస్తవానికి ఇస్రాయీల్ సంతతి వారిలో విభేదాలు కల్పించావు, నీవు నా మాటను లక్ష్యపెట్టలేదు.' అని, నీవు అంటావేమోనని నేను భయపడ్డాను."[1]
(సామిరీ) అన్నాడు: "వారు చూడని దానిని నేను చూశాను. ఆ తరువాత నేను సందేశహరుని (జిబ్రీల్)[1] పాదగుర్తుల నుండి ఒక పిడికెడు (మట్టి) తీసుకొని దాని (ఆవుదూడ విగ్రహం) మీద వేశాను మరియు నా ఆత్మ నన్ను ఈ విధంగా ప్రేరేపించింది."
[1] చాలామంది వ్యాఖ్యాతలు రసూల్ అంటే ఇక్కడ జిబ్రీల్ ('అ.స.) అనే వ్యాఖ్యానించారు.
(మూసా) అన్నాడు: "సరే వెళ్ళిపో! నిశ్చయంగా, నీ శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం 'నన్ను ముట్టవద్దు' (లా మిసాస) అని, అంటూ ఉంటావు. మరియు నిశ్చయంగా, నీకు (వచ్చే జీవితంలో శిక్ష) నిర్ణయించబడి ఉంది, దాని నుండి నీవు తప్పించుకోలేవు. ఇక నీవు, భక్తుడవైన నీ ఆరాధ్యదైవాన్ని చూడు! మేము దానిని నిశ్చయంగా, కాల్చుతాము తరువాత దానిని భస్మం చేసి సముద్రంలో విసిరి వేస్తాము."[1]
[1] దీనితో విశదమయ్యేదేమిటంటే, షిర్క్ వైపుకు మరల్చే ప్రతిదానిని నాశనం చేయాలి. అది జిబ్రీల్ ('అ.స.) పాద గుర్తుల మట్టి అయినా సరే! దానిని ప్రసాదంగా భావించి ఆరాధిస్తే, అది కూడా షిర్కే.
(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము పూర్వం జరిగిన గాథలను నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవంగా మేము, మా తరఫు నుండి నీకు హితోపదేశాన్ని (ఈ ఖుర్ఆన్ ను) ప్రసాదించాము.
ఆ దినమున బాకా (సూర్) ఊదబడుతుంది.[1] మరియు మేము అపరాధులను ఒకచోట జమ చేస్తాము. ఆ రోజు వారి కళ్ళు (భయంతో) నీలమై పోతాయి.
[1] 'సూర్: అంటే ఖర్న్, బాకా. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో ఇస్రాఫీల్ ('అ.స.) దానిని ఊదుతారు. అప్పుడు పునరుత్థానం ఆవరిస్తుంది. (ముస్నద్ అ'హ్మద్, 2/191) దాదాపు ఇలాంటి 'హదీసే 'తిర్మిజీ'లో కూడా ఉంది. మొదటి శబ్దంతో అందరూ మరణిస్తారు. రెండవసారి బాకా ఊదగానే అందరూ తిరిగి సజీవులుగా లేచి వస్తారు.
ఆ రోజు అందరూ పిలిచేవానిని వెంబడిస్తారు, అతని నుండి తొలగిపోరు.[1] అనంత కరణామయుని ముందు వారి కంఠస్వరాలన్నీ అణిగిపోయి ఉంటాయి, కావున నీవు గొణుగులు తప్ప మరేమీ వినలేవు.
[1] ఆ పిలిచే వాని నుండి తప్పించుకొని అటూ ఇటూ పోకుండా అతని వెంటబడే పోతారు.
(ఎందుకంటే!) ఆయనకు - వారికి ప్రత్యక్షంగా నున్నది మరియు పరోక్షంగా నున్నది - అంతా తెలుసు, కాని వారు తమ జ్ఞానంతో ఆయనను గ్రహించజాలరు.[1]
[1] అల్లాహ్ (సు.తా.)కు ప్రతి ఒక్కరి విషయం తెలుసు, కాబట్టి ఎవరు ఎక్కువ సత్పురుషులో ఆయనకు బాగా తెలుసు. అల్లాహ్ (సు.తా.) తప్ప మరెవ్వరూ అది ఎరుగరు. కావున సిఫారసు చేసే అర్హత గల వానిని ఆయనే ఎన్నుకుంటాడు.
మరియు సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు (శాశ్వితుడు) అయిన ఆయన (అల్లాహ్) ముందు అందరి ముఖాలు నమ్రతతో వంగి ఉంటాయి. మరియు దుర్మార్గాన్ని అవలంబించినవాడు, నిశ్చయంగా, విఫలుడవుతాడు.[1]
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ప్రతివానికి అతని హక్కు చెల్లించండి. లేకుంటే పునరుత్థాన దినమున ఇవ్వవలసి ఉంటుంది.' మరొక 'హదీస్'లో ఉంది: 'దుర్మార్గం నుండి దూరంగా ఉండండి, షిర్క్ మహా దుర్మార్గం (''జుల్మె అ''జీమ్), అది క్షమించబడదు.' ('స. ముస్లిం).
మరియు ఈ విధంగా మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో క్రమక్రమంగా అవతరింపజేశాము. మరియు ఇందులో పలురకాల హెచ్చరికలు చేశాము. బహుశా వారు దైవభీతి కలిగి ఉంటారేమోనని; లేదా! వారు ఉపదేశం గ్రహిస్తారేమోనని.[1]
అల్లాహ్ అత్యున్నతుడు, సార్వభౌముడు,[1] పరమ సత్యుడు (ఓ ముహమ్మద్!) నీకు ఖుర్ఆన్ సందేశం (వహీ) పూర్తిగా అవతరింప జేయబడే వరకు దానిని గురించి తొందరపడకు. మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నా జ్ఞానాన్ని వృద్ధి పరచు!"[2]
మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఆదమ్ తో ఒక వాగ్దానం చేయించి ఉన్నాము, కాని అతడు దానిని మరచి పోయాడు మరియు మేము అతనిలో స్థిరత్వాన్ని చూడలేదు.[1]
[1] ఆ వాగ్దానం ఏమిటంటే ఒక ప్రత్యేక వృక్షపు దరిదాపులకు పోగూడదని, అంటే ఆ వృక్షపు ఫలాలు తినకూడదని. కాని షైతాన్ అతనిని ('అ.స.) మరియు అతని ('అ.స.) భార్యను తన వలలోకి తీసుకొని: 'ఆ వృక్షపు ఫలాలను తినటం వల్ల మీరు చిరంజీవులవుతారు.' అని చెప్పి, వారి చేత ఆ ఫలాన్ని తినిపించి, అల్లాహ్ (సు.తా.) తో చేసిన వాగ్దానాన్ని భంగం చేయించాడు.
అప్పుడు అన్నాము: "ఓ ఆదమ్! నిశ్చయంగా, ఇతడు నీకు మరియు నీ భార్యకు శత్రువు, కాబట్టి ఇతడిని, మీ ఇద్దరిని స్వర్గం నుండి వెడల గొట్టనివ్వకండి అలా అయితే మీరు దురవస్థకు గురి కాగలరు.[1]
[1] తష్ఖా: అంటే ప్రయాస, కష్టం, కఠినం. ఏమిటంటే, స్వర్గంలో మానవుని అత్యవసర వసతులు అంటే ఆహారపానీయాలు, వస్త్రాలు మరియు నివాసం అన్నీ కోరిన వెంటనే లభిస్తాయి. వాటి కొరకు కష్టపడే అవసరం వుండదు. కాని, ఇహలోకంలో వాటి కొరకు మానవుడు ప్రయాస పడుతూ వుంటాడు. అదే దీని అర్థం.
ఆ పిదప వారిద్దరు దాని నుండి (ఫలాన్ని) తినగానే వారిద్దరికి, వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది.[1] మరియు వారిద్దరు స్వర్గపు ఆకులను తమ మీద కప్పుకోసాగారు. (ఈ విధంగా) ఆదమ్ తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, సన్మార్గం నుండి తప్పి పోయాడు.
[1] వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది. చూడండి, 7:26-27.
(అల్లాహ్) అన్నాడు: "మీరిద్దరూ కలసి ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరి కొకరు శత్రువులై[1] ఉంటారు. కాని నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది, కావున నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వాడు, మార్గభ్రష్టుడూ కాడు మరియు దురవస్థకు గురికాడు.
[1] అంటే మానవుడు మరియు షై'తాను చూడండి, 7:24 మరియు 2:36.
మరియు ఈ విధంగా, మేము మితిమీరి ప్రవర్తిస్తూ, తన ప్రభువు సూచనలను విశ్వసించని వానికి ప్రతీకారం చేస్తాము. మరియు పరలోక శిక్ష ఎంతో కఠినమైనది మరియు శాశ్వతమైనది.
వీరికి పూర్వం గడిచిన ఎన్నో తరాలను మేము నాశనం చేసి ఉన్నాము. వీరు వారి నివాస స్థలాలలో తిరుగుతున్నారు. ఏమీ? దీని వలన కూడా వీరికి మార్గదర్శకత్వం లభించలేదా? నిశ్చయంగా, ఇందులో అర్థం చేసుకునే వారికి ఎన్నో సూచనలున్నాయి.
మరియు నీ ప్రభువు నుండి మొదట్లోనే ఒక గడువు కాలం నిర్ణయించబడి ఉండక పోతే, వీరికి ఈ పాటికే (శిక్ష) తప్పక విధించబడి ఉండేది. కాని (వీరి) గడువు కాలం నిర్ణయించబడి ఉంది.[1]
[1] అల్లాహ్ (సు.తా.) పాపం చేసేవారిని వెనువెంటనే శిక్షిస్తే ప్రపంచంలో ఒక్కడు కూడా శిక్షింపబడకుండా ఉండడు. ఇది అల్లాహ్ (సు.తా.) కు తెలుసు, కాబట్టి ఆయన (సు.తా.) ప్రతి ఒక్కరికి పశ్చాత్తాప పడటానికి గడువు ఇస్తాడు. ఇదే అల్లాహ్ (సు.తా.) విధానం (సాంప్రదాయం). ఇక ఆ సమయం వచ్చిన తరువాత ఆయన శిక్ష నుండి తప్పించేవారు ఎవ్వరూ ఉండరు. అందుకే నీవు సత్యతిరస్కారులను భోగభాగ్యాలతో విర్రవీగుతూ ఉండటాన్ని చూస్తున్నావు. చూడండి, 10:11, 16:61, 18:58.
కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు నీవు ఓర్పు వహించు. సూర్యుడు ఉదయించక ముందు మరియు అస్తమించక ముందు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయన స్తోత్రం చెయ్యి. మరియు రాత్రి సమయాలలో మరియు పగటి వేళలలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు.[1] అప్పుడు నీపు సంతుష్టుడవవు తావు!
మేము వారిలో చాలా మందికి - వాటితో వారిని పరీక్షించటానికి - వారు అనుభవించటానికి, ఇచ్చిన ఇహలోక జీవిత శోభను నీవు కళ్ళెత్తి చూడకు.[1] నీ ప్రభువు ఇచ్చే జీవనోపాధియే అత్యుత్తమమైనది మరియు చిరకాలముండేది.[2]
[1] ఇలాంటి సందేశానికి చూడండి, 3:196-197, 15:88 18:7 [2] ఒకసారి 'ఉమర్ (ర'ది.'అ.) దైవప్రవక్త ('స'అ) దగ్గరికి వచ్చారు. అతన ఒక చాప మీద పండుకొని ఉన్నది చూసి ఏడ్వసాగారు. అతని ఇంట్లో రెండు చర్మాల కంటే ఎక్కువ ఏమీ లేవు. దైవప్రవక్త ('స'అస) అతని ఏడ్పుకు కారణమడగగా, 'ఉమర్ (ర'ది.'అ) ఇలా జవాబిచ్చారు: 'ఖైసర్ మరియు కిస్రాలు ఎన్నో భోగభాగ్యాలలో మునిగి ఉన్నారు. మీరేమో అత్యుత్తమ సృష్టి అయి కూడా ఈ స్థితిలో ఉన్నారు.' దానికి దైవప్రవక్త ('స'అస) అన్నారు: " 'ఉమర్ (ర'ది.'అ) నీకు ఇంకా సందేహముందా? ఎవరికైతే కేవలం ఇహలోకంలోనే భోగభాగ్యాలు ఇవ్వబడ్డాయో వారే వీరు. వీరికి పరలోకంలో ఏమీ మిగలదు." ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం).
మరియు నీ కుటుంబం వారిని నమాజ్ చేయమని ఆజ్ఞాపించు; మరియు స్వయంగా నీవు కూడా దానిని సహనంతో పాటించు. మేము నీ నుండి జీవనోపాధిని ఆశించము. మేమే నీకు జీవనోపాధిని ఇచ్చే వారము. చివరకు దైవభీతి గలవారిదే ఉత్తమ ముగింపు.
మరియు వారంటారు: "ఇతను (ఈ ప్రవక్త) తన ప్రభువు నుండి ఏదైనా ఒక అద్భుత సూచన (మహిమ) ఎందుకు తీసుకురాడు?" ఏమీ? పూర్వపు గ్రంథాలలో పేర్కొనబడిన స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు రాలేదా?[1]
ఒకవేళ మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను / ముహమ్మద్ ను) పంపక ముందే వారిని శిక్షించి ఉంటే! వారు అనేవారు: "ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు? (అలా చేస్తే) నిశ్ఛయంగా, మేము - అవమానం పొంది, అగౌరవం పాలుకాక ముందే - నీ సూచనలను పాటించేవారం కదా?"[1]
[1] అల్లాహ్ (సు.తా.) ఎవరిని కూడా అజ్ఞానంతో చేసే తప్పుల కొరకు - వారికి మార్గదర్శకత్వం చూపనంతవరకు - శిక్షించడు. అంటే సన్మార్గాన్ని చూసిన తరువాత కూడా దాన్ని తిరస్కరించి మార్గభ్రష్టులైన వారిని శిక్షిస్తాడు. ఇంకా చూడండి, 6:131, 15:4 మరియు 26:208-209.
వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు (తన అంతిమ ఫలితం కొరకు వేచి ఉన్నాడు. కావున మీరు కూడా వేచి ఉండండి. సరైన మార్గంలో ఉన్న వారెవరో మరియు మార్గదర్శకత్వం పొందిన వారెవరో మీరు త్వరలోనే తెలుసుకుంటారు."
Contents of the translations can be downloaded and re-published, with the following terms and conditions:
1. No modification, addition, or deletion of the content.
2. Clearly referring to the publisher and the source (QuranEnc.com).
3. Mentioning the version number when re-publishing the translation.
4. Keeping the transcript information inside the document.
5. Notifying the source (QuranEnc.com) of any note on the translation.
6. Updating the translation according to the latest version issued from the source (QuranEnc.com).
7. Inappropriate advertisements must not be included when displaying translations of the meanings of the Noble Quran.
លទ្ធផលស្វែងរក:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".