"ఏమీ? మానవులను హెచ్చరించటానికి మరియు విశ్వసించిన వారికి నిశ్చయంగా, తమ ప్రభువు వద్ద, వారు చేసి పంపిన మంచిపనులకు తగిన స్థానం ఉంది." అనే శుభవార్త వినిపించటానికి, మేము వారిలోని ఒక మనిషి (ముహమ్మద్) పై మా సందేశాన్ని అవతరింప జేయటం ప్రజలకు ఆశ్చర్యకమైన విషయంగా ఉందా?[1] (ఎందుకంటే) సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "నిశ్చయంగా ఇతను పచ్చి మాంత్రికుడు!"
నిశ్చయంగా మీ పోషకుడూ, ప్రభువూ అయిన అల్లాహ్, ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించి, తర్వాత తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు.[1] ఆయనే (సర్వసృష్టి) వ్యవహారాలను నడుపుతున్నాడు. ఆయన అనుమతి లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవ్వడూ లేడు.[2] ఆయనే అల్లాహ్! మీ పోషకుడు (ప్రభువు), కావున మీరు ఆయననే ఆరాధించండి. ఏమీ? మీరు హితోపదేశం స్వీకరించరా?
[1] చూడండి, 7:54. [2] అల్లాహ్ (సు.తా.) అనుమతి లేకుండా సిఫారసు చేయగలవారు ఎవ్వడూ లేడు. అల్లాహ్ (సు.తా.) వారి కొరకే సిఫారసు చేయటానికి అనుమతిస్తాడు. ఎవరికొరకైతే ఆయన (సు.తా.) ఇష్టపడతాడో; అంటే షిర్క్ చేయకుండా, విశ్వాసులై అల్లాహ్ విధులను పాటిస్తూ అనుకోకుండా పాపాలు చేసిన వారి కొరకు మాత్రమే. ముష్రికీన్ లు భావిచినట్లు: 'వారు ఆరాధించేవి, తమను అల్లాహ్ (సు.తా.) శిక్ష నుండి తప్పించటానికి, అల్లాహ్ (సు.తా.) వద్ద సిఫారసు చేస్తాయి.' అనే తప్పుడు ఊహలను ఈ ఆయత్ మరియు ఇలాంటి ఎన్నో ఆయతులు ఖండిస్తున్నాయి. షిర్క్ (అల్లాహుతా'ఆలాకు సాటి కల్పించడం) ఎన్నటికీ క్షమించబడని మహా పాపం. ముష్రికీన్ ల గమ్యస్థానం - వారెన్ని పుణ్యకార్యాలు చేసినా - నరకం మాత్రమే. చూడండి, 2:255, 19:87, 20:109, 21:28, 34:23, మరియు 53:26.
ఆయన వైపునకే మీరందరూ మరలి పోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నిశ్చయంగా, ఆయనే సృష్టిని మొదట సరిక్రొత్తగా ప్రారంభించాడు, మరల ఆయనే దానిని ఉనికిలోకి తెస్తాడు. ఇది విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి న్యాయమైన ప్రతిఫల మివ్వటానికి. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారికి - వారు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండినందుకు - త్రాగటానికి సలసల కాగే నీళ్ళు మరియు బాధాకరమైన శిక్ష ఉంటాయి.
ఆయనే, సూర్యుణ్ణి (ప్రకాశించే) దీపంగానూ మరియు చంద్రుణ్ణి వెలుగును (ప్రతిబింబింపజేసే) దాని గానూ చేసి, దానికి (పెరిగే - తరిగే) దశలు నియమించాడు,[1] దాని ద్వారా మీరు సంవత్సరాల మరియు (కాలపు) గణనను తెలుసుకోవాలని.[2] అల్లాహ్ ఇదంతా సత్యాధారంగా తప్ప సృష్టించలేదు. జ్ఞానం గల వారికి ఆయన తన సూచనలను (ఈ విధంగా) విశదీకరిస్తున్నాడు.
[1] సూర్యుని ప్రకాశం స్వంతమైనది, విధంగానైతే ద్వీపపు వెలుగో. చంద్రుని వెలుగు ప్రతిబింబింపజేయబడిన సూర్యుని వెలుగు. చంద్రునిలో తన స్వంత వెలుగు లేదు. [2] చంద్రునికి 28 దశలున్నాయి. వాటిలో చంద్రుడు చిన్న రేఖ నుండి పూర్ణిమ రోజు పూర్తి చంద్రునిగా 14 రోజులలో మారుతాడు. ఆ తరువాత తిరిగి తగ్గుతూ 14 పోజులలో చిన్న రేఖగా మారుతాడు. తరువాత ఒకటి రెండు రోజులు కానరాకుండా పోతాడు. మళ్ళీ చిన్న రేఖగా మొదలవుతాడు. ఈ విధంగా చంద్రుని దిశల వల్ల దినాల, నెలల మరియు సంవత్సరాల గణనలు తెలుస్తాయి.
నిశ్చయంగా, ఎవరైతే మమ్మల్ని కలుసుకోవటాన్ని ఆశించక, ఇహలోక జీవితంతోనే సంతసించి, దానితోనే తృప్తి చెందుతారో మరియు మా సూచన (ఆయాత్) లను గురించి నిర్లక్ష్యభావం కలిగి ఉంటారో!
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని వారి విశ్వాసఫలితంగా వారి ప్రభువు వారిని సన్మార్గం మీద నడిపిస్తాడు. వారి క్రింద పరమ సుఖాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో, సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.
అందులో వారి ప్రార్థన: "ఓ అల్లాహ్! నీవు సర్వలోపాలకు అతీతుడవు." అని మరియు వారి అభివందనం: "అస్సలాము అలైకుం (మీకు శాంతి కలుగు గాక)!" అని, మాత్రమే ఉంటాయి. మరియు వారు తమ ప్రార్థనలను: "సర్వస్తోత్రాలకు అర్హుడు సమస్తలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే!" అని ముగించుకుంటారు.
మరియు ప్రజలు తమ మేలు కొరకు తొందర పడినట్లు అల్లాహ్ వారిపై (వారి చేష్టలకు) కీడును పంపటంలో తొందర పడి ఉంటే, వారి వ్యవధి ఎప్పుడో పూర్తయి ఉండేది. అందువలన మేము, మమ్మల్ని కలుసుకునే నమ్మకంలేని వారిని, తమ తలబిరుసుతనంలో భ్రష్టులై తిరగటానికి వదలిపెడుతున్నాము.[1]
మరియు మానవునికి కష్టకాలం వచ్చినప్పుడు: అతడు పరుండినా, కూర్చుండినా లేక నిలుచుండినా, మమ్మల్ని ప్రార్థిస్తాడు. కాని మేము అతని ఆపదను తొలగించిన వెంటనే, అతడు తనకు కలిగిన కష్టానికి, ఎన్నడూ మమ్మల్ని ప్రార్థించనే లేదు, అన్నట్లు ప్రవర్తిస్తాడు. ఈ విధంగా మితిమీరి ప్రవర్తించే వారికి, వారి చేష్టలు ఆకర్షణీయమైనవిగా చూపబడతాయి.
మరియు వాస్తవంగా మీకు పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము,[1] ఎందుకంటే వారు దుర్మార్గపు వైఖరిని అవలంబించారు; మరియు వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చినా, వారు విశ్వసించలేదు. ఈ విధంగా మేము అపరాధులకు ప్రతీకారం చేస్తాము.
[1] చూడండి, 6:131-132. ఖర్ నున్: అంటే, ఒకే కాలానికి, లేక తరానికి చెందిన ప్రజలు.
మరియు మా స్పష్టమైన ఆయతులను వారికి చదివి వినిపించినప్పుడు - మమ్మల్ని కలుసుకునే నమ్మకం లేనివారు - అంటారు: "దీనికి బదులుగా మరొక ఖుర్ఆన్ తీసుకురా లేదా ఇందులో సవరణలు చెయ్యి." (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "ఇందులో నా అంతట నేను మార్పులు చేయటం నా పని కాదు. నా వద్దకు పంపబడే దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే నేను అనుసరిస్తాను. నిశ్చయంగా, నేను నా ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘిస్తే, ఆ గొప్ప దినమున శిక్ష పడుతుందని భయపడుతున్నాను!"
(ఇంకా ఇలా) అను: "ఒకవేళ అల్లాహ్ కోరితే, నేను దీనిని మీకు వినిపించి ఉండేవాడిని కాదు; మరియు ఆయన కూడా దీనిని మీకు తెలిపి ఉండేవాడు కాదు. వాస్తవంగా నేను దీనికి (ఈ గ్రంథ అవతరణకు) పూర్వం మీతో నా వయస్సులోని దీర్ఘకాలాన్ని గడిపాను కదా?[1] ఏమీ? మీరిది గ్రహించలేరా?"
[1] దైవప్రవక్తగా ఎన్నుకొనబడక ముందు ము'హమ్మద్ ('స'అస) 40 సంవత్సరాలు మక్కా వారితో నివసించారు. మరియు వారు అతనిని నమ్మకస్తునిగా (అల్-అమీన్) మరియు ఎన్నడూ అబద్ధమాడని వారి (అ'స్సాదిఖ్)గా సాక్ష్యమిచ్చేవారు. అతనికి ('స'అస) ఏ గురువు లేడు. అతను చదువటం వ్రాయటం ఎరుగరు. ఇది కూడా వారికి బాగా తెలుసు. అలాంటప్పుడు ఈ ఖుర్ఆన్ ఏదైతే ఎన్నో అద్భుత విషయాలను, విజ్ఞాన విషయాలను, నక్షత్రాల విషయాలను, ప్రాచీన ప్రవక్తల గాథలను వివరిస్తుందో, అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి గాక మరెవరి తరఫు నుండి రాగలదు. ఎందుకంటే ఇందులో వేయి కంటే ఎక్కువ విజ్ఞాన (Science) విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడిప్పుడే వైజ్ఞానికి ప్రయోగాల ద్వారా సత్యమని నిరూపించబడ్డాయి. ఇకా ఎన్నో నిరూపించబడనున్నాయి. ఇంకొక విశేషమేమిటంటే దివ్య ఖుర్ఆన్ లో సూచించబడిన వైజ్ఞానిక విషయాలలో ఇంత వరకు ఒక్కటి కూడా తప్పని నిరూపించబడలేదు. మరియు దివ్యఖుర్ఆన్ లో సూచించబడిన ఇంకా ఎన్నో వైజ్ఞానిక విషయాలను మానవుడు ఇంతవరకు కూడా అర్థం చేసుకోలేక పోయాడు. .
ఇక అబద్ధాన్ని కల్పించి, దానిని అల్లాహ్ కు ఆపాదించే వాడి కంటే, లేక ఆయన సూచన (ఆయాత్) లను అబద్ధాలని తిరస్కరించే వాడి కంటే, మహా దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, పాపులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు!
మరియు వారు అల్లాహ్ ను కాదని తమకు నష్టం గానీ, లాభం గానీ కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు: "వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు." వారినడుగు: "ఏమీ? ఆకాశాలలో గానీ, భూమిలో గానీ, అల్లాహ్ ఎరుగని విషయాన్ని, మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా?" ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే వాటి కంటే ఆయన అత్యున్నతుడు.[1]
[1] విశ్వంలో అల్లాహ్ (సు.తా.)కు తెలియనిది ఏదీ లేదు, అలాంటప్పుడు అల్లాహ్ (సు.తా.) కు తెలియని, ఈ సిఫారసుదారులను వీరు ఎక్కడి నుండి కల్పించి తెచ్చారు?
మరియు మానవులందరూ మొదట ఒకే సంఘంగా (ఒకే ధర్మం మీద) ఉండేవారు. కానీ, వారు తరువాత భిన్నాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు నీ ప్రభువు తరఫు నుండి ముందుగానే ఈ విషయం నిర్ణయించ బడకుండా ఉండి ఉన్నట్లయితే, వారి మధ్య ఉన్న ఈ విభేదాల తీర్పు ఎప్పుడో జరిగి వుండేది.[1]
[1] చూడండి, 2:213, 253. అల్లాహ్ (సు.తా.), పునరుత్థాన దినమున తీర్పు చేయాలనీ - మానవులకూ మరియు జిన్నాతులకూ - అంతవరకు వ్యవధినివ్వాలని నిర్ణయించి ఉండకపోతే! వీరి తీర్పుఅప్పటికప్పుడే జరిగి ఉండేది.
మరియు వారంటున్నారు: "అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా (అద్భుత) సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?" నీవిలా జవాబివ్వు: "నిశ్చయంగా అగోచర విషయ జ్ఞానం కేవలం అల్లాహ్ కే చెందుతుంది,[1] కావున వేచి ఉండండి! నిశ్చయంగా, నేను కూడా మీతో బాటు వేచి ఉంటాను."
మరియు మానవులకు ఆపద కలిగిన పిదప, మేము వారికి కారుణ్యం రుచి చూపిస్తే, వెంటనే వారు మా సూచనలకు విరుద్ధంగా ఎత్తుగడలు వేయటం ప్రారంభిస్తారు.[1] వారితో అను: "ఎత్తుగడలు వేయటంలో అల్లాహ్ అతి శీఘ్రుడు!" నిశ్చయంగా, మా దూతలు మీరు చేసే ఎత్తుగడలన్నింటినీ వ్రాస్తున్నారు.
[1] వీరు ఆయత్ లు 7, 11, 12, 15, 18 మరియు 20లలో పేర్కొనబడిన రెండు రకాల మానవులు.
ఆయన (అల్లాహ్) యే! మిమ్మల్ని భూమిలోను మరియు సముద్రంలోనూ ప్రయాణింప జేయగలవాడు. ఇక మీరు ఓడలలో ఉన్నప్పుడు: అవి వారితో సహా, అనుకూలమైన గాలి వీస్తూ ఉండగా పోతూ ఉంటాయి మరియు దానితో వారు ఆనందిస్తూ ఉంటారు. (అకస్మాత్తుగా) వారిపైకి తీవ్రమైన తుఫాను గాలి వస్తుంది మరియు ప్రతిదిక్కు నుండి వారి మీదికి పెద్ద పెద్ద అలలు వస్తాయి మరియు వారు వాటి వల్ల వారు నిశ్చయంగా, చుట్టుకోబడ్డామని భావించి, అల్లాహ్ ను వేడుకుంటారు. తమ ధర్మం (ప్రార్థన)లో కేవలం ఆయననే ప్రత్యేకించుకొని ఇలా ప్రార్థిస్తారు: "ఒకవేళ నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేము నిశ్చయంగా కృతజ్ఞతలు చూపేవారమై ఉంటాము!"[1]
[1] ఇక్రిమా బిన్ - అబూ జహల్ (ర'ది.'అ) మక్కా విజయం తరువాత మక్కాను విడిచి, ఒక నావలో కూర్చొని పోతూవుండగా, ఆ నావ తుఫానులో చిక్కుకుంటుంది. నావ నడిపించేవాడు: "ఇప్పుడు మమ్మల్ని రక్షించగలవాడు కేవలం ఆ ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) మాత్రమే! కావున మీరు ఆయనను ప్రార్థించండి." అని అంటాడు. అప్పుడు - ము'హమ్మద్ ('స'అస) అనే మాటలు నిజమేనని - ఇక్రిమా అర్థంచేసుకుంటాడు. "ఒకవేళ ఈ తుఫాను నుండి బ్రతికి బయటపడితే ఇస్లాం స్వీకరిస్తాను." అని అతడు నిర్ణయించుకుంటాడు. ఆ ఆపద దాటిన తరువాత అతడు దైవప్రవక్త ('స'అస) దగ్గరికి వచ్చి ఇస్లాం స్వీకరిస్తాడు. (సునన్ నసా'యీ, అబూ-దావూద్ నం. 2683, అల్బాని ప్రమాణీకం నం. 1723).
కాని, ఆయన వారిని కాపాడిన వెంటనే, వారు భూమిలో అన్యాయంగా దౌర్జన్యం చేయసాగుతారు.[1] ఓ మానవులారా! నిశ్చయంగా, మీ దౌర్జన్యాలు మీకే హాని కలిగిస్తాయి. ఇహలోక జీవితం తాత్కాలిక ఆనందమే. చివరకు మీకు మా వైపునకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు మేము, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నీ మీకు తెలియజేస్తాము.
[1] ఇదే మానవుడి కృతఘ్నతా బుద్ధి. ఇది ఈ సూరహ్ 12వ ఆయత్ లో మరియు ఖుర్ఆన్ లో ఇతర ఎన్నో చోట్లలో పేర్కొనబడింది.
వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితాన్ని ఇలా పోల్చవచ్చు: మేము ఆకాశం నుండి నీటిని కురిపించగా దాని నుండి భూమిలో మానవులకు మరియు పశువులకు తినటానికి, వివిధ రకాల చెట్లూ చేమలూ పెరుగుతాయి. అప్పుడు భూమి తన అలంకారంతో వర్ధిల్లుతూ ఉండగా, దాని యజమానులు నిశ్చయంగా, అది తమ వశంలో ఉందనుకుంటారు; అలాంటి సమయంలో అకస్మాత్తుగా రాత్రి పూటనో లేక పగటి పూటనో మా తీర్పు వస్తుంది. అప్పుడు మేము దానిని - నిన్నటి వరకు ఏమీ లేని - కోసివేసిన పంటపొలంగా మార్చివేస్తాము. ఈ విధంగా మేము మా సూచనలను ఆలోచించే ప్రజల కొరకు స్పష్టంగా వివరిస్తాము.
మంచిపనులు చేసిన వారికి, మంచి ఫలితం దొరుకుతుంది. మరియు ఇంకా ఎక్కువ లభిస్తుంది.[1] మరియు వారి ముఖాలు నల్లబడవు మరియు వారికి అవమానమూ జరుగదు. అలాంటి వారు స్వర్గవాసులు. వారందు శాశ్వతంగా ఉంటారు.
మరియు పాపకార్యాలు చేసిన వారికి, వారి పాపాలకు తగినట్టి ప్రతిఫలం లభిస్తుంది మరియు వారిని అవమానం క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని రక్షించేవాడెవ్వడూ ఉండడు. వారి ముఖాలు చీకటి రాత్రి యొక్క నల్లని తెరల వంటి వాటితో కప్పబడి ఉంటాయి.[1] అలాంటి వారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
మరియు మేము వారందరినీ సమావేశపరచిన రోజు,[1] సాటి కల్పించిన (షిర్కు చేసిన) వారితో ఇలా అంటాము: "మీరునూ మరియు మీరు అల్లాహ్ కు సాటి కల్పించిన వారునూ, మీ స్థానాలలోనే ఆగండి!" ఆ పిదప మేము వారిని వేరు చేస్తాము.[2] వారు అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించినవారు (వారి దైవాలు) ఇలా అంటారు: "మీరు ఆరాధిస్తూ ఉండేది మమ్మల్ని కాదు;[3]
ఇక మీకూ మరియు మాకూ మధ్య అల్లాహ్ సాక్ష్యం చాలు. నిశ్చయంగా, మీరు (చేస్తూ వున్న) ఆరాధన గురించి మాకు ఏ మాత్రం తెలియదు!"[1]
[1] చూడండి, 46:5-6 ఇక్కడ విశదపరచబడుతున్నది ఏమిటంటే, ఏ సాధూ సన్యాసులను, దర్గాలను, వలీలను, ప్రవక్తలను వీరు ఆరాధించేవారో వారు: "మాకు వీరితో ఎలాంటి సంబంధం లేదు, వీరి ఆరాధన గురించి మాకు ఏమీ తెలియదు." అంటారు. ఇంకా చూడండి, 5:116-117, 10:30, 11:21, 16:87 మరియు 28:75.
అక్కడ ప్రతి వ్యక్తీ తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ యజమాని అయిన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు మరియు వారు కల్పించుకున్న (బూటకదైవాలన్నీ) వారిని వీడి పోతాయి.[1]
[1] అంటే వారికి అక్కడ అల్లాహ్ (సు.తా.) తప్ప వారి ఏ కల్పిత దైవం కూడా పనికి రాదు.
వారిని అడుగు: "ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: "అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: "అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా?"
వారిని అడుగు: "మీరు అల్లాహ్ కు సాటిగా కల్పించుకున్న వారిలో సృష్టిని మొదటిసారి ఆరంభించేవాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా?" ఇలా అను: "సృష్టి ఆరంభించేవాడు, దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడూ కేవలం అల్లాహ్ మాత్రమే! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)?"
వారిని అడుగు: "మీరు అల్లాహ్ కు సాటి కల్పించుకున్న వారిలో సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు, ఎవడైనా ఉన్నాడా?" ఇంకా ఇలా అను: "కేవలం అల్లాహ్ యే సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు. ఏమీ? సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు విధేయతకు ఎక్కువ అర్హుడా? లేక మార్గదర్శకత్వం చేయబడితేనే తప్ప స్వయంగా సన్మార్గం పొందలేని వాడా? అయితే మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు?"
మరియు వారిలో చాలా మంది తమ ఊహలను మాత్రమే అనుసరించే వారున్నారు. నిశ్చయంగా ఊహ, సత్య (అవగాహనకు) ఏ మాత్రం పనికిరాదు.[1] నిశ్చయంగా, వారు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
[1] చాలామంది ఊహలను, అంటే తమ కల్పనలను లేక భావనలను అనుసరించే వారున్నారు. కాని సత్యం ముందు ఊహలకు, భావనలకు, కల్పనలకు ఎలాంటి స్థానం లేదు. ఖుర్ఆన్ లో 'జన్న' అనే పదం ఊహ మరియు నిశ్చయం రెండూ అర్థాలలో వాడబడింది. ఈ సందర్భాలలో ఊహ లేక కల్పన అనే అర్థంలో వాడబడింది. (ము'హమ్మద్ జూనాగఢి).
మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ కల్పించబడటం సంభవం కాదు; వాస్తవానికి ఇది (పూర్వగ్రంథాలలో) మిగిలి ఉన్న దానిని (సత్యాన్ని) ధృవపరుస్తోంది మరియు ఇది (ముఖ్య సూచనలను) వివరించే గ్రంథం; ఇది సమస్త లోకాల పోషకుని (అల్లాహ్) తరఫు నుండి వచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు!
అయినా వారు: "అతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ ను విడిచి మీరు పిలువ గలిగే వారినందరినీ (మీ సహాయానికి) పిలుచుకొని - దీని వంటి ఒక్క సూరహ్ నైనా (రచించి) తీసుకురండి!"[1]
[1] చూడండి, 2:23 వ్యాఖ్యానం 1; 11:13, 17:88 మరియు 52:34.
కాని వారు - దాని జ్ఞానాన్ని ఇముడ్చుకొనక ముందే మరియు దాన వ్యాఖ్యానం వారి వద్దకు రాకముందే - దానిని అబద్ధమని తిరస్కరించారు. వీరికి పూర్వమున్న వారు కూడా ఈ విధంగానే అబద్ధమని తిరస్కరించారు. కావున, చూశారా! ఆ దుర్మార్గుల ముగింపు ఎలా జరిగిందో!
మరియు ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే, వారితో అను: "నా కర్మలు నాకు మరియు మీ కర్మలు మీకు. నా కర్మలకు మీరు బాధ్యులు కారు మరియు మీ కర్మలకు నేను బాధ్యుడను కాను."
మరియు ఆయన (అల్లాహ్) వారిని సమావేశపరచే రోజు, ఒక దినపు ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం (ఇహలోకంలో) గడపలేదని వారు భావిస్తారు.[1] వారు ఒకరినొకరు గుర్తుపడతారు.[2] వాస్తవానికి అల్లాహ్ ను దర్శించ వలసివున్న సత్యాన్ని నిరాకరించిన వారు, తీవ్రమైన నష్టానికి గురి అవుతారు మరియు వారు మార్గదర్శకత్వాన్ని పొందలేక పోయారు.
మరియు (ఓ ముహమ్మద్!) మేము వాస్తవానికి వారికి వాగ్దానం చేసిన (శిక్షలలో) కొన్నింటిని నీకు చూపినా, లేక (అంతకు ముందే) నిన్నూ మరణింపజేసినా, వారు మా వైపుకే కదా మరలి రావలసి వున్నది. చివరకు వారి కర్మలన్నింటికీ అల్లాహ్ యే సాక్షి!
మరియు ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త (పంపబడ్డాడు). ఎప్పుడైతే వారి ప్రవక్త వస్తాడో, అప్పుడు వారి మధ్య (వ్యవహారాల) తీర్పు న్యాయంగా చేయబడుతుంది. మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు.[1]
(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప! నా కొరకు నేను కీడుగానీ, మేలుగానీ చేసుకోగలిగే శక్తి నాకు లేదు.[1] ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. వారి గడువు వచ్చినపుడు వారు ఒక ఘడియ వెనక గానీ లేక ముందు గానీ కాలేరు."[2]
[1] ఇక్కడ అల్లాహుతా'ఆలా దైవప్రవక్త ('స'అస)తో: "అల్లాహ్ కోరనిదే నాకు నేను, కీడు గానీ, మేలు గానీ, చేసుకోలేను." అని చెప్పమంటున్నాడు. దైవప్రవక్త ('స'అస) కే తన స్వంతానికి కీడుగానీ మేలుగానీ చేసుకునే శక్తి లేనప్పుడు, ఇతర వలీలకు గానీ లేక సద్పురుషులకు గానీ - జీవించి ఉన్నా లేక మరణించినా - ఇతరులకు కీడు గానీ మేలు గానీ చేయగల శక్తి ఎలా ఉండగలదు? వారిని అర్థించేవారు ఇది ఎందుకు అర్థం చేసుకోలేరు? [2] చూడండి, 7:34.
వారితో అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చూశారా)! ఒకవేళ ఆయన శిక్ష మీపై రాత్రిగానీ, లేక పగలు గానీ వచ్చి పడితే (మీరేం చేయగలరు)? అయితే దేని కొరకు ఈ అపరాధులు తొందర పెడుతున్నారు?"[1]
ఏమి? అది (ఆ శిక్ష) మీపై వచ్చిపడిన తరువాతనే మీరు దానిని నమ్ముతారా? (ఆ రోజు మీరిలా అడగబడతారు): "ఇప్పుడా (మీరు దానిని నమ్మేది)? వాస్తవానికి మీరు దాని కొరకు తొందరపడ్తూ ఉండేవారు కదా!"
మరియు (ఓ ముహమ్మద్!) వారు ఇంకా ఇలా అడుగుతున్నారు: " ఏమీ? ఇదంతా సత్యమేనా?[1] వారితో అను: "అవును, నా ప్రభువు సాక్షిగా! ఇదంతా నిశ్చయంగా, జరగబోయే సత్యమే! మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు!"
[1] "మరణించి మట్టిగా మారిపోయిన తరువాత కూడా మళ్ళీ సజీవులుగా మునపటి ఆకారంలో లేపబడతామా?" ఇలాంటి ప్రశ్నలు ఖుర్ఆన్ లో ఇంకా రెండు చోట్లలో ఉన్నాయి. 34:3, 64:7.
మరియు దుర్మార్గం చేసిన ప్రతి వ్యక్తి వద్ద ఒకవేళ వాస్తవానికి భూమిలో ఉన్న ధనమంతా ఉన్నా, దానిని అంతా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతాడు,[1] (కాని అది స్వీకరించబడదు). మరియు వారు ఆ శిక్షను చూసినప్పుడు లోలోపల పశ్చాత్తాప పడతారు. మరియు వారి మధ్య తీర్పు న్యాయంగా జరుగుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.
వినండి! నిశ్చయంగా, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తమూ, అల్లాహ్ కే చెందినది. తెలుసుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం, కాని చాలా మందికి ఇది తెలియదు.
ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం (ఈ ఖుర్ఆన్) వచ్చింది మరియు ఇది మీ హృదయాల (రోగాల) కు స్వస్థత నిస్తుంది. మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ప్రసాదిస్తుంది).[1]
ఇలా అను: "మీరు ఆలోచించారా! అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని ధర్మసమ్మతం, మరికొన్నింటిని నిషేధం చేసుకున్నారు."[1] ఇలా అడుగు: "ఏమీ అల్లాహ్ దీనికి అనుమతినిచ్చాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్ కు అంటగట్టు తున్నారా?"
మరియు అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు, తీర్పుదినమును గురించి ఏమనుకుంటున్నారు? నిశ్చయంగా, అల్లాహ్ మానవుల యెడల అత్యంత అనుగ్రహం కలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు.
మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ కార్యంలో ఉన్నా మరియు ఖుర్ఆన్ నుండి నీవు దేనిని పఠిస్తూ ఉన్నా మరియు (ఓ మానవులారా!) మీరు ఏమి చేస్తూ ఉన్నా! మీరు మీ పనులలో నిమగ్నులై ఉన్నప్పుడు, మేము మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాము. భూమ్యాకాశాలలో ఉన్నటువంటి ఒక రవంత (పరమాణువంత) వస్తువైనా, దాని కంటే చిన్నదైనా లేదా పెద్దదైనా, నీ ప్రభువు దృష్టి నుండి మరుగుగా లేదు. అదంతా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది.[1]
వినండి! నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు అల్లాహ్ ను కాదని ఆయనకు భాగస్వాములను కల్పించి వారిని ప్రార్థించేవారు, ఎవరిని అనుసరిస్తున్నారు? వారు అనుసరిస్తున్నది కేవలం తమ భ్రమలనే. మరియు వారు కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు.
"అల్లాహ్ (ఒకడ్ని) కొడుకుగా చేసుకున్నాడు."[1] అని వారు (యూదులు మరియు క్రైస్తవులు) అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందుతుంది! ఇలా అనటానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? ఏమీ? అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలు అంటారా?
[1] యూదులు అంటారు: " 'ఉ'జైర్ ('అ.స.) అల్లాహ్ కొడుకు." అని. క్రైస్తవులు అంటారు : "ఏసుక్రీస్తు అల్లాహ్ కొడుకు." అని, కుమారుడు ఉండాలని, వారే కోరుతారు, ఎవరైతే తమ మరణం తరువాత తమ ఆస్తిపాస్తులకు వారసుడు ఉండాలని కోరుతారో! అల్లాహ్ (సు.తా.) నిత్యుడు, సజీవుడు, అంతా నశించిన తరువాత కూడా మిగిలి ఉండేవాడు. విశ్వంలో ఉన్న సమస్తమూ ఆయనకే చెందినది. ఆయనే సర్వానికి వారసుడు. అలాంటప్పుడు, ఆయనకు కొడుకు అవసరం ఎందుకుంటుంది. చూడండి, 2:116, 19:90-92 మరియు 6:100.
ఇహలోకంలో వారు కొంతకాలం సుఖాలు అనుభవించవచ్చు! కాని తరువాత మా వైపునకే, వారికి మరలి రావలసి ఉంది. అప్పుడు మేము వారి సత్యతిరస్కారానికి ఫలితంగా, వారికి కఠినశిక్షను రుచి చూపుతాము.
మరియు వారికి నూహ్ గాథను వినిపించు.[1] అతను తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నా జాతి సోదరులారా! నేను మీతో ఉండటం మరియు అల్లాహ్ సూచన (ఆయాత్) లను బోధించటం, మీకు బాధాకరమైనదిగా ఉంటే! నేను మాత్రం అల్లాహ్ నే నమ్ముకున్నాను. మీరూ మరియు మీరు అల్లాహ్ కు సాటి కల్పించినవారూ, అందరూ కలిసి ఒక (పన్నాగపు) నిర్ణయం తీసుకోండి, తరువాత మీ నిర్ణయంలో మీకెలాంటి సందేహం లేకుండా చూసుకోండి. ఆ పిదప ఆ పన్నాగాన్ని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి; నాకు ఏ మాత్రం వ్యవధి నివ్వకండి.
[1] నూ'హ్ ('అ.స.) వివరాలకు చూడండి, 11:36-48 మరియు 7:59-64.
"కాని, ఒకవేళ మీరు వెనుదిరిగితే, నేను మాత్రం మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు! నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ దగ్గర ఉంది. మరియు నేను కేవలం అల్లాహ్ కే విధేయుడను (ముస్లిం) అయి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను."[1]
[1] నూ'హ్ ('అ.స.) యొక్క ఈ మాటల నుండి తెలిసేదేమిటంటే ప్రవక్తలందరూ, ఇస్లాం - అంటే, ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) కే విధేయులై ఉండాలని - బోధించారు. చూడండి, 27:91, 2:131-132, 12:101, 10:84, 7:126, 27:44, 5:111 మరియు 6:162-163.
కాని, వారు అబద్ధీకుడని తిరస్కరించారు. కావున మేము అతనిని మరియు అతనితో పాటు ఓడలో ఉన్నవారిని రక్షించి, వారిని భూమికి వారసులుగా చేశాము. మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారిని ముంచి వేశాము. కావున చూడండి, హెచ్చరిక చేయబడినా (విశ్వసించని) వారి గతి ఏమయిందో!
అతని (నూహ్) తరువాత ప్రవక్తలను వారి వారి జాతులవారి వద్దకు పంపాము. వారు, వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చినా! వారు మొదట అబద్ధమని తిరస్కరించిన విషయాన్ని మళ్ళీ విశ్వసించ లేక పోయారు. ఈ విధంగా మేము హద్దులు మీరి ప్రవర్తించే వారి హృదయాల మీద ముద్ర వేస్తాము.
వారన్నారు: "మా తండ్రితాతలు నడిచిన మార్గం నుండి మమ్మల్ని మళ్ళించాలని మరియు మీ ఇద్దరి పెద్దరికాన్ని భూమిలో స్థాపించాలనా, మీరిద్దరూ వచ్చింది? మరియు మేము మీ ఇద్దరినీ ఏ మాత్రం విశ్వసించము!"
కాని ఫిర్ఔన్ మరియు అతని నాయకులు తమను హింసిస్తారేమో అనే భయంతో! అతని జాతివారి లోని కొందరు ప్రజలు తప్ప ఇతరులు మూసాను విశ్వసించలేదు.[1] మరియు వాస్తవానికి, ఫిర్ఔన్ దేశంలో ప్రాబల్యం వహించి ఉండేవాడు. మరియు నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారిలో ఒకడుగా ఉండేవాడు.
మరియు మూసా అన్నాడు: "నా జాతి ప్రజలారా! మీకు నిజంగానే అల్లాహ్ మీద విశ్వాసం ఉంటే మరియు మీరు నిజంగానే అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయితే, మీరు ఆయన (అల్లాహ్) పైననే నమ్మకం ఉంచుకోండి."[1]
మరియు మేము మూసాకు మరియు అతని సోదరునికి ఇలా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మీరు, మీ జాతివారి కొరకు ఈజిప్టులో గృహాలను సమకూర్చుకోండి. మరియు మీ గృహాలను, ప్రార్థనా స్థలాలుగా చేసుకొని నమాజ్ లను స్థాపించండి.[1] మరియు విశ్వాసులకు శుభవార్తలు ఇవ్వు."
[1] దీని అర్థం ఏమిటంటే ఫిర్'ఔన్ జాతివారి దౌర్జన్యాల నుండి తప్పించుకోవటానికి వారితో: "మీరు మీ ఇండ్లలోనే ప్రార్థనాస్థలాలు ఏర్పాటు చేసుకొని, బైతుల్ మఖ్దిస్ వైపునకు మరలి ప్రార్థనలు చేయండి." అని ఆదేశమివ్వబడింది.
మూసా ఇలా ప్రార్థించాడు: "ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు ఫిర్ఔన్ కు మరియు అతని నాయకులకు ఇహలోక జీవితంలో వైభవం మరియు సంపదలను ప్రసాదించావు. ఓ మా ప్రభూ! వారిని (ప్రజలను) నీ మార్గం నుండి తప్పించటానికా ఇవి? ఓ మా ప్రభూ! వారి సంపదలను ధ్వంసం చేయి, వారి హృదయాలపై కఠినావస్థను కలుగజేయి, ఎందుకంటే వారు కఠిన శిక్షను చూసేంతవరకు విశ్వసించరు!"[1]
[1] నూ'హ్ ('అ.స.) 950 సంవత్సరాల వరకు ధర్మ ప్రచారం చేసినా కూడా అతని జాతివారు, ఇస్లాం వైపుకు రాలేదు, వారు అతని ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆ తరువాత అతను సహించలేక చేసిన శాపాన్ని గురించి చూడండి, 71:26. అదేవిధంగా మూసా ('అ.స.) కూడా సహించుకోలేక వారి మీదకు ఆపదలను పంపమని అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించారు.
(అల్లాహ్) సెలవిచ్చాడు: "మీ ఉభయుల ప్రార్థన అంగీకరించబడింది. మీరిద్దరూ (ఋజుమార్గంపై) స్థిరంగా ఉండండి. మీరిద్దరూ తెలివి లేని వారి మార్గాన్ని అనుసరించకండి."
మరియు మేము ఇస్రాయీల్ సంతతి వారిని సముద్రం దాటించాము. ఆ పిదప ఫిర్ఔన్ మరియు అతని సైనికులు దౌర్జన్యంతో మరియు శతృత్వంతో వారిని వెంబడించారు. చివరకు (ఫిర్ఔన్) మునిగిపోతూ అన్నాడు:[1] "నిశ్చయంగా, ఇస్రాయీల్ సంతతివారు విశ్వసించిన దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నేను విశ్వసించాను. నేను విధేయులలో (ముస్లింలలో) చేరాను!"
[1] ఖుర్ఆన్ లో పేర్కొనబడిన కథలు గుణపాఠం నేర్చుకోవటానికే ఉన్నాయి. కానీ కథలు చెప్పాలనే ఉద్దేశ్యంతో కాదు. చూడండి ఖుర్ఆన్, 2:50 మరియు సూరహ్ అష్-షు'అరా.
(అతనికి ఇలా జవాబివ్వబడింది): "ఇప్పుడా[1], (నీవు విశ్వసించేది? మరియు వాస్తవానికి నీవు, ఇంత వరకు ఆజ్ఞోల్లంఘన చేస్తూ ఉన్నావు మరియు దౌర్జన్యపరులలో చేరి ఉన్నావు కదా!
మరియు వాస్తవానికి మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఉండటానికి మంచి స్థానాన్ని ఇచ్చి, వారికి ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించాము. మరియు వారి వద్దకు దివ్యజ్ఞానం వచ్చినంత వరకు వారి మధ్య భేదాభిప్రాయాలు రాలేదు. నిశ్చయంగా, నీ ప్రభువు పునరుత్థాన దినమున వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గురించి తీర్పు చేస్తాడు.
(ఓ ముహమ్మద్) ఒకవేళ నీ వైపునకు అవతరింప జేయబడిన విషయాలను గురించి నీకేమైనా సందేహముంటే నీకు పూర్వం వచ్చిన గ్రంథాన్ని చదువు తున్న వారిని అడుగు! వాస్తవంగా, నీ ప్రభువు తరఫు నుండి నీ వద్దకు సత్యం వచ్చింది. కావున నీవు సందేహించే వారిలో చేరకు;
యూనుస్ జాతివారు తప్ప! ఇతర ఏ పురవాసులకు కూడా, (శిక్షను చూసిన తరువాత) విశ్వసించగా, వారి విశ్వాసం వారికి లాభదాయకం కాలేక పోయింది! (యూనుస్ జాతి) వారు విశ్వసించిన పిదప మేము వారి నుండి ఇహలోక జీవితపు అవమానకరమైన శిక్షను తొలగించాము. మరియు వారిని కొంతకాలం వరకు వారికి (ఇహలోక జీవితాన్ని) అనుభవించే అవకాశాన్ని ఇచ్చాము.[1]
[1] యూనుస్ ('అ.స.) 'నైనవా' (Nineveh) వాసులకు ధర్మప్రచారం చేశారు. కాని వారతనిని తిరస్కరించారు. దానికి అతను కోపపడి ఉద్రేకంతో వారిని శపించి వెళ్ళిపోయారు. వారి పైకి శిక్ష రావడం చూసి ప్రజలందరూ ఒక మైదానంలో చేరుకొని అల్లాహ్ (సు.తా.) ను మన్నించమని ప్రార్థించారు. వారి క్షమాపణను అంగీకరించి అల్లాహ్ (సు.తా.) వారి శిక్షను తొలగించాడు. ఆ తరువాత వారు అల్లాహ్ (సు.తా.)కు విధేయు(ముస్లిం)లయ్యారు. ఈ విధంగా శిక్షను చూసిన తరువాత క్షమాపణ అంగీకరించబడిన వారు కేవలం యూనుస్ ('అ.స.) జాతి ప్రజలు మాత్రమే. ఇంకా చూడండి, 21:87-88, 37:139-148, (ఫ'త్హ అల్ -'ఖదీర్).
ఇప్పుడు వారు, తమకు పూర్వం గతించిన వారికి సంభవించిన దినాల కోసం తప్ప మరి దేని కోసం నిరీక్షిస్తున్నారు? వారితో అను: "మీరూ నిరీక్షించండి! నిశ్చయంగా, నేను కూడా మీతో పాటే నిరీక్షిస్తాను!"
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "ఓ మానవులారా! నా ధర్మాన్ని గురించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వారిని నేనెన్నడూ ఆరాధించను. అంతేకాదు, నేను అల్లాహ్ నే ఆరాధిస్తాను. ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని ఆదేశించబడ్డాను."
(నేను ఇలా ఆజ్ఞాపించబడ్డాను): "నీవు మాత్రం సత్యధర్మమైన ఏకదైవ సిద్ధాంతాన్నే అనుసరించు. మరియు ఎన్నటికీ అల్లాహ్ కు సాటి కల్పించేవారిలో (షిర్క్ చేసేవారిలో) చేరకు.
మరియు అల్లాహ్ ను వదలి నీకు లాభంగానీ మరియు నష్టం గానీ కలిగించలేని దానిని నీవు ప్రార్థించకు. ఒకవేళ నీవు అలా చేస్తే! నిశ్చయంగా, నీవు దుర్మార్గులలో చేరిన వాడవుతాడు."
ఒకవేళ అల్లాహ్ నీకు ఏదైనా ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయదలిస్తే, ఆయన అనుగ్రహాన్ని ఎవ్వడూ మళ్ళించలేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మరియు ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "ఓ మానవులారా! వాస్తవంగా, మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు సత్యం వచ్చి ఉన్నది. ఇక ఎవడు సన్మార్గాన్ని అనుసరిస్తాడో! నిశ్చయంగా, అతడు తన మేలుకే సన్మార్గాన్ని అనుసరిస్తాడు. ఇక ఎవడు మార్గభ్రష్టుడవుతాడో నిశ్చయంగా, తనకే నష్టం కలిగించు కుంటాడు. నేను మీ బాధ్యత వహించేవాడను కాను!"
మరియు (ఓ ప్రవక్తా!) నీపై అవతరింప జేయబడిన సందేశాన్ని (వహీని) అనుసరించు. మరియు అల్లాహ్ తీర్పు చేసే వరకు నీవు ఓర్పు వహించు. మరియు న్యాయాధిపతులలో ఆయనే అత్యుత్తముడు.
Contents of the translations can be downloaded and re-published, with the following terms and conditions:
1. No modification, addition, or deletion of the content.
2. Clearly referring to the publisher and the source (QuranEnc.com).
3. Mentioning the version number when re-publishing the translation.
4. Keeping the transcript information inside the document.
5. Notifying the source (QuranEnc.com) of any note on the translation.
6. Updating the translation according to the latest version issued from the source (QuranEnc.com).
7. Inappropriate advertisements must not be included when displaying translations of the meanings of the Noble Quran.
搜索结果:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".