(ఓ ప్రవక్తా!) వారు నిన్ను విజయధనం (అన్ ఫాల్) ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: "విజయధనం అల్లాహ్ ది మరియు ఆయన సందేశహరునిది." కనుక మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీ పరస్పర సంబంధాలను సరిదిద్దుకోండి. మీరు విశ్వాసులే అయితే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి.
నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన సూచనలు (ఖుర్ఆన్) పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికమే అవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీదే దృఢనమ్మకం కలిగి ఉంటారు.
(ఓ ప్రవక్తా!) ఎప్పుడైతే! నీ ప్రభువు నిన్ను సత్యస్థాపన కొరకు నీ గృహం నుండి (యుద్ధానికి) బయటకు తీసుకొని వచ్చాడో! అప్పుడు నిశ్చయంగా, విశ్వాసులలో ఒక పక్షం వారు దానికి ఇష్టపడలేదు;
సత్యం బహిర్గతమైన తరువాత కూడా, వారు దానిని గురించి నీతో వాదులాడుతున్నారు. అప్పుడు (వారి స్థితి) వారు చావును కళ్ళారా చూస్తూ ఉండగా! దాని వైపునకు లాగబడే వారి వలే ఉంది.
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఆ రెండు పక్షాలలో, ఒక పక్షం మీ చేతికి తప్పక చిక్కుతుందని అల్లాహ్ మీతో వాగ్దానం చేసినప్పుడు; ఆయుధాలు లేని పక్షం మీకు దొరకాలని మీరు కోరుతూ ఉన్నారు. కాని అల్లాహ్ తాను ఇచ్చిన మాట ప్రకారం సత్యాన్ని సత్యంగా నిరూపించాలనీ మరియు అవిశ్వాసులను సమూలంగా నాశనం చేయాలనీ కోరాడు.
అపరాధులు ఎంత అసహ్యించుకున్నా, సత్యాన్ని సత్యంగా నిరూపించాలని (నెగ్గించాలని) మరియు అసత్యాన్ని అసత్యంగా నిరూపించాలని (విఫలం చేయాలని) ఆయన (ఇచ్ఛ).[1]
[1] ముస్లింలు, మక్కా ముష్రికుల సైన్యంతో పోరాడి, వారిని ఓడించి, వారి హృదయాలలో భయభీతులు కలిగించాలని మరియు ముస్లింలకు ధైర్యస్థైర్యాలు ప్రసాదించాలని అల్లాహుతా'ఆలా కోరిక.
(జ్ఞాపకం చేసుకోండి!) మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించినపుడు ఆయన ఇలా జవాబిచ్చాడు: "నిశ్చయంగా, నేను వేయి దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని పంపి మిమ్మల్ని బలపరుస్తాను."[1]
[1] చూడండి, 3:124-125 అక్కడ ఉ'హుద్ యుద్ధంలో అల్లాహ్ (సు.తా.) 3000 దైవదూతలను పంపి సహాయపడ్డాడు, అని ఉంది.
మరియు మీకు శుభవార్తనిచ్చి, మీ హృదయాలకు శాంతి కలుగ జేయటానికే, ఈ విషయాన్ని అల్లాహ్ మీకు తెలిపాడు. మరియు వాస్తవానికి సహాయం (విజయం) కేవలం అల్లాహ్ నుంచే వస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.[1]
[1] ము'హమ్మద్ ('స'అస) ఇలా ప్రార్థించారు: "ఓ అల్లాహ్ (సు.తా.)! నీవు నాకు చేసిన వాగ్దానం పూర్తి చేయి. ఓ అల్లాహ్ (సు.తా.)! ఒకవేళ ఈనాడు నీకు విధేయు(ముస్లిం)లు అయిన ఈ చిన్న సమూహం, నిర్మూలించబడితే! నిన్ను ప్రార్థించేవారు భూమిలో ఎవ్వరూ ఉండరు!" ('స. బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం, తిర్మిజీ', అబూ-దావూద్, అ'హ్మద్ మరియు ఇబ్నె'హంబల్).
(జ్ఞాపకం చేసుకోండి!) ఆయన (అల్లాహ్), తన తరఫు నుండి మీకు మనశ్శాంతి కలుగజేయటానికి మీకు నిద్రమత్తును కలిగించాడు మరియు మీపై ఆకాశం నుండి నీటిని కురిపించాడు, దాని ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచటానికి మీ నుండి షైతాన్ మాలిన్యాన్ని దూరం చేయటానికి మరియు మీ హృదయాలను బలపరచటానికి మరియు మీ పాదాలను స్థిరపరచటానికీ!
నీ ప్రభువు దైవదూతలకు ఇచ్చిన దివ్యజ్ఞానాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను నిశ్చయంగా, మీతో ఉన్నాను. కావున మీరు విశ్వాసులకు ఈ విధంగా ధైర్యస్థైర్యాలను కలిగించండి: 'నేను సత్యతిరస్కారులైన వారి హృదయాలలో భయాన్ని కలిగిస్తాను, అప్పుడు మీరు వారి మెడలపై కొట్టండి మరియు వారి వ్రేళ్ళకొనలను నరికివేయండి.' "
ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. కాబట్టి ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తాడో! నిశ్చయంగా, అల్లాహ్ (అలాంటి వానికి) శిక్ష విధించటంలో ఎంతో కఠినుడు.
మరియు ఆ దినమున వారికి వీపు చూపినవాడు - యుద్ధతంత్రం కోసమో, లేక (తమవారి) మరొక సమూహంలో చేరటానికో (వెనుదిరిగితే తప్ప) - తప్పక అల్లాహ్ ఆగ్రహానికి పాత్రుడవుతాడు మరియు అతని ఆశ్రయం నరకమే. అది ఎంత చెడ్డ గమ్యస్థానం!
మీరు వారిని చంపలేదు, కానీ అల్లాహ్ వారిని చంపాడు. (ప్రవక్తా!) నీవు (దుమ్ము) విసిరినపుడు, నీవు కాదు విసిరింది,[1] కాని అల్లాహ్ విసిరాడు. మరియు విశ్వాసులను దీనితో పరీక్షించి, వారికి మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఆయన ఇలా చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
[1] బద్ర్ యుద్ధ రంగంలో దైవప్రవక్త ('స'అస) పిడికెడు దుమ్ము, అల్లాహ్ (సు.తా.) పేరుతో సత్యతిరస్కారులపై విసిరారు.
(ఓ అవిశ్వాసులారా!) మీరు తీర్పు కోరితే, వాస్తవానికి మీకు తీర్పు లభించింది. ఇక మీద మీరు (దుర్మార్గాన్ని) మానుకుంటే అది మీకే మేలైనది. ఒకవేళ మీరు తిరిగి ఇలా చేస్తే మేము కూడా తిరిగి చేస్తాము. అప్పుడు మీ సైనికదళం ఎంత హెచ్చుగా ఉన్నా మీకెలాంటి లాభం చేకూర్చదు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసులతో ఉంటాడు.
మరియు అల్లాహ్ వారిలో కొంతైనా మంచితనాన్ని చూసి ఉంటే, వారిని వినేటట్లు చేసి ఉండేవాడు. (కాని వారిలో మంచితనం లేదు కాబట్టి), ఆయన వారిని వినేటట్లు చేసినా, వారు (తమ మూర్ఖత్వంలో) ముఖాలు త్రిప్పుకొని వెనుదిరిగి పోయేవారు.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీకు జీవనమిచ్చే దాని వైపునకు, మిమ్మల్ని పిలిచినప్పుడు దానికి జవాబు ఇవ్వండి.[1] మరియు నిశ్చయంగా, అల్లాహ్ మానవునికి మరియు అతని హృదయకాంక్షలకు మధ్య ఉన్నాడనీ మరియు నిశ్చయంగా, మీరంతా ఆయన వద్దనే సమీకరించబడతారని తెలుసుకోండి.
[1] అంటే ఖుర్ఆన్ మరియు షరీ'అత్ వైపుకు మరియి జిహాద్ కు. అంటే కేవలం అల్లాహ్ (సు.తా.) మరియు ఆయన ప్రవక్త ('స'అస) ఆజ్ఞలనే అనుసరించండి, అని అర్థం.
మరియు మీలోని దుర్మార్గులకు మాత్రమే గాక (అందరికీ) సంభవించబోయే ఆ విపత్తు గురించి భీతిపరులై ఉండండి. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడని తెలుసుకోండి.
మరియు ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి: అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉన్నారు. భూమిపై మీరు బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని పారద్రోలుతారని (హింసిస్తారని) భయపడే వారు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయమిచ్చి తన సహాయంతో మిమ్మల్ని బలపరచి, మీకు మంచి జీవనోపాధిని సమకూర్చాడు, బహుశా మీరు కృతజ్ఞులవుతారని.
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీకు (మంచి-చెడులను గుర్తించే) విచక్షణా శక్తిని ప్రసాదించి, మీ నుండి మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు.
మరియు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారులు, నిన్ను బంధించటానికి నిన్ను హతమార్చటానికి, లేదా నిన్ను వెడలగొట్టటానికి కుట్రలు పన్నుతున్న విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకో!) వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు మరియు అల్లాహ్ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే కుట్రలు పన్నటంలో అందరి కంటే ఉత్తముడు.[1]
[1] ఇది మక్కా ముష్రిక్ లు దారున్నద్వాలో ము'హమ్మద్ ('స'అస)ను హత్య చేయటానికి; ప్రతి తెగ నుండి ఒక యువకుణ్ణి తయారుచేసిన కుట్ర. వారంతా దైవప్రవక్త ('స'అస), ఇంటి చుట్టు రాత్రివేళ గుమిగూడి, అతని రాకకు ఎదురు చూస్తూ ఉంటారు. అల్లాహ్ (సు.తా.), ఈ విషయం దైవప్రవక్త ('స'అస)కు తెలుపుతాడు. మరియు అతను ('స'అస) పిడికెడు దుమ్ము తీసుకొని, అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించి వారిపై చల్లుతారు. దానితో వారు అతని వెళ్ళిపోవటాన్ని గమనించలేకపోతారు. అతను ('స'అస) అబూబక్ర్ (ర'ది.'అ.) తో సహా 'గారె సూ'ర్ లో చేరుకుంటారు.
మరియు మా సూచనలు (ఆయాత్) వారికి వినిపించబడి నప్పుడు వారు: "వాస్తవానికి, మేము విన్నాము మేము కోరితే మేము కూడా ఇటువంటివి రచించగలము (చెప్పగలము). ఇవి కేవలం పూర్వీకుల గాథలు మాత్రమే!" అని అంటారు.
మరియు వారు: "ఓ అల్లాహ్! ఇది (ఈ ఖుర్ఆన్) నిజంగా నీ తరపు నుండి వచ్చిన సత్యమే అయితే! మాపై ఆకాశం నుండి రాళ్ళ వర్షం కురిపించు! లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మా పైకి తీసుకొనిరా!" అని పలికిన మాట (జ్ఞాపకం చేసుకోండి).
కాని (ఓ ముహమ్మద్!) నీవు వారి మధ్య ఉన్నంత వరకు అల్లాహ్ వారిని ఏ మాత్రం శిక్షించడు. మరియు వారు క్షమాభిక్ష కోరుతూ ఉన్నంత వరకు కూడా! అల్లాహ్ వారిని ఏ మాత్రం శిక్షించడు.
వారి వాదమేమిటీ? అల్లాహ్ వారిని ఎందుకు శిక్షించకూడదు? వారు దాని ధర్మకర్తలు కాకున్నా, వారు ప్రజలను మస్జిద్ అల్ హరామ్ నుండి ఆవుతున్నారు.[1] దాని ధర్మకర్తలు కేవలం దేవభీతి గలవారే కాగలరు. కాని వాస్తవానికి, చాలా మంది ఇది తెలుసుకోలేరు.
[1] ముష్రిక్ ఖురైషులు, ముస్లింలు అయిన వారిని క'అబహ్ లోకి ప్రవేశించకుండా ఆపేవారు.
మరియు (అల్లాహ్) గృహం (కఅబహ్) వద్ద వారి ప్రార్థనలు, కేవలం ఈలలు వేయటం (ముకాఅ) మరియు చప్పట్లు కొట్టడం (తస్దియహ్) తప్ప మరేమీ లేవు. కావున మీ సత్యతిరస్కారానికి బదులుగా ఈ శిక్షను రుచి చూడండి.[1]
[1] ఇదే విధంగా ఈ కాలంలో కూడా మూఢులైన 'సూఫీలు, మస్జిద్ లలో మరియు ఆస్థానాలలో డోలు కొట్టుతూ నాట్యం చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ విధంగానే మేము అల్లాహుతా'ఆలాను సంతోషపరుస్తాము, అని అంటారు. అల్లాహ్ (సు.తా.) విశ్వాసులను ఇలాంటి విషయాల నుండి కాపాడుగాక!
నిశ్చయంగా, సత్యతిరస్కారులు, ప్రజలను అల్లాహ్ మార్గం వైపునకు రాకుండా ఆపటానికి, తమ ధనం ఖర్చు చేస్తారు. వారు ఇలాగే ఖర్చు చేస్తూ ఉంటారు; చివరకు అది వారి వ్యసనానికి (దుఃఖానికి) కారణమవుతుంది. తరువాత వారు పరాధీనులవుతారు. మరియు సత్యతిరస్కారులైన వారు నరకం వైపుకు సమీకరించబడతారు.
ఇదంతా అల్లాహ్, చెడును (దుష్టులను) మంచి (సత్పురుషుల) నుండి వేరు చేసి, దుష్టులందరినీ ఒకరితో పాటు మరొకరిని చేకూర్చి, ఒక గుంపుగా చేసి వారందరినీ నరకంలో పడవేయటానికి. ఇలాంటి వారు, వారే నష్టపోయేవారు!
సత్యతిరస్కారులతో ఇలా అను: ఒకవేళ వారు మానుకుంటే గడిచిపోయింది క్షమించబడుతుంది. కాని వారు (పూర్వ వైఖరినే) మళ్ళీ అవలంబిస్తే! వాస్తవానికి, (దుష్టులైన) పూర్వీకుల విషయంలో జరిగిందే, మరల వారికి సంభవిస్తుంది![1]
[1] అంటే వారు సత్యతిరస్కారం మరియు దుష్ట కర్మలలో మునిగి ఉంటే, వారిపై అల్లాహుతా'ఆలా శిక్ష తప్పక పడుతుందని తెలుసుకోవాలి.
మరియు అధర్మం (ఫిత్న)[1] ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు మరియు ఆరాధన (ధర్మం) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడనంత వరకు వారితో (సత్యతిరస్కారులతో) పోరాడుతూ ఉండండి. కాని వారు (పోరాడటం) మానుకుంటే! నిశ్చయంగా అల్లాహ్ వారి కర్మలను గమనిస్తున్నాడు.
[1] ఫిత్నతున్: అంటే ఇక్కడ సత్యతిరస్కారం మరియు అధర్మం అని అర్థం. చూడండి,2:193. ఈ విధమైన ఆయతే అక్కడ కూడా ఉంది. ఇంకా చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 24 మరియు పుస్తకం - 3, 'హదీస్' నం. 425.
మరియు మీ విజయధనంలో[1] నిశ్చయంగా, అయిదవ భాగం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు మరియు (అతని) దగ్గరి బంధువులకు మరియు అనాధులకు మరియు యాచించని పేదవారికి[2] మరియు ప్రయాణీకులకు ఉందని తెలుసుకోండి, ఒకవేళ మీరు - అల్లాహ్ ను మరియు మేము సత్యాసత్యాల అంతరాన్ని విశదం చేసే దినమున, ఆ రెండు సైన్యాలు మార్కొనిన (బద్ర్ యుద్ధ) దినమున, మా దాసునిపై అవతరింపజేసిన దానిని - విశ్వసించేవారే అయితే! మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.[3]
[1] 'గనీమతున్: విజయధనం, అంటే సత్యతిరస్కారులతో జరిగిన ధర్మయుద్ధంలో గెలుపు పొందిన తరువాత ముస్లింలకు దొరికేదంతా. [2] ఇక్కడ అల్-మిస్కీనున్, అనే శబ్దం ఉంది. ఇది అల్ ఫుఖరా కంటే భిన్నమైనది. ఫఖీరున్ - అంటే ఏమీ లేనందుకు ఇతరుల నుండి యాచించే వాడు. మిస్కీన్ అంటే అతని దగ్గర కొంత ఆదాయం ఉంది, కాని అది అతని నిత్యావసరాలకు పూర్తి కాదు. ఇట్టివారు తమ స్వాభిమానం వల్ల ఇతరులను సహాయానికై యాచించారు. [3] బద్ర్ యుద్ధం - యుద్ధ సామగ్రి తక్కువ తీసుకొని కేవలం వాణిజ్య బిడారాన్ని దోచుకోవటానికి వచ్చిన 313 ముస్లింలు మరియు వారిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో! అత్యధిక యుద్ధసామగ్రితో వచ్చిన ముష్రిక్ ఖురైషుల మధ్య జరిగింది. అల్లాహ్ (సు.తా.) తాను పంపిన ప్రవక్త ము'హమ్మద్ ('స'అస) సత్యవంతుడు, సన్మార్గంపై ఉన్నాడు మరియు తాను పంపిన, జీవన మార్గమే (ఇస్లామే), మోక్షం (స్వర్గం) పొందటానికి సరైన మార్గమని నిరూపించదలచి, ఈ యుద్ధాన్ని చేయించి, ముస్లింలకు విజయాన్ని చేకూర్చి, సత్యాసత్యాల మధ్య భేదాన్ని నిరూపించాడు. చివరకు సత్యమే వర్ధిల్లుతుందని చూపాడు.
(ఆ దినాన్ని గుర్తుకు తెచ్చుకోండి!) అప్పుడు మీరు లోయలో (మదీనాకు) సమీపంగా ఉన్న స్థలంలో ఉన్నారు మరియు వారు (ముష్రికులు) దూరంగా ఉన్న స్థలంలో ఉన్నారు.[1] మరియు బిడారం మీకు క్రింది (ఒడ్డు) వైపునకు. ఒకవేళ మీరు (ఇరువురు) యుద్ధం చేయాలని నిర్ణయించుకొని ఉంటే! మీరు మీ నిర్ణయాన్ని పాటించకుండా ఉండేవారు. కాని అల్లాహ్ తాను నిర్ణయించిన కార్యాన్ని పూర్తి చేయటానికి, నశించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత నశించాలని మరియు జీవించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత జీవించాలని అలా చేశాడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
[1] 'ఉద్ వతిద్దునియా: సమీప స్థలం. అంటే బద్ర్ లోయలో, మదీనా నుండి సమీపంలో నున్న స్థలం. మరియు 'ఉద్వతిల్ ఖు'స్ వా: అంటే, బద్ర్ లోయలో, మొదటి స్థలంతో పోల్చితే మదీనా నుండి దూరంగా ఉన్న స్థలం.
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు, నీ స్వప్నంలో వారిని కొద్దిమందిగా చూపింది (జ్ఞాపకం చేసుకో)! వారిని ఎక్కువ మందిగా నీకు చూపి ఉంటే, మీరు తప్పక ధైర్యాన్ని కోల్పోయి (యుద్ధ) విషయంలో వాదులాడే వారు. కాని వాస్తవానికి, అల్లాహ్ మిమ్మల్ని రక్షించాడు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు.
మరియు (జ్ఞాపకం చేసుకోండి) అల్లాహ్ నెరవేర్చవలసిన పనిని నెరవేర్చటానికి - మీరు (బద్ర్ యుద్ధరంగంలో) మార్కొనినపుడు - వారి (అవిశ్వాసుల) సైన్యాన్ని మీ కన్నులకు కొద్దిగా చూపాడు మరియు మిమ్మల్ని కొద్దిమందిగా వారికి చూపాడు. మరియు అన్ని వ్యవహారాలూ (నిర్ణయానికి) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి.
మరియు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి మరియు పరస్పర కలహాలకు గురి కాకండి, అట్లు చేస్తే మీరు బలహీనులవుతారు మరియు మీ బలసాహసాలు తగ్గిపోతాయి. మరియు సహనం వహించండి నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించే వారితో ఉంటాడు.
మరియు తమ గృహాల నుండి, ప్రజలకు చూపటానికి దురాభిమానంతో బయలుదేరి ఇతరులను అల్లాహ్ మార్గం నుండి ఆపేవారి వలే కాకండి. మరియు వారు చేసే క్రియలన్నింటినీ అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు.
మరియు (జ్ఞాపకం చేసుకోండి అవిశ్వాసులకు) వారి కర్మలు ఉత్తమమైనవిగా చూపించి షైతాన్ వారితో అన్నాడు: "ఈ రోజు ప్రజలలో ఎవ్వడునూ మిమ్మల్ని జయించలేడు, (ఎందుకంటే) నేను మీకు తోడుగా ఉన్నాను." కాని ఆ రెండు పక్షాలు పరస్పరం ఎదురు పడినపుడు, అతడు తన మడమలపై వెనకకు మరలి అన్నాడు: " వాస్తవంగా, నాకు మీతో ఎలాంటి సంబంధం లేదు, మీరు చూడనిది నేను చూస్తున్నాను. నిశ్చయంగా, నేను అల్లాహ్ కు భయపడుతున్నాను.[1] మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు."
కపట విశ్వాసులు మరియు ఎవరి హృదయాలలో రోగముందో వారు: "వీరిని (ఈ విశ్వాసులను) వీరి ధర్మం మోసపుచ్చింది." అని అంటారు, కాని అల్లాహ్ యందు నమ్మకం గలవాని కొరకు, నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు.
మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: "భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి.[1]
ఫిర్ఔన్ జాతి వారి మరియు వారికి పూర్వం వారి మాదిరిగా, వీరు కూడా అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారి పాపాల ఫలితంగా వారిని శిక్షించాడు. నిశ్చయంగా అల్లాహ్ మహా బలవంతుడు, శిక్ష విధించటంలో చాలా కఠినుడు.[1]
[1] షదీద్ అల్ - 'ఇఖాబ్: Severe in Chastising కఠినంగా శిక్షించేవాడు, పటిష్టంగా పట్టుకునేవాడు.
ఇది ఎందుకంటే! వాస్తవానికి, ఒక జాతి వారు, తమ నడవడికను తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారికి ప్రసాదించిన తన అనుగ్రహాన్ని ఉపసంహరించుకోడు.[1] మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
ఫిర్ఔన్ జాతివారు మరియు వారికి పూర్వం వారి మాదిరిగా! వీరు కూడా తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలను నిరాకరించారు. కాబట్టి వారి పాపాలకు ఫలితంగా వారిని నాశనం చేశాము. మరియు ఫిర్ఔను జాతి వారిని ముంచి వేశాము. మరియు వారందరూ దుర్మార్గులు.[1]
[1] అల్లాహ్ (సు.తా.) ఎవరికీ అన్యాయం చేయడు. చూడండి, 41:46.
వారిలో ఎవరితోనైతే నీవు ఒడంబడిక చేసుకున్నావో! వారు ప్రతిసారీ తమ ఒడంబడికను భంగపరుస్తున్నారు. మరియు వారికి దైవభీతి లేదు.[1]
[1] కొందరు వ్యాఖ్యాతలు, వీరు బనూ-ఖురై"జహ్ అనే యూద తెగవారు అని అంటారు. కందక యుద్ధకాలంలో వీరు సత్యతిరస్కారులకు సహాయపడమని దైవప్రవక్త ('స'అస)తో ఒడంబడిక చేసుకుంటారు. కాని వారు తమ ఒడంబడికకు కట్టుబడి ఉండరు. దీని మరొక భావం ఏమిటంటే ముస్లింలు, ఇతర ధర్మాల వారితో ఒప్పందాలు చేసుకొని వారితో శాంతియుతంగా నివసించడం, ధర్మ సమ్మతం మరియు యుక్తమైనది కూడాను. కాని వారు బహిరంగంగా విశ్వాసఘాతానికి పూనుకుంటే వారితో పోరాడాలి.
మరియు ఒకవేళ నీకు ఏ జాతి వారి వల్లనైనా నమ్మకద్రోహం జరుగుతుందనే భయం ఉంటే - మీరు ఇరుపక్షం వారు సరిసమానులని తెలుపటానికి[1] - (వారి ఒప్పందాన్ని) వారి వైపుకు విసరివేయి. నిశ్చయంగా, అల్లాహ్ నమ్మకద్రోహులంటే ఇష్టపడడు.
[1] 'అలా సవాఇన్: అంటే సరిసమానులని తెలుపటానికి. అంటే మీరు ఒడంబడికను త్రెంపి నందుకు మేము కూడా ఆ ఒడంబడికను త్రెంపుతున్నాము. ఇక మీదట ప్రతి ఒక్కరు తమ రక్షణకు తామే బాధ్యులని, స్పష్టం చేయటం.
మరియు మీరు మీ శక్తి మేరకు బలసామగ్రిని, యుద్ధపు గుర్రాలను సిద్ధపరచుకొని, దాని ద్వారా అల్లాహ్ కు శత్రువులైన మీ శత్రువులను మరియు అల్లాహ్ కు తెలిసి, మీకు తెలియని ఇతరులను కూడా భయకంపితులుగా చేయండి. మరియు అల్లాహ్ మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ఫలితం మీకు పూర్తిగా చెల్లించ బడుతుంది. మరియు మీకెలాంటి అన్యాయం జరగదు.
మరియు ఆయనే వారి (విశ్వాసుల) హృదయాలను కలిపాడు. ఒకవేళ నీవు భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చు చేసినా, వారి హృదయాలను కలుపజాలవు. కాని అల్లాహ్ యే వారి మధ్య ప్రేమను కలిగించాడు.[1] నిశ్చయంగా, ఆయన సర్వ శక్తిసంపన్నుడు, మహా వివేచనాపరుడు.
[1] చూడండి, 3:103. 'హునైన్ విజయధనం పంచేటప్పుడు ము'హమ్మద్ ('స'అస) మదీనా అన్సార్ లను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి చూడండి, ('స'హీ'హ్ బు.'ఖారీ, కితాబ్ అల్ మ'గా'జీ, బాబ్ 'గ'జ్ వత్ అ'త్తాయ'ఫ్, 'స.ముస్లిం కితాబ్ అ'జ్జకాత్, బాబ్ ఇ'అతా' అల్ - ముఅ'ల్లఫత్ ఖులూబుహుమ్ 'అలా అల్-ఇస్లాం).
ఓ ప్రవక్తా! విశ్వాసులను యుద్ధానికి ప్రోత్సహించు. మీలో ఇరవై మంది స్థైర్యం గల వారుంటే, వారు రెండు వందల మందిని జయించగలరు. మరియు మీరు వంద మంది ఉంటే వేయి మంది సత్యతిరస్కారులను జయించగలరు. ఎందుకంటే వారు (సత్యాన్ని) గ్రహించలేని జాతికి చెందిన వారు.[1]
ఇప్పుడు అల్లాహ్ మీ భారాన్ని తగ్గించాడు, ఎందుకంటే వాస్తవానికి, మీలో బలహీనత ఉన్నదని ఆయనకు తెలుసు. కాబట్టి మీలో వందమంది స్థైర్యం గలవారు ఉంటే వారు రెండు వందల మందిని జయించగలరు. మరియు మీరు వేయి మంది ఉంటే, అల్లాహ్ సెలవుతో రెండు వేల మందిని జయించగలరు. మరియు అల్లాహ్ సహనం గలవారితో ఉంటాడు.
(శత్రువులతో తీవ్రంగా పోరాడి, వారిని) పూర్తిగా అణచనంత వరకు, తన వద్ద యుద్ధఖైదీలను ఉంచుకోవటం ధరణిలో, ఏ ప్రవక్తకూ తగదు.[1] మీరు ప్రాపంచిక సామగ్రి కోరుతున్నారు. కాని అల్లాహ్ (మీ కొరకు) పరలోక (సుఖాన్ని) కోరుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.
[1] చూడండి, 47:4. ఈ ఆయత్ సారాంశం ఏమిటంటే: ఎంత వరకైతే శత్రువులను హతమార్చి, వారిపై పూర్తిగా ప్రాబల్యాన్ని పొందరో, జయించరో! అంత వరకు, వారితో పోరాడి వారిని హతమార్చాలి, వారి యుద్ధం చేయగల శక్తిని పూర్తిగా అంతమొందించాలి. ఆ తరువాతనే వారి యుద్ధ ఖైదీలను విమోచనాధనం తీసుకొని విడిచే విషయం గురించి ఆలోచించాలి, లేనిచో అవకాశం దొరకగానే వారు మిమ్మల్ని, నిర్మూలించటానికి ప్రయత్నించవచ్చు!
ఒకవేళ అల్లాహ్ (ఫర్మానా) ముందే వ్రాయబడి ఉండకపోతే, మీరు తీసుకున్న దానికి (నిర్ణయానికి) మీకు ఘోరశిక్ష విధించబడి ఉండేది.[1]
[1] ఈ ఆయత్ 67వ ఆయత్ తరువాత అవతరింపజేయబడింది. 'వ్రాయబడిన మాట'ను గురించి వ్యాఖ్యాతలలో భేదాభిప్రాయాలున్నాయి. కొందరు ఇది విజయధనం అంటారు. అందుకే ఫిద్య తీసుకున్నా క్షమించబడ్డారు అంటారు. మరికొందరు బద్ర్ యుద్ధంలో పాల్గొన్నవారి 'పాపాలన్నీ క్షమించబడిన' విషయం అంటారు. మరికొందరు, దైవప్రవక్త వారి మధ్య ఉండటమే క్షమాపణకు కారణం అంటారు. బద్ర్ యుద్ధంలో ఖైదీలైన 70 మంది ముష్రిక్ ఖురైషులను విమోచనాధనం (ఫిద్య) తీసుకొని విడిచిన తరువాత ఈ ఆయత్ మరియు దీని మునుపటి మరియు దీని తరువాత ఆయత్ లు అవతరింపజేయబడ్డాయి. వివరాలకు చూడండి, ఫ'త్హ అల్ ఖదీర్.
కావున మీకు ధర్మసమ్మతంగా లభించిన ఉత్తమమైన విజయధనాన్ని అనుభవించండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
ఓ ప్రవక్తా! నీ ఆధీనంలో ఉన్న యుద్ధఖైదీలతో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీ హృదయాలలో మంచితనం చూస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్న దాని కంటే ఎంతో ఉత్తమమైన దానిని మీకు ప్రసాదించి ఉంటాడు. మరియు మిమ్మల్ని క్షమించి ఉంటాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."[1]
కాని ఒకవేళ వారు నీకు నమ్మక ద్రోహం చేయాలని తలచుకుంటే, వారు ఇంతకు పూర్వం అల్లాహ్ కు నమ్మకద్రోహం చేశారు, కావున వారిపై నీకు శక్తినిచ్చాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
నిశ్చయంగా, విశ్వసించి వలస పోయే వారూ మరియు తమ సంపద మరియు ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారూ,[1] వారికి ఆశ్రయమిచ్చేవారూ మరియు సహాయం చేసేవారూ,[2] అందరూ ఒకరికొకరు మిత్రులు.[3] మరియు ఎవరైతే విశ్వసించి వలస పోలేదో వారు, వలస పోనంత వరకు వారి మైత్రిత్వంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. కాని వారు ధర్మం విషయంలో మీతో సహాయం కోరితే, వారికి సహాయం చేయటం మీ కర్తవ్యం; కాని మీతో ఒడంబడిక ఉన్న జాతి వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా చూస్తున్నాడు.
[1] వీరు వలసపోయిన 'స'హాబీలు, మొదటి శ్రేణివారు. [2] వీరు మదీనా ముస్లింలు (అన్సారులు), రెండవ శ్రేణివారు. [3] మౌలా: అంటే మిత్రుడు, స్నేహితుడు, సమర్థుడు, సహాయకుడు, సహకారుడు, ఆశ్రయమిచ్చేవాడు, సన్నిహితుడు, సంరక్షకుడు, స్వామి, బంధువు, కార్యకర్త, వారసుడు.
మరియు సత్యతిరస్కారులు ఒకరికొకరు స్నేహితులు. కావున (ఓ విశ్వాసులారా!) మీరు కూడా అలా చేయక (విశ్వాసుల మధ్య పరస్పర మైత్రిత్వాన్ని పెంచక) పోతే, భూమిలో ఉపద్రవం మరియు కల్లోలం చెలరేగుతాయి.
మరియు ఎవరైతే విశ్వసించి వలస పోయి అల్లాహ్ మార్గంలో పోరాడారో వారూ మరియు ఎవరైతే వారికి ఆశ్రయమిచ్చి సహాయపడ్డారో వారూ; ఇలాంటి వారే నిజమైన విశ్వాసులు. వారికి వారి (పాపాల) క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి.
మరియు ఎవరైతే తరువాత విశ్వసించి మరియు వలస పోయి మరియు మీతో బాటు (అల్లాహ్ మార్గంలో) పోరాడారో, వారు కూడా మీ వారే! కాని అల్లాహ్ గ్రంథం ప్రకారం, రక్తసంబంధం గలవారు (వారసత్వ విషయంలో) ఒకరిపై నొకరు ఎక్కువ హక్కుదారులు.[1] నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
[1] విశ్వాసులు (ముస్లింలందరు) ఒకరికొకరు సహోదరులు, 49:10. కాని వారసత్వపు విషయంలో ముస్లిం బంధువులే ఒకరికొకరు వారసులవుతారు. ఒక ముస్లిం అవిశ్వాసికి గానీ, లేక ఒక అవిశ్వాసి ముస్లింనకు గానీ వారసులు కాలేరు.
Contents of the translations can be downloaded and re-published, with the following terms and conditions:
1. No modification, addition, or deletion of the content.
2. Clearly referring to the publisher and the source (QuranEnc.com).
3. Mentioning the version number when re-publishing the translation.
4. Keeping the transcript information inside the document.
5. Notifying the source (QuranEnc.com) of any note on the translation.
6. Updating the translation according to the latest version issued from the source (QuranEnc.com).
7. Inappropriate advertisements must not be included when displaying translations of the meanings of the Noble Quran.
លទ្ធផលស្វែងរក:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".